ALL NEWS

 

1.ఆల్‌టైం కనిష్టానికి రూపాయి పతనం
` డాలరుతో పోలిస్తే 79కి చేరిన విలువ
న్యూఢల్లీి,జూన్‌ 29(జనంసాక్షి):రూపాయి పతనం కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే దీని విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. తాజాగా రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి చేరింది. గురువారం స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి విలువ 79.04కి పతనమైంది.అంతకుముందు మంగళవారం ఏకంగా 48 పైసలు క్షీణించిన రూపాయి.. 78.85 వద్ద ముగిసింది. తాజాగా మరో 19 పైసలు క్షీణించింది. విదేశీ మదుపరుల అమ్మకాలు కొనసాగుతుండడం, ముడి చమురు ధరల పెరగుదుల, ద్రవ్యోల్బణం వంటివి రూపాయి క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలపడడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అవి రూపాయి విూద ఒత్తిడిని తగ్గించలేకపోతున్నాయని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. రూపాయి బలపడాలంటే కొత్త వ్యూహాలు అనుసరించాల్సిందేనని పేర్కొంటున్నారు.రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి డాలర్లలోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపుల కోసం ఎక్కువ వ్యయమవుతుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై భారం పెరుగుతుంది. తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు మాత్రం క్షీణించిన కరెన్సీవల్ల లబ్ధి పొందుతాయి. ముఖ్యంగా భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఒక డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి కాబట్టి రూపాయి క్షీణత వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలు లాభపడతాయి.

 

2.దేశవ్యాప్తంగా కరెంటిచ్చామన్నది పచ్చి అబద్ధం
` అదే నిజమైతే ద్రౌపది గ్రామానికి ఇప్పుడెందుకిచ్చారు?
` ప్రధాని నరేంద్రమోదీకి మంత్రి కేటీఆర్‌ సూటి ప్రశ్న
హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి): బీజేపీ అగ్రనేతల హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే కేసీఆర్‌ను విమర్శిస్తూ కాషాయ నేతలు, మోదీ బైబై అంటూ కారు పార్టీ నేతలు ఫ్లెక్సీలతో భాగ్యనగరంలో హోరెత్తిస్తున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. ప్రధాని నరేంద్ర మోదీపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో కమళం పార్టీ నేతలను మించినవారు లేరని ఎద్దేవా చేశారు.‘2018, ఏప్రిల్‌లో ఓ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించామని అన్నారు. మరోవైపు ఎన్‌పీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి జూన్‌ 25న కరెంట్‌ వచ్చింది. ఇంకా ఎన్నిసార్లు దేశ ప్రజలను మోసం చేస్తారు మోదీ జీ!’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పోటీ చేస్తున్నారు. ద్రౌపది ముర్ము సొంతూరు ఒడిశాలోని మయూర్‌బంజ్‌ జిల్లా, ఉపర్‌బెడా. అక్కడి ప్రజలు విద్యుత్‌ సౌకర్యం లేక ఇప్పటికీ కిరోసిన్‌ దీపాలనే వినియోగిస్తున్నారని, ఎట్టకేలకు ఆ ఊరికి కరెంట్‌ వచ్చిందని జూన్‌ 25న పలు వార్తా సంస్థలు ప్రచురించాయి. ఉపర్‌బెడాలో విద్యుదీకరణ పనులు మొదలు పెట్టామని ఒడిశా ప్రభుత్వం సైత ప్రకటించింది. అయితే, చాలా ఏళ్ల క్రితమే ఉపర్‌బెడా నుంచి 20 కిలోవిూటర్ల దూరంలో ఉన్న రాయ్‌రంగపూర్‌కు ముర్ము కుటుంబం మకాం మార్చింది. ఇదిలాఉండగా.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమావేశాల్లో పాల్గొంటారు.

 

