1.రైతులు కన్నెర్రజేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి
` పోరాడిన రైతులపై దేశద్రోహం ముద్రవేస్తారా!
` కేంద్రం రైతుల రక్తాన్ని తాగాలని చూస్తోంది.. మేందానిని అడ్డుకుంటాం
` ఇంతటి సమస్యలున్న దేశం లేనేలేదు
` దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్‌ఎలా మర్చిపోతాం..
` ప్రాణాలు తీసినా.. విూటర్లు బిగించమని తెగేసి చెప్పినా
` తెలంగాణ సర్కార్ ఉద్యమానికి అండగా వుంటుంది..
` ఉద్యమంలో అమరులైన 600 రైతు కుటుంబాలకు ఆర్ధికసహాయం
` ఒక్కోకుటుంబానికి రూ.3లక్షల చొప్పున అందజేత
న్యూఢల్లీి,మే22(జనంసాక్షి):రైతులకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అస్సలు గిట్టనే గిట్టదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మండిపడ్డారు. ఏదో విధంగా వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని వారికి ధైర్యం కలిపించారు. తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తామంతా అండగా వున్నామని కేసీఆర్ పూర్తి భరోసానిచ్చారు.దేశ వ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా వుంటుందని, వాటికి మద్దతిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢల్లీి సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ?.స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడచినా.. ఇంకా ఇలాంటి సమావేశాలు నిర్వహించడం అత్యంత బాధాకరం. ఇదేవిూ సంతోషించాల్సిన సందర్భం కాదు. ఇలాంటి సభలు చూసినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. బాధేస్తుంది. దేశం ఎందుకిలా వుందని అనిపిస్తుంది. దీని గురించి ఆలోచించాలి. దీని మూలాలేమిటో ఆలోచించాలి. చర్చ కూడా జరగాలి. భారతదేశానికి చెందిన ఓ పౌరుడిగా చర్చ జరగాలని కోరుకుంటున్నా. అయితే.. సమస్యల్లేని దేశం ఉందని నేను అనను. సమస్యలున్న దేశాలున్నాయి.కానీ ఇలాంటి సమస్యలున్న దేశాలు మాత్రం లేవు. రైతు సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచి, రైతులు తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేసుకున్నారని, వారందరికీ శతకోటి ప్రణామాలు అయితే రైతు ఉద్యమంలో అసువులు బాసిన వారిని తిరిగి తీసుకురాలేం. రైతు కుటుంబాలు ఒంటరిగా లేవు. దేశంమొత్తం విూకు అండగా వుంది.షహీద్ భగత్ సింగ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న రాఫ్ట్రం పంజాబ్. దేశానికి పంజాబ్ రాష్ట్రం గొప్ప సేవలు చేసింది. వాటిని ఎవ్వరూ మరిచిపోలేరు. దేశవ్యాప్తంగా అన్నపానాదులకు కష్టంగా ఉన్న సమయంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో పంజాబ్ రైతులు దేశానికి అన్నం పెట్టారు. ఇంత గొప్ప సేవలు చేసిన పంజాబ్ రైతులను మరిచిపోరు. వారి సేవలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.చైనా సైనికులతో దేశం కోసం కొట్లాడి, అమరులైన కల్నల్ సంతోశ్‌బాబు మా తెలంగాణ ప్రాంతం వారు. ఆయనతో పాటు పంజాబ్ సైనికులు కూడా వీరమరణం పొందారు. ఆ ఘటన తర్వాత వీర మరణం పొందిన పంజాబ్ కుటుంబాలను పరామర్శించాలని నేను అనుకున్నా. కానీ.. ఆ సమయంలో ఎన్నికలు జరిగాయి. అందుకే రాలేకపోయా. ఈ విషయాన్ని ఢల్లీి సీఎం కేజ్రీవాల్‌తో కూడా పంచుకున్నా. ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి, నా కార్యక్రమానికి మద్దతిచ్చారు.దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా రైతుల కోసం ఎంతో చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక మునుపు మా రైతుల గోస వర్ణనాతీతం. ఒక్క రోజే 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యుత్ సమస్య కూడా వుండేది. అర్ధరాత్రి కరెంట్ సరఫరా వల్ల ఎందరో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ మా ప్రభుత్వం 24 గంటలూ రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కరెంట్ మోటార్లకు విూటర్లు పెట్టాలన్న కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇలా రైతుల రక్తాన్ని తాగాలని చూస్తోంది. మా ప్రాణాలు పోయినా.. మేం మాత్రం విూటర్లు బిగించమని అసెంబ్లీ నుంచే తీర్మానం చేసేశాం. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం మంచి పనులు చేస్తే కేంద్రానికి సహించదు. ఏదో విధంగా ఒత్తిడి తెస్తుంది.నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తే వారిని ఖలిస్తాన్ ఉగ్రవాదులంటూ ఆరోపణలు చేశారు. ఇది దురదృష్టకరం. రైతు ఉద్యమానికి మేం మద్దతిస్తున్నాం. చెమటోడ్చి రైతులు పంటలు పండిస్తున్నారు. దేశంలోని రైతులందరూ ఉద్యమంలోకి రావాలి. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉంది. కనీస మద్దతు ధర విషయంలో ఏ ప్రభుత్వమైతే చట్టబద్ధత కల్పిస్తుందో? వారికే మద్దతివ్వాలి. ఇంతటి ఐక్యత దేశ వ్యాప్త రైతుల్లో రావాలి. రైతు ఫ్రెండ్లీ ఉన్న ప్రభుత్వాలు విూకు మద్దతుగా నిలుస్తాయి. మా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు ఉద్యమానికి అండగా వుంటుంది. మేం కూడా పూర్ణంగా మద్దతిస్తాం. విూరు మాత్రం ఆందోళన చేయండి. ఇదొక్కటే విజ్ఞప్తి.మిత్రులారా.. ప్రాణాలు కోల్పోయిన రైతుల ప్రాణాలను తిరిగి వెనక్కి తీసుకురాలేను. విూకు స్వాంతన చేకూర్చడానికే వచ్చాను. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నా. రైతు కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. అంటూ సీఎం కేసీఆర్ ముగించారు.కేసీఆర్ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు.కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఈ విందు సమావేశంలో.. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి తదితర అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.మధ్యాహ్న భోజనం తర్వాత కేజ్రీవాల్, కేసీఆర్ చండీగఢ్ వెళ్లనున్నారు.
2.బారాణాపెంచి చారాణా తగ్గించారు
` శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా
హైదరాబాద్,మే22(జనంసాక్షి): పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించినట్టు’ ఉందని.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీ దవాఖానలో విూడియాతో మాట్లాడాడారు. ‘బారాణా పెంచి.. చారానా తగ్గించి పాలాభిషేకాలు చేయించుకుంటున్నరు. నిజంగా నిజాయితీ ఉంటే మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన్నాడు పెట్రోల్, డీజిల్ విూద ఉన్న పన్నులనే అమలు చేయండి’ అని డిమాండ్ చేశారు. 2014 మార్చిలో డీజిల్ విూద సెస్సు రూ.3.46 ఉండేదని, బీజేపీ దానిని రూ.31 కి పెంచిందన్నారు.బీజేపీ తాజా తగ్గింపుతో తిరిగి రూ.3కు రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం డీజిల్‌పై రూ.7.40, పెట్రోల్‌పై రూ.16.40 సెస్ ఉన్నదని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక్కసారి కూడా పెంచలేదని స్పష్టం చేశారు. ‘మేం పెంచితే కదా.. తగ్గించడానికి. విూరు 2014లో ఎంత సెస్ ఉందో అక్కడికి తగ్గించి మాట్లాడండి’ అని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాంతాడంత పెంచి.. మూరెడు దించారని కేంద్రాన్ని విమర్శించారు. 2014లో సిలిండర్ ధర దాదాపు రూ.400 ఉండేదని, ఇప్పుడు దాన్ని రూ.వెయ్యికి పెంచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 పెంచి రూ.200 తగ్గించిందని గుర్తు చేశారు.ఈ తగ్గింపు కూడా ఉజ్వల్ పథకం లబ్ధిదారులకేనని.. అంటే 10 మందికి పెంచి, చారాణా మందికి తగ్గించారని ఎద్దేవా చేశారు. ఈ మాత్రం దానికే ‘మేం తగ్గించినం అని చపట్లు కొట్టుకునుడు.. జబ్బలు చరుచుకునుడు ఏంది?’ అని నిలదీశారు. దమ్ముంటే అప్పుడున్న ధర రూ.400కు తగ్గించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. గతంలో గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ రూ.400 ఉండేదని, దాన్ని కొంత కొంత తగ్గిస్తూ ఇప్పుడు పూర్తిగా ఎత్తేశారని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధర తగ్గింపుపై బీజేపీ చేసే ప్రచారం అంతా హంబక్.. బోగస్ అని కొట్టిపారేశారు.
