ALL NEWS

1.భాజపా నేతల వ్యాఖ్యలకు నిరసనగా(కిక్కర్‌
దేశవ్యాప్త ఆందోళనలు..భారీ ర్యాలీలు
` ఢల్లీిలోని జామా మసీదు వద్ద భారీ ఆందోళన
` రాజధానిలో కర్ఫ్యూ విధింపు
` నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాల్సిందే..
` పాతబస్తీలో చార్మినార్‌ వద్ద ముస్లింల ఆందోళన
` హింసాత్మకంగా మారిన నిరసనలు..
న్యూఢల్లీి/హైదరాబాద్‌,జూన్‌ 10(జనంసాక్షి):మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాపతంగా ముస్లిం సంఘాలు నిరసనలకు దిగాయి. పలు రాష్ట్రాల్లో శుక్రవారం మసీద్‌లో నమాజ్‌ ముగిసిన వెంటనే నిరసనకారులు ఆందోళనలకు దిగారు. కాగా, ముస్లింల ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లో నిరసనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో, పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు నిరసనకారులు కూడా గాయపడ్డారు. దీంతో రాంచీలో కర్ఫ్యూ విధించారు. ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ విూడియాతో మాట్లాడుతూ.. నిరసనల గురించి సమాచారం అందింది. జార్ఖండ్‌ ప్రజలు ఎప్పుడూ చాలా సహనంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. నిరసనకారులు వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు నిరసనకారులపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.
చార్మినార్‌ వద్ద ముస్లింల ఆందోళన
మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని హైదరాబాద్‌లోని ముస్లింలు డిమాండ్‌ చేశారు. మక్కామసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మక్కామసీదు నుంచి మొఘల్‌ పురా ఫైర్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని ముస్లింలు నినదించారు.చార్మినార్‌, మక్కామసీదు, కాలపత్తార్‌, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, షాహీన్‌నగర్‌, సైదాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. ముస్లింల నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. చార్మినార్‌ వద్ద పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.

 

2.రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి
` దేశానికి అతిపెద్ద శక్తి యువతరం
` ప్రైవేటు రంగంలో భారీగా పెట్టుబడులు
` దేశాన్ని నడుపుతున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ
` ఉద్యమ నినాదానికి అనుగుణంగా పనిచేస్తున్నాం
` మంత్రి కేటీఆర్‌
జగిత్యాల, జూన్‌ 10(జనంసాక్షి): దేశానికి అతిపెద్ద శక్తి యువతరమని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రైవేటు రంగంలో తెలంగాణలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసమని తెలిపారు. ఉద్యమ నినాదానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. చదివిన చదువు ఏనాటికీ వృథా కాదని, కష్టపడితే ఉద్యోగం సంపాదించడం సులువేనని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ప్రస్తుతం 90 వేల ఉద్యోగాల నియామక పక్రియను చేపట్టామని తెలిపారు. 95 శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని వెల్లడిరచారు. రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా దూసుకెళ్తున్నాయని తెలిపారు. ఓ వైపు పర్యావరణం, మరో వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడిరచారు. తెలంగాణలో వచ్చిన నిధులను రాష్ట్రంలోనే ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశాన్ని నడుపుతున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. నీళ్ల విషయంలో దేశంలో 75 ఏండ్లలో జరగని పురోగతిని రాష్ట్రంలో సాధించిందన్నారు. రూ.45 వేల కోట్లు ఖర్చుచేసి ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. మండు వేసవిలో కూడా కాలువల్లో నీరు ప్రవహిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం తెలంగాణలో ఉందని, లార్జెస్ట్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అని గూగుల్‌ కొడితే కాళేశ్వరం అని వస్తుందని చెప్పారు. నాలుగేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1964లో ఎస్సారెస్పీకి అప్పటి ప్రధాని నెహ్రూ కొబ్బరికాయ కొడితే మొన్నటిదాకా కాల్వలు తవ్వారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 82 విూటర్ల నుంచి 600 విూటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు ఎత్తిపోస్తున్నామని మంత్రి అన్నారు. 90 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరమని ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు అనుమతినిచ్చామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఇందులో భాగంగా ధాత్రి, భువి కంపెనీలు ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి ఆహ్వానిస్తున్నామన్నారు.చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువతరం అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్నారు. ఉద్యమ నినాదానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. మళ్లీ 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపట్టామని తెలిపారు. 95 శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని వెల్లడిరచారు. ప్రైవేటు రంగంలో తెలంగాణలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయి.రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా దూసుకెళ్తున్నాయన్నారు. ఓ వైపు పర్యావరణం, మరో వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయని వెల్లడిరచారు. తెలంగాణలో వచ్చిన నిధులను రాష్ట్రంలోనే ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశాన్ని నడుపుతున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.నీళ్ల విషయంలో దేశంలో 75 ఏండ్లలో జరగని పురోగతిని రాష్ట్రంలో సాధించామన్నారు. రూ.45 వేల కోట్లు ఖర్చుచేసి ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. మండు వేసవిలో కూడా కాలువల్లో నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం తెలంగాణలో ఉందన్నారు. లార్జెస్ట్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అని గూగుల్‌ కొడితే కాళేశ్వరం అని వస్తుందని చెప్పారు. నాలుగేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశామని వెల్లడిరచారు. 1964లో ఎస్‌ఆర్‌ఎస్పీకి అప్పటి ప్రధాని నెహ్రూ కొబ్బరికాయ కొడితే మొన్నటిదాకా కాల్వలు తవ్వారని విమర్శించారు.కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా 82 విూటర్ల నుంచి 600 విూటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు ఎత్తిపోస్తున్నామని మంత్రి అన్నారు. 90 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరమని ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.జగిత్యాల జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ధాత్రి, భువి కంపెనీలు ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి ఆహ్వానిస్తున్నామన్నారు.

