ALL NEWS

 

1.దేశంలో మర్లవడ్డ యువత
` ‘అగ్నిపథ్‌’పథకంపై భగ్గుమన్న విద్యార్థులు
` ఐదు రాష్ట్రాల్లో తీవ్రఉద్రిక్తపరిస్థితులు
` బీహార్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
` మూడు రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు
` నిరుద్యోగుల సహనానికి ‘అగ్నిపరీక్ష’ పెట్టొద్దు : రాహుల్‌ గాంధీ
` కాలపరిమితి పెట్టొద్దన్న అరవింద్‌ కేజ్రీవాల్‌
న్యూఢల్లీి,జూన్‌ 16(జనంసాక్షి):త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌’పథకం ఉత్తరభారత దేశంలో అగ్గిపెట్టింది.బీహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌,హర్యానా, ఢల్లీిల్లో నిరుద్యోగులు అగ్నిపథ్‌ పథకంపై భగ్గుమున్నారు.కేంద్రం ప్రకటించిన ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా యువత కదం తొక్కారు.నిరుద్యోగ యువత తీవ్ర నినసన గళం వినిపిస్తున్నారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు.ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంట్లో భాగంగా బిహార్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా సుమారు మూడు రెళ్లకు నిప్పు పెట్టారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.చాప్రా, గోపాల్‌గంజ్‌, కైమూరు జిల్లాల్లో గురువారం (16,2022) యువకులు తీవ్రమైన ఆందోళనలు చేపట్టారు.రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలిపారు. రోడ్లపై పుష్‌ అప్స్‌ చేస్తు నిరసనలు తెలిపారు. హర్యానాలు పలు వాహనాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు బీహార్‌ లో మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇదే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో నిరసనలు హోరెత్తాయి.నవాడా బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఆరా రైల్వే స్టేషన్‌ లో రైలు బోగీకి నిప్పు పెట్టారు.రైల్వే పట్టాల విూద బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులను రైల్వే పట్టాల విూద నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని కైమూరు ఎస్పీ రాకేశ్‌ కుమార్‌ తెలిపారు. తమిళనాడులో కూడా సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు నిరసనలకు దిగారు.వెల్లూరులో సుమారు 100 మంది యువకులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు చేపట్టారు.కలెక్టరేట్‌ను చుట్టుముట్టాలని యువకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.బిహార్‌లో యువకుల ఆందోళనలు తీవ్రంగా మారాయి. అనేక రైల్వే స్టేషన్లలో నిరసనలు చేపట్టిన అభ్యర్థులు, మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. వెంటనే ‘అగ్నిపథ్‌’ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. ‘అగ్నిపథ్‌’ స్కీంలో భాగంగా నాలుగేళ్ల కాలానికి 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని రిక్రూట్‌ చేసుకుంటారు. వారిలో 25శాతం సైనికుల సర్వీసును రెగ్యులరైజ్‌ చేస్తారు. ‘అగ్నివీరులు’ అని పిలిచే వీరికి నెలకు రూ.30 నుంచి 40 వేల వరకు జీతం ఇస్తారు. ఈ ఏడాది 46 వేల మందిని నియమించుకోనున్నారు.
నిరుద్యోగుల సహనానికి ‘అగ్నిపరీక్ష’ పెట్టొద్దు : రాహుల్‌ గాంధీ
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరుద్యోగ యువత ఆందోళన కార్యక్రమాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే.ఇటువంటి సమయంలో నిరుద్యోగుల గళాన్ని వినాలని.. అగ్నిపథ్‌తో ముందుకు వెళ్తూ వారి సహనానికి ‘అగ్నిపరీక్ష’ పెట్టవద్దని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హితవు పలికారు. త్రివిధ దళాల్లో నాలుగేళ్లపాటు సైనిక నియామకాలు చేపట్టే ఈ అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ బిహార్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ విధంగా స్పందించారు.’నో ర్యాంక్‌`నో పెన్షన్‌, రెండేళ్లపాటు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టకపోవడం, నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, సైన్యంపై ప్రభుత్వానికి గౌరవం లేదనే విషయం స్పష్టమవుతోంది’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో దేశంలో నిరుద్యోగుల గళాన్ని వినాలని.. అగ్నిపథ్‌తో ముందుకెళ్తూ వారి సహనానికి అగ్నిపరీక్ష పెట్టవద్దని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకగాంధీ వాద్రా.. సైన్యంలో నియామకాలను ప్రయోగశాలగా ఎందుకు మారుస్తున్నారంటూ ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ ద్వారా కొత్తగా నియామకమయ్యే వారికి నాలుగేళ్ల కాలపరిమితి పెట్టవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన నిరుద్యోగులకు మద్దతు పలికిన ఆయన.. వారి డిమాండ్లు సరైనవేనన్నారు. దేశానికి సైన్యం ఎంతో గర్వకారణమని.. అటువంటి సైన్యంలో తమ జీవితం మొత్తం సేవలందించాలని కోరుకునే యువత కలలకు నాలుగేళ్లతో ముడిపెట్టవద్దన్నారు.ఇదిలాఉంటే, త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఈ ఒక్క ఏడాదే 17.5ఏళ్ల వయసు నుంచి 21 మధ్య వయసున్న 46వేల మంది యువకులను నియమించుకునేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా ఇందులో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తౌెన తర్వాత.. ప్రతి బ్యాచ్‌లోని 25శాతం మంది అగ్నివీరులు మాత్రమే సైన్యంలో కొనసాగే అవకాశం ఉంది.