3.తగ్గింపు పేరుతో కేంద్రం డ్రామాలు
` పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్,మే22(జనంసాక్షి):పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్‌ను రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం.. కంటితుడుపు చర్యగా స్వల్పంగా ధరలను తగ్గించింది. అయినా ఇంకా ధరలు సామాన్యుడికి భారంగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ముందు అసలు ధరలు పెంచింది ఎవరు.. ఇప్పుడు తగ్గింపు పేరుతో ప్రజలను మోసం చేస్తుంది ఎవరూ అంటూ ప్రశ్నించారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ‘నా పాఠశాల పక్కన ఉన్న ఓ దుకాణాదారుడు పీక్ సీజన్‌లో ధరలను 300శాతం పెంచి.. ఆపై ప్రజలను మోసం చేయడానికి దానిని 30శాతం తగ్గించే వాడు. అతని సన్నిహితులు దాన్ని బంఫర్ ఆఫర్‌గా అభివర్ణిస్తూ.. అతనికి ధన్యవావాలు తెలిపేవారు. ఇది ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా?? ముందు అసలు ధరలు పెంచింది ఎవరు..?’ అని ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు ఇలాంటి పని చేసేది ఇంకెవరూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటూ సమాధానాలు ఇచ్చారు.‘ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 2014లో రూ.3.57, 2022 నాటికి రూ.27.90 అంటే పెంచింది రూ.18.42.. ఇప్పుడు తగ్గించింది రూ.8.. డీజిల్‌పై 2014లో 3.57, 2022 నాటికి అది రూ.21.80 అంటే పెంచింది రూ.18.23, ఇప్పుడు తగ్గించింది రూ.6’ పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత.. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో వ్యాట్‌ను ఒక్కపైసా పెంచలేదు.’ ‘మోడీ ఫిల్లింగ్ స్టేషన్.. పెట్రోల్, డీజిల్‌పై సెస్` ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచారు. యూపీ ఎన్నికల తరువాత ఎవరూ ఊహించనంత ధరలు పెంచారు. కానీ, ఇప్పుడు దాన్ని స్వల్పంగా తగ్గించారు. దీన్నే మోడీ స్ట్రోక్’ అంటారు అంటూ ట్వీట్లు చేశారు.కాగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వెనుక ఉన్న వాస్తవాలను మేధావులు, రాజకీయ నాయకులు బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే నిన్నటి తగ్గింపుతో రాష్ట్రాలకు రావాల్సిన రాబడి పోయిందని.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసలు వెల్లడిరచలేదని విమర్శించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఇంధన సెస్‌ను ఏమాత్రం తగ్గించలేదని మండిపడ్డారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ‘స్పీన్ డాక్టర్ నిర్మలా సీతారామన్.. విూకు చెప్పని విషయం ఏంటంటే.. ఇంధన ఎక్సైజ్ డ్యూటీపై 42శాతం వాటా రాష్ట్రాలది. నిన్నటి కోతలతో రాష్ట్రాలు పెట్రోల్‌పై రూ.2.52, డీజిల్‌పై రూ.3.36 రాబడిని కోల్పోతున్నాయి. ఆర్థిక మంత్రి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఇంధన సెస్‌ను తాకకుండా వదిలేశారు. ఇది కేవలం కంటి తుడుపు చర్య’ అని పేర్కొన్నారు.