3.‘మహా’పరీక్ష
` మహారాష్ట్రలో తుది అంకానికి రాజకీయం
` బలనిరూపణ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్దవ్‌కు గవర్నర్‌ ఆదేశం
` సుప్రీంను ఆశ్రయించిన మహారాష్ట్ర సీఎం ..
` స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం
` బలనిరూపణ కోసం నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
` గౌహతి నుంచి ముంబై చేరుకోనున్న షిండే వర్గం ఎమ్మెల్యేలు
ముంబయి,జూన్‌ 29(జనంసాక్షి): మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. చివరి అంకానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. భాజపా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ ఎంట్రీతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు. దీంతో బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ ఆదేశించడంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని శివసేన ఆశ్రయించగా.. వ్యతిరేకంగా తీర్పు వెలువడిరది. విశ్వాస పరీక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో గురువారమే ఉద్ధవ్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో శిందే వర్గం ఎమ్మెల్యేలు గురువారం గువాహటి నుంచి ముంబయి చేరుకోనున్నారు.
అంతకుముందు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను బలపరీక్షకు ఆదేశించాలని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ గవర్నర్‌ను కోరిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం జరగడం గమనార్హం. అయితే బుధవారం ఉదయం తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే కీలక ప్రకటన చేశారు. గురువారం ఉదయం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ముంబయికి చేరుకుంటానని చెప్పారు. అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్షలో పాల్గొననున్నట్లు వెల్లడిరచారు. దాదాపు వారం రోజులు తర్వాత షిండే వర్గం ఎమ్మెల్యేలు గువాహటి నుంచి బయటికి వచ్చారు. గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించు కున్నారు. మహారాష్ట్ర ప్రజల సంతోషం కోసం ప్రార్థించానని షిండే తెలిపారు. అ సమయంలోనే గురువారం ముంబయి వెళ్తామని ఆయన వెల్లడిరచారు.గవర్నర్‌ నిర్ణయాన్ని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. బలపరీక్ష నిరూపణకు గవర్నర్‌ ఆదేశించిన నేపథ్యంలో భాజపా తమ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలందరూ బుధవారం సాయంత్రం లోపు ముంబయిలోని తాజ్‌ హోటల్‌కు రావాలని ఆదేశించింది.అధికార మహా వికాస్‌ అఘాడీ కూటమిలోని శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది శాసన సభ్యులు ఉన్నారు. ప్రతిపక్షం భాజపాకు 106 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే శిందే తిరుగుబాటుతో.. ఆయన వెంట 39 మంది శివసేన ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు స్వతంత్రులు షిండే వర్గంలో ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 287 మంది సభ్యులున్నారు. శివసేన అసమ్మతి నేతలు 39 మంది గురువారం సభకు హాజరుకాకపోతే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248కి తగ్గనుంది. ఈ క్రమంలో ఠాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ప్రస్తుతం మహా వికాస్‌ అఘాడీ కూటమి సంఖ్యా బలం 113 మాత్రమే. ఈ పరిస్థితుల్లో బలపరీక్ష ఎదురైతే ఠాక్రే సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉంది. శివసేన పార్టీలో ఏక్‌ నాథ్‌ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేను మెజారిటీ నిరూపించుకోవాలని కోరారు. గురువారం సాయంత్రం 5
గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఉద్ధవ్‌ ఠాక్రేను మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ కోరారు.ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్‌ చేయాలని గవర్నర్‌ ఆదేశించారు.గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ప్లోర్‌ టెస్ట్‌ అని గవర్నర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ దృశ్యం చాలా కలవరపెడుతోంది. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్‌ అఘాడి ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఆకాంక్షించారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్‌ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా కలుసుకున్నారు... ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, ప్లోర్‌ టెస్ట్‌ కోసం అడిగారని గవర్నర్‌ కోష్యారి వివరించారు. అధికార పక్షం శివసేన.. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బలపరీక్షపై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. పార్టీ చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు బుధవారం ఉదయం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. శివ సేన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అంగీకరించింది కోర్టు. జస్టిస్‌ సూర్యకాంత్‌, పర్దివాలా నేతృత్వంలోని బెంచ్‌ సాయంత్రం విచారణ చేపట్టనుంది. గవర్నర్‌ ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయిస్తామని శివ సేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంలో శివసేన అభ్యర్థిస్తోంది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లో గురువారం బలపరీక్ష చేపట్టి తీరాలని ఉద్దవ్‌థాక్రే సర్కార్‌ను ఆదేశించారు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి రాజేంద్ర భగవత్‌కు బుధవారం ఉదయం గవర్నర్‌ లేఖరాశారు. గురువారం సాయంత్రం లోగా.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన రికార్డులను భద్రపర్చాలని గవర్నర్‌ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది.