 

2.చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తత
` ఎస్‌ఐ కాలర్‌ పట్టుకున్నందుకు రేణుకా చౌదరిపై కేసునమోదు
` కేంద్రం రహస్య ఆదేశాలతోనే కాంగ్రెస్‌ శ్రేణులపై దాడి: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,జూన్‌ 16(జనంసాక్షి):తెలంగాణ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘రాజ్‌భవన్‌ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ద్విచక్రవాహనాన్ని ఆందోళన కారులు తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సుపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మరోవైపు రాజ్‌భవన్‌ మార్గంలోకి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకొని కాంగ్రెస్‌ నేతలు దూసుకెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, బోసురాజు, శ్రీనివాస్‌ కృష్ణన్‌, మహేశ్‌కుమార్‌ తదితర నాయకులు రాజ్‌భవన్‌ వైపు వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట
రేవంత్‌రెడ్డిని స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, వందలాది మంది కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌ నాయకుడు చామల కిరణ్‌రెడ్డి, కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డిని బొల్లారం, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలను గోషామహల్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులను పంజాగుట్ట పీఎస్‌లకు తరలించారు.
పోలీస్‌ కాలర్‌ పట్టుకొని లాగిన రేణుకా చౌదరి
నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ మహిళా నేతల అరెస్టుకు పోలీసులు యత్నించారు. రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఆమె పోలీస్‌ కాలర్‌ పట్టుకొని లాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య కంఠం నొక్కేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం రేణుకా చౌదరిని పోలీసులు బలవంతంగా వాహనంలో తరలించారు.కాంగ్రెస్‌ నిరసనలతో ఖైరతాబాద్‌ కూడలి వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. ఈ మార్గంలో పోలీసులు వాహనాలను నిలిపేశారు. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు చిక్కుకున్నాయి.కాగా పంజాగుట్ట ఎస్‌ఐ ఉపేంద్ర బాబు ఆరోపణలపై రేణుకాచౌదరి స్పందించారు. ‘’వెనుకాల నుంచి నన్ను తోసేశారు. అదుపుతప్పి కిందపడుతుండగా ఎస్‌ఐ భుజం పట్టుకున్నా. ఎస్‌ఐని అవమానపర్చడం నా ఉద్దేశం కాదు. మా చుట్టూ మగ పోలీసులు ఎందుకున్నారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో మాకు తెలుసు. పోలీసుల పట్ల గౌరవం ఉంది. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. కక్షసాధింపునకు దర్యాప్తు సంస్థలను కేంద్రం వినియోగిస్తోంది’’ అని గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద రేణుకా చౌదరి విూడియాతో అన్నారు.
డీసీపీ జోయల్‌ డేవిస్‌ను నెట్టేసిన భట్టి విక్రమార్క
రాజ్‌భవన్‌ వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు భట్టి విక్రమార్క నానా హంగామా సృష్టించారు. పోలీసులపై దుర్భషలాడారు. అక్కడ విధుల్లో ఉన్న వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ను భట్టివిక్రమార్క నెట్టేశారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటించి, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కేంద్రం రహస్య ఆదేశాలతోనే కాంగ్రెస్‌ శ్రేణులపై దాడి: రేవంత్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలతోనే శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై పోలీసులు దాడి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.గురువారం సాయంత్రం బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదలైన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ... కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమపై దాడి చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను నిరసిస్తూ రేపు జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.’’తొలుత ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై, ఆ తర్వాత కాంగ్రెస్‌ శ్రేణులపై దాడి చేశారు. కార్యకర్తలంతా చెల్లాచెదురైన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై డీసీపీ జోయల్‌ డేవిస్‌ దాడి చేశారు. తోపులాటలో కిందపడిపోతూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అదుపుతప్పి అందుబాటులో ఉన్న ఎస్‌ఐ చొక్కా పట్టుకుంటే... కాలర్‌ పట్టుకున్నారని అక్రమ కేసు బనాయించడం బాధాకరం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇలా వ్యవహరించి ఉంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఉండేవాళ్లా. నరేంద్రమోదీని ప్రసన్నం చేసుకోవాలని, ఆయన ఇచ్చిన రహస్య ఆదేశాలమేరకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్‌ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. కేసీఆర్‌, మోదీ ఒకే డైరెక్షన్‌లో నడుస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న జాతీయ నేతలను కూడా వేధిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