దావోస్‌కు కేటీఆర్
` డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొననున్న మంత్రి
దావోస్,మే22(జనంసాక్షి):నాలుగు రోజులపాటు లండన్‌లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆదివారం లండన్ నుంచి దావోస్‌కు బయలుదేరారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటారు. సోమవారం నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో సమావేశమవుతారు.మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో, ప్రధాన సమావేశ మందిరంలో జరిగే పలు చర్చల్లో పాల్గొంటారు. అనంతరం 26వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు బయల్దేరిన మంత్రి బృందానికి లండన్‌లోని టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖ కార్యకర్తలు, ఎన్‌ఆర్‌ఐలు వీడ్కోలు పలికారు.
స్విట్జర్లాండ్ లో మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్న మంత్రి కె తారక రామారావుకు తెలంగాణ ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. టిఆర్‌ఎస్ పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ స్విట్జర్లాండ్ విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
4.విస్తరిస్తున్న మంకీపాక్స్
` హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూఢల్లీి,మే22(జనంసాక్షి): కరోనా మహమ్మారి తర్వాత మరో వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తున్నది. అదే మంకీపాక్స్ వైరస్. ప్రస్తుతం వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్నది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ కేవలం పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిందని, 92 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కేసులు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మంకీపాక్స్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందింది. మనదేశంలో తట్టు లాగే కనిపిస్తుంది. ఈ వైరస్‌ను మొదట 1958లో మొదటిసారి కోతుల్లో గుర్తించారు. దీంతో దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మనుషులకు సోకింది. 1970ల్లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అందులోనూ ఎక్కువగా ఎలుకలు, చుంచులు, ఉడతల నుంచి వ్యాపిస్తుంది. ఈ మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుంది. మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ సాధారణంగా 6 నుంచి 13 రోజులు ఉంటుంది. అయితే, కొంతమందిలో ఐదు రోజుల నుంచి 21 రోజుల వరకు ఉంటుంది.వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్ను, కండరాల నొప్పులు ఉంటాయి. రోగి ముఖం, చేతులు, కాళ్లపై పెద్ద పరిమాణంలో దద్దుర్లు ఉంటాయని, కొన్ని తీవ్రమైన కేసుల్లో దద్దుర్లు కంటి కార్నియాను సైతం ప్రభావితం చేస్తాయి. కొందరిలో లక్షణాలు కనిపించవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంకీపాక్స్ కారణంగా మరణాలు సైతం సంభవిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్రమాదం ఎక్కువ. గాలి తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండడంతో ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
5.నిఖత్ జరీన్‌కు రూ.5లక్షల నజరానా ప్రకటించిన రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,మే22(జనంసాక్షి): ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన నిఖత్ జరీన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభినందించి రూ.5లక్షల నజరానా ప్రకటించారు.ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడిరచారు. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. గతంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా విూర్జాలకు ఇచ్చినట్లు నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పారితోషికం ఇచ్చి ఆదరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
6.అసోంలో లాకప్‌డెత్
` పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టిన బాధితులు
` ప్రతిగా బుల్‌డోజర్లలో బాధితుల ఇళ్లను కూల్చేన పోలీసులు
భువనేశ్వర్,మే22(జనంసాక్షి):అస్సాం నగావ్‌జిల్లాలో పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించిన ఘటనలో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కారకులైన ఐదు కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు.కేసుకు సంబంధించి 23 మందిని అదుపులోకి తీసుకున్నామని డీఐజీ సత్యరాజ్? హజారికా తెలిపారు. నిందితుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు సజావుగా సాగుతోందని, బటద్రవా స్టేషన్? ఇంఛార్జ్?ను సైతం సస్పెండ్? చేసినట్లు డీఐజీ వెల్లడిరచారు. పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించడం లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మృతుడి బంధువుల్లో పలువురికి క్రిమినల్ రికార్డులు ఉన్నాయని తెలిపారు.అసోం నగావ్ జిల్లాలోని బటద్రవా పోలీస్?స్టేషన్‌కు గుర్తుతెలియని దుండగులు శనివారం నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. సలోనిబరి ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారి సఫీకుల్ ఇస్లాం శుక్రవారం రాత్రి వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి వెళుతుండగా.. బటద్రవా పోలీసులు అడ్డుకొని అతడి నుంచి రూ. 10వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వకపోవడంతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి.. కుటుంబ సభ్యుల ముందే కొట్టినట్లు స్థానికులు ఆరోపించారు.సఫీకుల్ కుటుంబసభ్యులు తిరిగి రూ.10వేలతో పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. అప్పటికే అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన సఫీకుల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌ను ముట్టడిరచి నిప్పంటించారు.