 

 

 

3.చిన్ననాడు చదువు చెప్పిన ఉపాధ్యాయుడిని కలుసుకున్న మోదీ
అహ్మదాబాద్‌,జూన్‌ 10(జనంసాక్షి): గురుశిష్యుల అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. అందునా తన శిష్యుడు మంచి స్థానంలో ఉంటే.. ఆ గురువుకి కలిగే ఆనందమే వేరు. చాలా ఏళ్ల తర్వాత తనకు విద్య నేర్పిన గురువును కలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ గుజరాత్‌లో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. నవ్సారి వద్‌నగర్‌లో చిన్నప్పుడు తనకు పాఠాలు బోధించిన ఓ ఉపాధ్యాయుడ్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం, మంచి చెడు ఆరా తీశారు.ప్రధాని హోదాలో తన పూర్వ విద్యార్థిని చూసి ఆ ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబ్బితబ్బిబ్బి అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపు ప్రధాని మోదీతో ఆప్యాయంగా ముచ్చటించి.. ఆశీర్వదించి వెళ్లిపోయారు ఆ పెద్దాయన. ప్రస్తుతం వాళ్ల కలయిక గురించి ప్రస్తావిస్తూ.. ఓ ఫొటో వైరల్‌ అవుతోంది.

 

 