 

4.ఆగస్ట్‌ 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక
` షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
` ఆగస్ట్‌ 10న ముగగియనున్న వెంకయ్య పదవీకాలం
` రాష్ట్రపతి అభ్యర్థికి ముగిసిన నామినేషన్ల ఘట్టం
న్యూఢల్లీి,జూన్‌ 29(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికకు రంగంసిద్దం అవుతున్న వేళ..16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్‌ విడుల చేయనున్నట్లు చెప్పింది. ఆ రోజు నుంచే ప్రారంభంకానున్న నామినేషన్ల దాఖలు పక్రియ జులై 19తో ముగియనుంది. 20న అధికారులు వాటిని పరిశీలించనున్నారు. 22వ తేదీ వరకు నామినేషన్ల విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్ట్‌ 6న ఎన్నిక జరుగనుంది. ఒకరికి మించి అభ్యర్థులు పోటీలో ఉంటే ఆగస్టు 6న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. కొత్త ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకోనుంది. 233మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12మంది నామినేటెడ్‌ సభ్యులు, 543మంది లోక్‌సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలావుంటే రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్‌ గడువు 29న బుధవారంతో ముగిసింది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం జూన్‌ 15న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఆ రోజు నుంచే నామినేషన్ల పక్రియ ప్రారంభమైంది. బుధవారంతో గడువు ముగియడంతో గురువారం నామినేషన్లు పరిశీలించనున్నారు. జులై 2 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు.జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా.. 21న ఓట్లను లెక్కిస్తారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే వీరిరువురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. పార్లమెంట్‌ హౌస్‌, రాష్టాల్ర శాసనసభల్లో రహస్య బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరుగుతుంది. ఓటర్లకు పార్టీలు విప్‌ జారీచేసే అవకాశం లేదు.

 

5.చిన్నారి భీమరాయుడికి ఊరట
` ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చూసి స్పందించిన మాతృ హృదయం
` ప్రతినెలా పెన్షన్‌ అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించిన చైల్డ్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ బి.పద్మజా రమణ
` చిన్నారి కుటుంబ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘జనంసాక్షి’ ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌
` భీమరాయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ‘జనంసాక్షి’ సిబ్బంది
(భీమరాయుడు తల్లిదండ్రులకు అండర్‌ టేకింగ్‌ పత్రాన్ని అందజేస్తున్న గద్వాలజి ల్లా చైల్డ్‌వెల్ఫేర్‌ ఆఫీసర్‌ హేమలత
రాష్ట్ర చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ పద్మజారమణ)
హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి): ‘చిన్నారి పేరు భీమరాయుడు టైప్‌ 1 డయాబెటిస్‌ తో బాధపడుతున్నాడు. ఈ బాబు అమ్మ నాన్న కూలి పని చేసి బతుకుతారు. ఇంత నిరుపేదలైన వీరు ఈ బాబు కోసం ఇన్సులిన్‌ కొనాలి. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇంతకంటే గొప్ప సహాయం ఏది ఉండదు. వీళ్ళ నాన్న పేరు రాఘవేంద్ర ఆయన ఫోన్‌ పే మరియు గూగుల్‌ పే నంబర్‌ 6303298183 పెడుతున్నాను. దయచేసి మనసున్న దాతలు సహాయం చేయగలరని మనవి’ అంటూ ‘జనంసాక్షి’ ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌ మంగళవారం సాయంత్రం ఫెస్‌ బుక్‌ లో చేసిన పోస్టుకు చైల్డ్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ బి.పద్మజా రమణ స్పందించారు. సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చూసిన పద్మజా రమణ అదేరోజు రాత్రి డయాబెటిస్‌ తో భాదపడుతున్న చిన్నారి కుటుంబ పరిస్థితి గురించి వాకబు చేసి బుధవారం ఉదయమే జోగులాంబ గద్వాల జిల్లా అధికారులతో మాట్లాడారు. చిన్నారి భీమరాయుడుకు ప్రతినెలా రూ.2వేల పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని చైల్డ్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ బి.పద్మజా రమణ జిల్లా అధికారులకు సూచించారు. దీంతో చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ అధికారిణి హేమలత చిన్నారి భీమరాయుడు స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులు రాఘవేంద్ర, సరస్వతి నుండి వివరాలు సేకరించారు. చిన్నారి సమస్య సోషల్‌ విూడియా ద్వారా తమ దృష్టికి వచ్చినప్పటికీ అధికారులు స్పందించిన తీరు అభినందనీయం. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న భీమరాజు గురించి ఎడిటర్‌ ద్వారా తెలుసుకున్న ‘జనంసాక్షి’ సిబ్బంది కూడా తమకు తోచినంత సహాయాన్ని భీమరాయుడు తండ్రి రాఘవేంద్రకు స్వచ్చందంగా అందజేశారు. ఈ సంధర్బంగా భీమరాజు కుటుంబానికి సహాయం చేసిన తమ సిబ్బందిని అభినందిస్తూ ఎడిటర్‌ ఎం.ఎం.రెహమాన్‌ జనంసాక్షి సిబ్బంది తమ సామాజిక స్పృహను మరోసారి వెల్లడిరచారని కొనియాడారు.