7.ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలి..
` ప్రధాని మోదీ పిలుపు
న్యూఢల్లీి,మే22(జనంసాక్షి):దేశంలోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం ప్రధాని ఆన్‌లైన్ వేదికగా తన సందేశం అందజేశారు. అందరి కోసం పాటుపడాలంటూ మన సాధువులు ఎల్లప్పుడూ ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. గణపతి సచ్చిదానంద స్వామి జీవితం సైతం సమాజ సేవ, దానధర్మాలతో నిండి ఉందని.. అనేక ఆశ్రమాలు, పెద్ద సంస్థ, వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇది కనిపిస్తుందని కొనియాడారు.’ప్రస్తుతం ప్రపంచం మన స్టార్టప్‌లను భవిష్యత్తుగా చూస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’.. ప్రపంచ అభివృద్ధికి ఆశాకిరణంగా మారుతోంది. ఈ క్రమంలోనే మన ఆధ్యాత్మిక కేంద్రాలు.. స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాన’ని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధి కోసం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అనే మంత్రంతో సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. ‘దేశ అమృతోత్సవాల సందర్భంలో స్వామి 80వ జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నాం. స్వార్థానికి తావులేకుండా ప్రజాసేవకు అంకితం కావాలని మన ఆధ్యాత్మికవేత్తలు మనలో ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తారు’ అని అన్నారు. మరో నెల రోజుల్లో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ.. యోగా, యువత.. ఈ రెండు నేడు భారత్‌కు గుర్తింపుగా మారాయని చెప్పారు.
8.ఇంధన ధరల తగ్గింపు పేరుతో ప్రభుత్వం వంచన
భాజపాపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
దిల్లీ,మే22(జనంసాక్షి): గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించిన సంగతి తెలిసిందే.అయితే, ప్రభుత్వ నిర్ణయం కంటితుడుపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారీ స్థాయిలో తగ్గించామని పేర్కొంటూ భాజపా వంచనకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఇకనైనా ప్రజలను మోసం చేయడం ఆపాలని.. రికార్డు స్థాయిలో దూసుకెళ్తోన్న ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు నిజమైన ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.మే 1, 2020, ప్రస్తుతం పెట్రోల్ ధరను పోలుస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘మే 1, 2020 న పెట్రోల్ ధర రూ.69.5గా ఉంది. మార్చి 1, 2022కి అది రూ.95.4కు పెరిగింది. మే 1 నాటికి రూ105.4కు చేరుకుంది. మళ్లీ మే 22నాటికి రూ. 96.50కి చేరింది. ప్రజలను మోసం చేయడం ఆపాలి. మండిపోతోన్న ధరల నుంచి వారికి నిజమైన ఉపశమనం కల్పించాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక పెట్రోల్ ధరల తగ్గింపునపై మాట్లాడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్.. రాజకీయ జిమ్మిక్కులపై అధిక శ్రద్ధ చూపుతోన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించడంలో మాత్రం వెనుకబడిపోయిందని విమర్శించారు. పెట్రోల్‌పై గడిచిన 60 రోజుల్లో రూ.10 పెంచి ఇప్పుడు రూ.9.5 తగ్గించడం కుతంత్రం కాదా? అని ప్రశ్నించారు. మరోవైపు గత 18 నెలల్లో ఎల్‌పీజీ ధర రూ.400 పెంచి ఇప్పుడు రూ.200 తగ్గించామని చెప్పడం దారుణమన్నారు. ఇలా ఇంధన ధరల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చడమేనని కేంద్ర ప్రభుత్వంపై దుయ్యబట్టారు.ఇదిలాఉంటే, నిత్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసే ప్రయత్నంలో భాగంగా లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వచ్చింది. ఎక్సైజ్ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనుందని పేర్కొంది. ఈ సమయంలో రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
9.నేటి నుంచి పది పరీక్షలు..