4.దేశవ్యాప్తంగా మళ్లీ ఉధృతమవుతున్న కోవిడ్‌
` ప్రతీ ఒక్కరూ మాస్క్‌ ధరించాలి
` 12 ఏళ్ల పిల్లలందరికీ టీకా తప్పనిసరి
దిల్లీ,జూన్‌ 10(జనంసాక్షి): కరోనా మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది. తగ్గినట్లే తగ్గి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనం మాస్క్‌, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలను పూర్తిగా విస్మరించారు. పబ్బులు, క్లబ్బులు, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, విహార యాత్రల్లో మునిగితేలుతున్నారు. అడ్డూ అదుపు లేని ప్రయాణాలు, ఒకే చోట వేలాదిమంది గుమిగూడటం వంటి చర్యలతో వైరస్‌ మరోసారి వణికిస్తోంది.భారత్‌లో గడిచిన 24 గంటల్లో ఏడు వేలకుపైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 7,584 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. గడిచిన మూడు నెలల్లో ఇంత భారీగా కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో అత్యధికంగా 2,813 మంది కరోనా బారినపడ్డారు. గురువారం కోవిడ్‌తో 24 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే 3,791 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 36,267 ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,747కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కి పెరిగింది. దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,44,092కి చేరింది.ముఖ్యంగా దిల్లీలో కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది.ఈ నేపథ్యంలోనే హస్తినలో కేసుల పెరుగుదలకు కారణాలను నిపుణులు తాజాగా వెల్లడిరచారు. కొవిడ్‌ నుంచి కాపాడే మాస్కులను ధరించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనికితోడు విచ్చలవిడిగా తిరగడమే కేసుల విజృంభణకు ప్రధాన కారకాలుగా పేర్కొన్నారు.ఆర్‌ఎల్‌ఎం ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ బీఎల్‌ షెర్వాల్‌ మాట్లాడుతూ.. ‘ఎవరూ మాస్కులను ధరించడం లేదు. మాస్కులు లేకుండానే విహారయాత్రలు చేస్తూ, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇది భారీగా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది’ అని అన్నారు. ‘వైరస్‌కు గురైనవారు మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారు. కొందరిలో జ్వరం, ఒంటి నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకపోవడం ఊరటనిచ్చే అంశం. దీంతో ఆక్సిజన్‌ అవసరం లేకుండా ఉంది’ అని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయితే ఆరోగ్యం బాగా క్షీణిస్తే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉందని వెల్లడిరచారు.సెలవుల సీజన్‌ కావడం దిల్లీలో కొవిడ్‌ కేసుల పెరుగుదలకు కారణమని సంజయ్‌ గాంధీ మెమోరియల్‌ హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ ఎస్‌కే అరోఢా తెలిపారు. ‘ఇది సెలవుల కాలం కాబట్టి ప్రజల ప్రయాణాలు, విహారయాత్రలు పెరిగాయి. ఒకరాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతున్నారు. అందుకే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది’ అని అన్నారు. దిల్లీలో గురువారం 622 మంది వైరస్‌ బారిన పడగా.. ఇద్దరు మృతిచెందారు. పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. జూన్‌ 1న 368 కేసులు బయటపడగా.. పది రోజుల్లోకే కేసులు రెట్టింపయ్యాయి.
(తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి
` అయినా ఆందోళన అవసరం లేదు
` తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు.
హైదరాబాద్‌, జూన్‌ 10(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని.. అయితే ఆందోళన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికలు లేవని, మరణాల సంఖ్య కూడా సున్నాగా ఉందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. కేసుల పెరుగుదలపై ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తరపున శుక్రవారం ఆయన విూడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం 355 కేసులు నమోదు అయ్యాయి. ఈ వారంలో 555 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో సుమారు 56 శాతం కేసుల పెరుగుదల నమోదు అయ్యింది. అలాగే దేశంలో కేసుల సంఖ్య 66 శాతం పెరిగిందని డీహెచ్‌ వెల్లడిరచారు. కరోనా పూర్తిగా వెళ్లిపోలేదని, సబ్‌ వేరియెంట్స్‌ కొంత ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. వచ్చే డిసెంబర్‌ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంది. అయితే ఆందోళన అక్కర్లేదు. మాస్క్‌ ధరించాలి. జాగ్రత్తలు పాటించాలి. జ్వరం, తలనొప్పి, వాసన లేకపోతే కచ్చితంగా టెస్ట్‌ చేయించుకోవాలి. జాగ్రత్తలు పాటించడం మరీ మంచిది. త్వరలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్‌ చేపట్టబోతున్నామని చెప్పారాయన.