 

3.శ్రీలంక పవన విద్యుత్‌ కాంట్రాక్టుల్లో ఆరోపణలపై మోదీ మౌనమేళా?
` మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
హైదరాబాద్‌,జూన్‌ 16(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్‌ చేయడం సాధారణమే అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరి శ్రీలంక పవన విద్యుత్‌ కాంట్రాక్టుల్లో ప్రధాని మోదీ జోక్యం ఉందని ఆ దేశ సీనియర్‌ అధికారులే ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ప్రధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించడం లేదు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

 

4.బంగారుబిడ్డకు ఘనస్వాగతం
` సొంతగడ్డ నిజామాబాద్‌లో నిఖత్‌ జరీన్‌కు అడుగడుగునా నీరా‘జనాలు ’
` రూ.లక్ష నగదు అందచేసిన మంత్రి వేములప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్‌,జూన్‌ 16(జనంసాక్షి): ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ సాధించి తన సొంత గడ్డ నిజామాబాద్‌ నగరానికి గురువారం తొలిసారిగా అడుగుపెట్టిన అంతర్జాతీయ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. నిఖత్‌ జరీన్‌ రాకతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఆమెను ఘనంగా సన్మానించారు. ముందుగా ఫులాంగ్‌ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ విూదుగా ఖలీల్‌ వాడిలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నిఖత్‌ జరీన్‌ టాప్‌ లెస్‌ జీపులో ప్రధాన మార్గం గుండా తాను సాధించిన ప్రపంచ చాంపియన్‌ షిప్‌ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగగా.. వివిధ క్రీడా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువతీ యువకులు, విద్యార్థులు, క్రీడాభిమానులు మువ్వన్నెల జెండాలు చేతబూని బైక్‌ లపై నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. న్యూ అంబేద్కర్‌ భవన్‌ వద్ద మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ విఠల్‌ రావు, ఎమ్మెల్యేలు బిగాల గణెళిష్‌ గుప్తా, షకీల్‌ అవిూర్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, నగర మేయర్‌ నీతూకిరణ్‌ తదితరులు నిఖత్‌కు ఘన స్వాగతం పలికారు. మంత్రి వేముల నిఖత్‌కు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని, ఆమెకు బాక్సింగ్‌లో ఓనమాలు నేర్పించిన తొలి గురువు కోచ్‌ సంసాముద్దీన్‌కు యాభై వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల కూడా నిఖత్‌కు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని అందించగా, ఎమ్మెల్యే షకీల్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్‌ నియోజగవర్గంలో నిఖత్‌ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంటి స్థలం కేటాయిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా సన్మాన సభలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ క్రీడా పటంలో నిఖత్‌ జరీన్‌ భారతదేశం పేరునే కాకుండా తెలంగాణ ప్రతిష్టను నిలిపిందన్నారు. ప్రపంచ చాంపియన్‌ గా సాధించిన విజయం ఎంతో అద్భుతమైన ఘట్టమని కొనియాడారు. నిజామాబాద్‌ బిడ్డ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ కావడం మన అందరికి గర్వ కారణమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ క్రీడా రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. నిఖత్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. నిఖత్‌ జరీన్‌ మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు వచ్చిన తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. అందరి దీవెనలతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని తెలిపారు.