` 5నిమిషాలు ఆలస్యమైతే అనుమతించరు
` విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు
హైదరాబాద్,మే22(జనంసాక్షి):రాష్ట్రంలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.మే 23 నుంచి జూన్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు వారి కేంద్రాలకు చేరుకోవాలి. 9.35 తరువాత అంటే 5 నిమిషాలు దాటితే లోపలకు అనుమతించబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో 5,09,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 75,083 మంది హాజరుకానున్నారు. విద్యార్థులందరూ కరోనా నిబంధనల మేరకు మాస్క్ ధరించాలి. హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. కరోనా కారణంగా ఎన్‌సీఈఆర్‌టీ సూచనల మేరకు పరీక్ష పేపర్ల సంఖ్యను 11 నుంచి 6కు తగ్గించినట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రశ్నపత్రంలో ఛాయిస్ ఎక్కువగా ఇవ్వనున్నామని, విద్యార్థులు చదివిన పాఠశాలలకు దగ్గర్లో పరీక్ష కేంద్రాలు కేటాయించామని వెల్లడిరచింది. జనరల్ సైన్స్‌లో భాగంగా భౌతిక, జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు వేరుగా ఇస్తామంది. ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, రాష్ట్రవ్యాప్తంగా 144 స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. వేసవి కారణంగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎం, ఆశా ఉద్యోగి అవసరమైన మందులతో సిద్ధంగా ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతుందని, పరీక్ష పూర్తయ్యేవరకు జిరాక్సు కేంద్రాలు మూసివేస్తామని పాఠశాల విద్యాశాఖ వివరించింది.విద్యార్థులు ఆందోళన చెందకుండా.. ఆత్మవిశ్వాసంతో.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఆయాకేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని వివరించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని, విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కారం కోసం సంచాలకుల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.
10.మృత్యు దారులు
` యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
` ఆంధ్రా,తెలంగాణలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మృతి
లఖ్‌నవూ,మే22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.అంత్యక్రియలకు హాజరై బొలెరో వాహనంలో 11 మంది తిరిగి వస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధార్థ్‌నగర్ జిల్లాలోని జోగియా కొట్వాలి ప్రాంతంలో వీరి వాహనం అదుపుతప్పి ఆగివున్న ట్రక్కును ఢీకొంది. మితివిూరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సవిూప ఆస్పత్రికి తరలించారు. కాగా ఆంధ్రా,తెలంగాణలో ఆదివారం రహదారులు నెత్తురోడాయి. ఆరు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆయా ప్రాంతాల్లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.వరంగల్‌లోని ఖమ్మం బైపాస్ హంటర్ రోడ్డు ఫ్లైఓవర్ నుంచి కారు కిందపడిరది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతిచెందిన వారిని ప్రభుత్వ ఉద్యోగి సారయ్య(42), ఆయన భార్య సుజాత(39)గా గుర్తించారు. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తున్న కారు ఫ్లైఓవర్ విూద మరో కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరూ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని దాసుతండా సవిూపంలో ఆదివారం తెల్లవారుజామున బైక్‌ను వెనుకవైపు నుంచి వచ్చిన బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను మండలంలోని ఎర్రాయిగూడెంకి చెందిన ఈసం హనుమంతు (34), ఈసం స్వామి (42)గా గుర్తించారు. వీరిద్దరూ పెళ్లిలో భాజా మోగించి.. బైక్‌పై స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో దాసుతండా దాటగానే వెనుకాల నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. హనుమంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా స్వామి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టేకులపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్‌ను తిమ్మాపూర్‌కు చెందిన బబ్లూగా గుర్తించారు. మృత దేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి అంబులెన్స్ సిబ్బందికి ఎవరూ సమాచారం ఇవ్వకపోవడంతో మృతదేహాలు సుమారు మూడు గంటల పాటు రోడ్డుపైనే ఉన్నాయి. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.మేడ్చల్ జిల్లా సూరారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్ పల్లి నుంచి సూరారం వైపు వస్తున్న డీసీఎం.. కాలనీ నుంచి రోడ్డు పైకి వస్తున్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వైఎస్‌ఆర్ జిల్లా మైలవరం మండలం తాడిపత్రి బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో చిన్నారికి, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కలకడ మండల వాసులు సోమశేఖర్(18), జ్యోతి నాయుడు(19)గా గుర్తించారు. గుట్టపల్లి ఆంజనేయస్వామి తిరునాళ్లకు వచ్చి కలకడ తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
11.లొజొవపై రష్యా భారీ దాడి..!