 

 

6.ఆడవాళ్లను ఆదుకునేందుకు బలమైన శక్తిగా ఉంటా
ఆడపడుచులు బాధపడుతుంటే చూడలేను`తమిళిసై
హైదరాబాద్‌,జూన్‌ 10(జనంసాక్షి):మహిళలు ఇబ్బంది పడుతుంటే తాను చూస్తూ ఉండలేనని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆడవాళ్లను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడు బలమైన శక్తిగా ఉంటానని తెలిపారు. హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌ లో ’మహిళా దర్బార్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికే రాజ్‌ భవన్‌ ఉందని స్పష్టం చేశారు. మహిళలు బయటకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వారు తమ సమస్యలు చెప్పుకోవడానే రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ ఏర్పాటు చేశానని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులు బాధ పడుతుంటే తాను చూడలేనన్నారు. వారికి తోడుగా తాను ఎప్పుడూ ఉంటానని భరోసా ఇచ్చారు. మహిళలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానన్న తమిళిసై.. మహిళ బాధపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆడవారు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న అంశాలపై చర్చించారు. ’గవర్నర్‌ ప్రజలను కలుస్తారా అని చాలా మందికి అనుమానాలున్నాయని అయితే ప్రభుత్వ కార్యాలయమైన రాజ్‌భవన్‌ ఉంది ప్రజల కోసమే అని స్పష్టం చేశారు. వారి సమస్యలు విని, వాటిని పరిష్కరించడానికే. కరోనా సమయంలోనూ నేను రోగులను పరామర్శించానన్నారు. సమాజంలో మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . ఇంట్లో, పనిచేసే చోట, పాఠశాలల్లో, కాలేజీల్లో, రోడ్లపైన ఇలా ప్రతిచోటా ఆడపిల్లలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది వాటి గురించి ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక వారిలో వారే కుమిలిపోతున్నారు. కొన్నసార్లు భరించలేని మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇదంతా ఆపడానికీ, తెలంగాణ మహిళలకు నేనున్నానని చెప్పడానికే ఈ మహిళా దర్బార్‌ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. తనకు ఎదురు చెప్పేవాళ్లను పట్టించుకోనని తమిళిసై వివరించారు. నిరసనకారుల గురించి తాను ఆందోళన చెందడం లేదని, తెలంగాణ మహిళల కోసం వారి శ్రేయస్సు కోసం తన పని కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

 

 

7.ఇతర దేశాలతో రష్యాను వేరు చేయడం అసాధ్యం: పుతిన్‌
భారత్‌, చైనాలే కాకుండా ఇతరులకూ దగ్గరవుతామన్న అధ్యక్షుడు
మాస్కో,జూన్‌ 10(జనంసాక్షి):కేవలం భారత్‌, చైనాలతోనే కాకుండా ఇతర దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించే అవకాశాలు తమకు పుష్కలంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు.లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలతోనూ తమ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొనే అవకాశం ఉందన్న ఆయన.. రష్యా వంటి దేశాన్ని ప్రపంచ దేశాలతో వేరు చేయడం అసాధ్యమని ఉద్ఘాటించారు. అక్కడి యువ పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడిన పుతిన్‌.. ప్రపంచం చాలా పెద్దది, వైవిధ్యమైనదన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు పెంచుతున్న వేళ వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.’విూరు కేవలం భారత్‌, చైనా దేశాలతో సంబంధాల గురించే మాట్లాడుతున్నారు. కేవలం ఆ రెండు దేశాలే కాదు.. లాటిన్‌ అమెరికా కూడా కావచ్చు. ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్న ఆఫ్రికాలో 150కోట్ల జనాభా ఉంది. ఆగ్నేయాసియా మాటేమిటి..?’ అంటూ యువ పారిశ్రామికవేత్తలతో వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నట్లు రష్యా అధికారిక విూడియా వెల్లడిరచింది. ఇక పశ్చిమ దేశాలు ఆంక్షలు కొనసాగించడాన్ని ప్రస్తావించిన ఆయన.. రష్యా వంటి దేశాన్ని బాహ్య ప్రపంచంతో వేరు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. తమ భూభాగాలను తిరిగి పొందడంతోపాటు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడమే రష్యా లక్ష్యమని పుతిన్‌ పేర్కొన్నారు. ఈ విలువలే మన ఉనికికి కీలకమనే వాస్తవాన్ని గ్రహించి ముందుకు సాగితే.. లక్ష్యాలను సాధించడంలో కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇక రష్యా నుంచి ఇంధన సరఫరాను నిలిపివేసి ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని ఐరోపా దేశాలు పిలుపునివ్వడంపై స్పందించిన పుతిన్‌.. రానున్న కొన్ని సంవత్సరాల్లో రష్యా ఇంధన వనరులను వదులుకోవడం ప్రతి ఒక్కరికీ అసాధ్యమైన విషయమని అభిప్రాయపడ్డారు.సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న మొదలుపెట్టిన రష్యా దురాక్రమణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా దూకుడును అడ్డుకునేందుకు పశ్చిమదేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. రష్యా తీరును నిరసిస్తూ పలు అంతర్జాతీయ సంస్థలు కూడా అక్కడ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా సేనలు మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