 

5.నేటి ఈడీ విచారణను వాయిదా వేయండి
` దర్యాప్తు సంస్థను కోరిన రాహుల్‌ గాంధీ..!
దిల్లీ,జూన్‌ 16(జనంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గత మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ఎదుర్కొన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ..శుక్రవారం మరోసారి విచారణకు రావాల్సి ఉంది. అయితే రేపటి విచారణను వాయిదా వేయాలని ఆయన తాజాగా దర్యాప్తు సంస్థను అభ్యర్థించినట్లు తెలుస్తోంది.రాహుల్‌ తల్లి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం కొవిడ్‌ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాహుల్‌, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆసుపత్రిలో తల్లి వద్దనే ఉన్నారు. రేపు కూడా తాము హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరముందని.. అందుకే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్‌ ఈడీకి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. అయితే దీనిపై ఈడీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.కేసులో వరుసగా మూడో రోజుల పాటు రాహుల్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. మొత్తం 30 గంటల పాటు దర్యాప్తు అధికారులు ఆయనను ప్రశ్నించారు. యంగ్‌ ఇండియన్‌ కంపెనీ కార్యకలాపాలు, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ఆస్తులు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఆయన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రూపంలోనూ భద్రపర్చారు. విచారణ, వాంగ్మూలం నమోదు పూర్తి కాకపోవడంతో గురువారం మళ్లీ రావాలని అధికారులు ఆయన్ను ఆదేశించారు. అయితే, తనకు ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలని రాహుల్‌ కోరడంతో ఈడీ అందుకు సమ్మతించింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.మరోవైపు, రాహుల్‌పై ఈడీ దర్యాప్తును నిరసిస్తూ గత నాలుగురోజులుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలతో బుధవారం దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తమ ఆఫీసులోకి చొచ్చుకుని వచ్చి కార్యకర్తలను కొట్టారని, నేతలపై దాడులు చేశారని హస్తం పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. గురువారం కూడా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టింది.

 

6.దేశానికి గొప్పపచ్చ‘ధనం’
` గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను దేశం ఆదర్శంగా తీసుకోవాలి
` సేవ్‌ సాయిల్‌, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లక్ష్యం ఒక్కటే.. అది పుడమిని కాపాడటం
` ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదు, కాపాడాలి.. భవిష్యత్‌ తరాలకు అందించాలి
` దేశం పచ్చబడాలనే సంతోష్‌ కుమార్‌ చొరవ అభినందనీయం
` గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఐదవ విడతను ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్‌.
హైదరాబాద్‌,జూన్‌ 16(జనంసాక్షి):తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని చెప్పారు సద్గురు జగ్గీ వాసుదేవ్‌. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని అన్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోంది అన్నారు సద్గరు జగ్గీ వాసదేవ్‌. పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని.. వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్‌ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. సేవ్‌ సాయిల్‌ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్‌ విూదుగా బెంగుళూరు పయనం అయ్యారు. మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఐదవ విడతను శంషాబాద్‌ సవిూపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ తో పాటు, మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, ఎమ్మెల్సీలు నవీన్‌ కుమార్‌, శంభీపూర్‌ రాజు, దండే విఠల్‌ పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలంగాణకు హరితహారం ప్రగతి నివేదికను సమావేశంలో వివరించారు. ప్రభుత్వం సాధించిన పచ్చదనం పెంపు విజయాలను సద్గురుకు వివరించారు.ఎంపీ సంతోష్‌ చిన్న వయసులో పెద్ద బాధ్యత తీసుకున్నారు : సద్గురు చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్‌ కుమార్‌ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గరు ప్రశంసించారు. సేవ్‌ సాయిల్‌, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియజెప్పటమే అన్నారు. పూర్వజన్మ సుకృతం` గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విజయవంతం` సద్గురు ఆశీస్సులు : ఎంపీ సంతోష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేపట్టామని ఎంపీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్‌ ఇండియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ సంతోష్‌ కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.ఇంతటి ఆదరాభిమానాలు, సద్గురు ఆశీస్సులు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అందుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటామని అన్నారు. గొల్లూరు ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతంలో భారీగా చెట్లను పెంచి, చిక్కని పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ ను అటవీ శాఖ సహకారంతో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేపట్టింది. మొదటి దశలో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. అటవీ పునరుద్దరణ పనుల్లో భాగంగా, ఐదవ విడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి పదివేల పెద్ద మొక్కలను నాటారు. సద్గురుతో పాటు, ఆయన అభిమానులు, ఈషా ఫౌండేషన్‌ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ూూఆ ప్రియాంక వర్ఘీస్‌, ప్రభుత్వ సలహాదారు ఆర్‌. శోభ, పీసీసీఎఫ్‌, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ ఆర్‌.ఎం. డోబ్రియల్‌, అదనపు పీసీసీఎఫ్‌ సునీతా భగవత్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, రంగారెడ్డి డీఎఫ్‌ఓ జానకిరామ్‌, ఎఫ్‌ఆర్వో విష్ణు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్‌ రెడ్డి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