` 1000 అపార్ట్‌మెంట్లు, 11 విద్యా సంస్థలు ధ్వంసం
లొజొవ,మే22(జనంసాక్షి):ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలోని లొజొవ నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడిరది. ఇక్కడ శుక్రువారం జరిగిన భీకర దాడిలో దాదాపు 1000 అపార్ట్‌మెంట్లు, 11 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి.ఈ విషయాన్ని ఆ నగర మేయర్ షెర్హీవ్ జెలెన్‌స్కీ వెల్లడిరచారు. కూలిన వాటిలో 5 పాఠశాలలు, ఒక ఆసుపత్రి కూడా ఉన్నట్లు వెల్లడిరచారు. ప్రతిష్ఠాత్మకమైన ఖర్కీవ్ ఆటోమొబైల్ అండ్ రోడ్ కాలేజ్ భవనం కూడా ఉంది. ఇక లజొవలోని హౌస్ ఆఫ్ కల్చర్ కూడా క్షిపణిదాడిలో ధ్వంసమైంది.ఉక్రెయిన్‌లో ఉన్న ఒలిగార్క్ విక్టర్ మెద్వెద్‌చుక్‌ను రష్యాకు రప్పించేందుకు యత్నాలు జరుగుతన్నాయి. ఇప్పటికే మేరియుపోల్‌లో ఆధీనంలోకి తీసుకొన్న అజోర్ రెజ్‌మెంట్ ఫైటర్లను ఈ డీల్ కోసం రష్యా ఉపయోగించుకొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ విూడియా వెల్లడిరచింది. రష్యా ప్రతినిధుల బృందం సభ్యుడు లియోనిడ్ స్పందిస్తూ..’’ ఈ విషయాన్ని పరిశీలిస్తాము’’ అని పేర్కొన్నాడు. విక్టర్ మెద్వెద్‌చుక్‌ను ఉక్రెయిన్ దళాలు ఏప్రిల్‌లో నిర్వహించిన ఓ స్పెషల్ ఆపరేషన్‌లో అరెస్టు చేశాయి. ఈ విషయాన్ని అప్పట్లో అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా వెల్లడిరచారు. రష్యా ఆక్రమణకు ముందు నుంచే విక్టర్‌పై రాజద్రోహం ఆరోపణలు ఉన్నాయి.కాల్పుల విరమణ ఉండకపోవచ్చు..!
మాస్కోతో కాల్పుల విరమణ లేదా ఇతర ఒప్పందాలు జరిగే అవకాశాలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. డాన్‌బాస్ ప్రాంతంలో పోరు తీవ్రం కావడం, ఫిన్లాండ్‌కు రష్యా గ్యాస్ నిలిపివేయడం వంటి చర్యలపై స్పందిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పై వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే మేరియుపోల్ నగరం రష్యా చేతికి దక్కడంతో.. ఇప్పుడు క్రెమ్లిన్ దృష్టి లుహాన్స్క్ ప్రాంతంపైకి మళ్లించింది. డాన్‌బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ నుంచి పూర్తి స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది.నేడు ఉక్రెయిన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి పోలాండ్ అధ్యక్షుడు ఆడ్రీజేజ్ డూడా ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ మాట్లాడుతూ..’’డాన్‌బాస్ ప్రాంతంలో పరిస్థితి అత్యంత కఠినంగా ఉంది. స్లోవియాన్స్క్, సివోరో డొనెట్స్క్‌పై రష్యా సేనలు అత్యంత తీవ్రమైన దాడులు చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.యుద్ధంలో కీలక సమయంలో రష్యాకు ఎటువంటి అవకాశం ఇచ్చినా.. అది రెట్టింపు శక్తితో దాడి చేస్తుందని ఉక్రెయిన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాలని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ALL NWES