 

ఆర్టీసీ ఛార్జీలు మళ్లీ పెంపు

` రూట్‌ బస్‌పాస్‌ల పెంపు
హైదరాబాద్‌,జూన్‌ 10(జనంసాక్షి):ఇప్పటికే డీజిల్‌ సెస్‌ పేరుతో బస్సు ఛార్జీలు భారీగా పెంచిన టీఎస్‌ ఆర్టీసీ తాజాగా రూట్‌ బస్‌పాస్‌ ఛార్జీలను కూడా పెంచింది.4కి.విూ దూరానికి బస్‌పాస్‌ ఛార్జీ రూ.165 నుంచి రూ.450కు, 8కి.విూ దూరానికి రూ.200ల నుంచి రూ.600కు, 12కి.విూ దూరానికి రూ.245 నుంచి రూ.900లకు, 18కి.విూ దూరానికి రూ.280 నుంచి రూ.1,150కు, 22కి.విూ దూరానికి రూ.330 నుంచి రూ.1350కు పెంచింది. తాజా పెంపుతో విద్యార్థులపై భారం పడనుంది.

 

9.రాజ్యసభ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు
` ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్‌ఓటింగ్‌!
న్యూఢల్లీి,జూన్‌ 10(జనంసాక్షి):రాజ్యసభ ఎన్నికల ఫలితాల వెల్లడి సమయానికి హైడ్రామా మొదలైంది. నాలుగు రాష్ట్రాలు.. 16 స్థానాల కోసం శుక్రవారం ఓటింగ్‌ జరిగింది. సాయంత్రం ఐదు గంటల నుంచే కౌంటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. అయితే.. ఈసీకి ఫిర్యాదులు అందడంతో కౌంటిగ్‌ ప్రక్రియకాస్త ఆలస్యంగా మొదలైంది.ఇదిలా ఉంటే.. రాజ్యసభ ఎన్నికల రాజస్థాన్‌ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. జీ విూడియా అధినేత సుభాష్‌ చంద్ర ఓటమి పాలయ్యారు. ఇద్దరు బీజేపీ సభ్యులు క్రాసింగ్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం.మొత్తం స్థానాల్లో ఏకగ్రీవం 41 స్థానాలు కాగా, ఎన్డీయే 17, యూపీఏ 10, ఇతరులు 14 ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.