7.ఇక గజ్వేల్‌, మెదక్‌ ఎరువుల పంపిణీకి ప్రత్యేక గూడ్స్‌ రైలు.
` ఫలించిన మంత్రి హరీశ్‌ చొరవ..
` త్వరలో అందుబాటులోకి ఎరువులు, సరుకుల రాకపోకల.
` నిర్వహణ కోసం గజ్వేల్‌, మెదక్‌లో రైల్వే కొత్త రేక్‌ పాయింట్‌.
సిద్ధిపేట బ్యూరో,జూన్‌ (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌ రావు ప్రత్యేక చొరవతో ఎరువుల రాకపోకల నిర్వహణ కోసం గజ్వేల్‌, మెదక్‌ లో రైల్వే కొత్త రేక్‌ పాయింట్‌ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు గురువారం రైల్వే అధికారులు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీష్‌ రావు సమాచారం అందించారు. కాగా వాటాదారులు, స్థానిక ప్రజల సమక్షంలో వేడుకగా రేక్‌ పాయింట్‌ ప్రారంభోత్సవాలకు సన్నాహాలు చేయాలని గజ్వేల్‌, మెదక్‌ అధికార బృందాన్ని మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. రైల్వే కొత్త రేక్‌ పాయింట్‌ రాకతో ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా వ్యాపారులకు, రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. గజ్వేల్‌ నుంచి దేశంలోనీ ఏ ప్రాంతానికైనా సరుకు రవాణా సులభతరం కానుంది.డబ్బుతో పాటు సమయం ఆదా, అతి తక్కువ ఖర్చుతోనే తమ ప్రాంత వ్యవసాయ ఇతర ఉత్పత్తులను డిమాండ్‌ ఉన్న ఇతర ప్రాంతాలకు తరలించి అధిక రేట్లకు విక్రయించుకోవచ్చు.కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి` మనోహరాబాద్‌, మెదక్‌ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాములతో అనుసంధానించే అంశంపై మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక విజన్‌ తో గజ్వేల్‌ గడ కార్యాలయంలో మెదక్‌ కలెక్టర్‌, సిద్దిపేట అదనపు కలెక్టర్‌, ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌, డివిజల్‌ రైల్వే మేనేజర్‌, రైల్వే అధికారులతో జరిపిన సవిూక్షతో పనులు శరవేగంగా ముందుకు సాగాయి. కొత్త రైల్వే లైన్లతో ఎఫ్‌సీఐ గోదాములకు అనుసంధానంపై జరిగిన సవిూక్షతో గూడ్స్‌ రైల్వే సర్వీసు ద్వారా ఎఫ్‌ సీఐ గోదాములకు బియ్యం పంపిణీ చేసుకునే వెసులుబాటు, అలాగే గజ్వేల్‌, మెదక్‌ ప్రాంతాలకు గూడ్స్‌ రైల్వే ద్వారా ఎరువుల పంపిణీ జరపొచ్చు. గజ్వేల్‌లోని గోదాములకు కొత్త రైల్వే లైన్లతో అనుసంధానంతో ధాన్యం, ఎరువులను ఈ లైన్ల ద్వారా రవాణా చేస్తే స్థానిక రైతులకు, పౌర సరఫరాల వ్యవస్థకు ప్రయోజనం చేకూరనున్నది.హైదరాబాదు సనత్‌ నగర్‌, చర్లపల్లి నుంచి కాకుండా ఈ కొత్త లైన్ల అనుసంధానం ద్వారా ధాన్యం, ఎరువుల రవాణా చేపట్టవచ్చు. దీంతో కాలయాపన, వ్యయం విపరీతంగా తగ్గనున్నాయి. మంత్రి సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌, అధికార బృందం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంది. అలాగే గూడ్స్‌ రైల్వే సర్వీసుల ద్వారా గజ్వేల్‌, మెదక్‌కు ఎరువులను రవాణా చేయాలని మార్క్‌ ఫెడ్‌ అధికార బృందం సైతం సమావేశంలో నిర్ణయించి ఆమోదం తెలిపింది.

 

 

8.తెలంగాణవ్యాప్తంగా విస్తరించిన నైరుతి..
` మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
హైదరాబాద్‌,జూన్‌ 16(జనంసాక్షి):నైరుతి రుతుపవనాలు తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయి. రాష్ట్రంలో ప్రవేశించిన మూడు రోజుల్లోనే విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా ముధోల్‌ 13.28 సెంటీవిూటర్ల వర్షాపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లా నెక్కొండలో 12.75, భద్రాది కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90, మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 11.13 వర్షపాతం నమోదైంది.జయశంకర్‌ జిల్లా ముత్తారం మహదేవ్‌పూర్‌లో 10.10, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 10 సెంటీ విూటర్ల వర్షం కురిసింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ విూదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోవిూటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని పేర్కొన్నది.శుక్రవారం నాడు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌`మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.ఆదివారం మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌`మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాని తెలిపింది. ఈ మూడు రోజులు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశాలున్నాయి.

 

9.కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి
` అవి ప్రతీకారం తీర్చుకునేవిగా ఉండొద్దు..!
` యూపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
దిల్లీ,జూన్‌ 16(జనంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్‌ విధానంపై గురువారం సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.రాష్ట్రంలో కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలని, అవి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని స్పష్టం చేసింది. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో భాగంగా నిందితుల ఇళ్లు కూల్చివేయడంపై పిటిషన్‌ దాఖలైంది. దానిపై వాదనలు విన్న సుప్రీం.. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ఇళ్ల కూల్చివేతలు నిలిపివేయాలని మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు.చట్టవిరుద్ధంగా కట్టిన ఇళ్లని చెప్తూ కూల్చివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ జమియత్‌ ఉలామా`ఇ`హింద్‌ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. చట్టబద్ధమైన ప్రక్రియకు విరుద్ధంగా కూల్చివేతలు జరగకుండా చూసేలా కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. ‘ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్నది చట్టవిరుద్ధంగా ఉంది. షాక్‌కు గురిచేస్తోంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడిలా ఉంది’ అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘కూల్చివేత ప్రక్రియ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలి. అది ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదు. అయితే తాము కూల్చివేతలపై స్టే ఇవ్వలేము. చట్టం ప్రకారం వెళ్లమని మాత్రమే చెప్పగలం’ అని వ్యాఖ్యానించింది. అలాగే దీనిపై యూపీ ప్రభుత్వం మూడు రోజుల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని చెప్పింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో నుపుర్‌ శర్మను భాజపా సస్పెండ్‌ చేయగా.. నవీన్‌ జిందాల్‌ను బహిష్కరించింది. అయితే ఈ వ్యాఖ్యలపై వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. వాటిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ హింసాత్మక ఘటన వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జావేద్‌ అహ్మద్‌ నివాసాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ స్థానిక అధికారులు ఆదివారం దానిని కూల్చివేశారు. అనుమతి తీసుకోకుండా నిర్మించడంపై మే 10నే నోటీసు ఇచ్చి, రెండువారాల సమయం ఇచ్చామనీ, గడువులోగా ఎలాంటి పత్రాలు సమర్పించకపోవడంతో కూల్చివేత చర్యలు చేపట్టామనీ అధికారులు తెలిపారు.

 

 

11.మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
` లోయలో పడిన కారు.. ఏడుగురు మృతి
` పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం..
ఛింద్వాడా,జూన్‌ 16(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఛింద్వాడా జిల్లాలోని కొడమావు గ్రామ సవిూపంలో ఈ ఘటన జరిగింది. ఓ బైక్‌ రైడర్‌ను తప్పించే ప్రయత్నంలో బొలేరో అదుపుతప్పి లోయలో పడిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. బాధితులంతా.. భాజీపానీ గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్నారని ఆయన చెప్పారు. బావిలో పడి వాహనం ఇరుక్కుపోయిందని, క్రేన్‌ సాయంతో బయటకు తీశామన్నారు.