 

10.టెట్‌ వాయిదా వేయండి
రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌,జూన్‌ 10(జనంసాక్షి):టెట్‌ పరీక్షను వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ నెల 12న టెట్‌ తో పాటు ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉండటంతో ఉద్యోగార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారని శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా రేవంత్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు టెట్‌, ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులు ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలుమార్లు విన్నవించుకున్నారు. అయినా స్పందన లేకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

 

11.తైవాన్‌ విషయంలో యుద్ధానికి సిద్ధం..
అమెరికాకు తేల్చిచెప్పిన చైనా
బీజింగ్‌,జూన్‌ 10(జనంసాక్షి):తైవాన్‌ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా తేటతెల్లం చేసింది. సింగపూర్‌ వేదికగా అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌తో చైనా రక్షణ మంత్రి వు కియాన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తైవాన్‌లో అలజడి సృష్టించే చర్యలను వదులుకోవాలని అమెరికా మంత్రి చెప్పారు. దీంతో అగ్గివిూద గుగ్గిలమైన వు కియాన్‌.. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమని, దాన్ని చూపించి చైనాపై ఒత్తిడి పెంచడం మానుకోవాలని తేల్చిచెప్పారు.ఒకవేళ తైవాన్‌ గనుక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే.. యుద్ధం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చైనా రక్షణ మంత్రి స్పష్టంచేశారు. ‘స్వతంత్ర తైవాన్‌’ పథకాలన్నింటినీ ధ్వంసం చేస్తామని, మాతృభూమిని ఏకం చేస్తామని అమెరికా మంత్రికి తేటతెల్లం చేశారు.

12.భవిష్యత్తు ఘర్షణలకు చైనా పునాది వేస్తోంది..!
దిల్లీ,జూన్‌ 10(జనంసాక్షి):భారత్‌తో సరిహద్దు వెంబడి చైనా అభివృద్ధి చేస్తున్న సైనిక వసతులు ప్రమాదకరంగా ఉన్నాయంటూ వచ్చిన వార్తా కథనంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.రాబోయే రోజుల్లో భారత్‌తో ఘర్షణకు దిగేందుకు చైనా పునాదులు నిర్మిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘భవిష్యత్తులో ఘర్షణాత్మక చర్యకు దిగేందుకు చైనా పునాదులు నిర్మిస్తోంది. ఈ చర్యలను విస్మరించడం ద్వారా ప్రభుత్వం భారతదేశానికి ద్రోహం చేస్తోంది’ అని రాహుల్‌ ఆ కథనాన్ని షేర్‌ చేశారు.సరిహద్దు వెంట చైనా అభివృద్ధి చేస్తోన్న సైనిక వసతులపై అమెరికా అగ్రశ్రేణి జనరల్‌ ఛార్లెస్‌ ఎ.ఫ్లిన్‌ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు దారితీశాయి. ‘భారత్‌తో సరిహద్దు వెంబడి చైనా సైనిక కార్యాచరణ స్థాయి కళ్లు తెరిపించేలా ఉంది. వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌లో నిర్మిస్తున్న కొన్ని మౌలిక సదుపాయాలు ప్రమాదకరంగా ఉన్నాయి. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో ఆ నిర్మాణాలు ఎందుకు అవసరమవుతున్నాయో, వారి అసలు ఉద్దేశం ఏమిటో సమాధానాలు రాబట్టాల్సిన అవసరం ఉంది’ అని అమెరికా ఆర్మీ పసిఫిక్‌ కమాండిరగ్‌ జనరల్‌ ఫ్లిన్‌ బుధవారం దిల్లీలో వ్యాఖ్యానించారు. తూర్పు లద్ధాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతను ఫ్లిన్‌ ప్రస్తావించారు.ఈ వ్యాఖ్యలను చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియన్‌ తిప్పికొట్టారు. ‘ఈ సరిహద్దు సమస్య చైనా, భారత్‌ల మధ్య ఉంది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం ఇరుపక్షాలకు ఉంది. ఈ విషయంలో కొంతమంది అమెరికా అధికారులు అగ్నికి ఆజ్యం పోసేందుకు యత్నిస్తున్నారు. మా వైపు వేలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. బదులుగా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి దోహదపడేందుకు వారు మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాం’ అని మండిపడ్డారు. తూర్పు లద్ధాఖ్‌లో పరిస్థితులు స్థిరత్వం దిశగా సాగుతున్నాయన్నారు.