 

6.అందరికీ రైతుబంధు..
` ఎలాంటి ఆంక్షలు లేవు : మంత్రి నిరంజన్‌ రెడ్డి
` రెండో రోజు 24.68 లక్షల ఎకరాలకు రూ. 1,234.09 కోట్లు జమ
హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి):రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్షలు పెడుతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తేల్చిచెప్పారు. ఎక్కువ భూమి ఉన్న వారికే రైతుబంధు అనేది అవాస్తవం అని నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధును స్వీకరిస్తున్న రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఇవాళ మంత్రి నిరంజన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. 9వ విడుత రైతుబంధు కింద లబ్ధిదారులకు రూ. 7,508 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. ఇవాళ రెండు ఎకరాల్లోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు నగదును జమ చేశామని పేర్కొన్నారు. 24.68 లక్షల ఎకరాలకు రూ. 1,234.09 కోట్లు జమ చేశామని ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో ఎకరా, రెండు ఎకరాలు ఉన్న వారికి రూ. 1820.75 కోట్లు జమ చేశామన్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 36.41 లక్షల ఎకరాలకు ఆర్థిక సాయం అందిందని తెలిపారు. 10 ఎకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు అందిస్తుందని రూ. 250 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదు ఎకరాలు ఉన్న వారు 92.50 శాతం మంది ఉన్నారు. ఈ ఏడాది వానాకాలంలో 68.10 లక్షల మందికి రైతుబంధు అందిస్తున్నామని నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనూ రైతులకు చేసిందేవిూ లేదని నిరంజన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. ఎరువులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మాత్రం రెట్టింపు చేశారని మండిపడ్డారు. 60 ఏండ్లు నిండిన రైతులకు పెన్షన్‌ ఇస్తామని చెప్పిన కేంద్రం హావిూ నెరవేరడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

 

7.పెరగునున్న నిత్యావసరాల ధరలు
` జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు
న్యూఢల్లీి,జూన్‌ 29(జనంసాక్షి):వంటగదిలో ఇప్పటికే వంటనూనెలు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఇకపై నిత్యావసరాల ధరలు కూడా పెరగబోతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో..రోజువారీగా వాడే చాలా వస్తువుల ధరలు మండిపోనున్నాయి. బియ్యం, గోధుమలు లాంటి ధాన్యాలను ప్యాక్‌ చేస్తే 5 శాతం జీఎస్‌టీ కట్టాల్సిందే. ప్రీ`ప్యాక్డ్‌, లేబుల్డ్‌ మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్‌, తేనే, ఎండిన చిక్కుడు గింజలు, ఎండిన మఖానా, ఇతర ధాన్యాలపైనా జీఎస్టీ విధించారు. ఇక గోధుమ పిండి, మెస్లిన్‌ పిండి, బెల్లం, మురమురాలు, సేంద్రీయ ఎరువులు, కొబ్బరి కాంపోస్ట్‌ లాంటివాటికి 5 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఈ జాబితాలో ఉన్న వస్తువులన్నీ సామాన్యుల వంటగదిలో తరచుగా ఉపయోగించేవే. ప్యాక్‌ చేయని, లేబుల్‌ లేనిస బ్రాండెడ్‌ లేని వస్తువులకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే ఆ వస్తువుల్ని ప్యాక్‌ చేసి అమ్మితే 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇక కత్తుల రేట్లు కూడా పెరగనున్నాయి. వంటగదిలో వాడే కత్తులతో పాటు.. బ్లేడ్లు, పేపర్‌ నైవ్స్‌, పెన్సిల్‌ షార్ప్‌నర్స్‌, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్‌ సర్వర్లపై విధించే జీఎస్టీ 12 శాతం నుంచి 18శాతానికి పెంచారు. కరెంటుతో నడిచే సెంట్రిఫుగల్‌ పంపులు, టర్బైన్‌ పంపులు, నీటిలో మునిగే మోటార్‌ పంపులు, సైకిల్‌ పంపులపైనా జీఎస్టీ 18శాతానికి పెంచారు. అంతేకాదు భారీ యంత్రాలు, వెట్‌ గ్రైండర్లపైనా జీఎస్టీని 18శాతం విధించారు.బ్యాంకులు ఇచ్చే చెక్‌ బుక్‌పై జీఎస్‌టీ చెల్లించాలి. చెక్కుల్ని విడిగా ఇచ్చినా పుస్తకం రూపంలో ఇచ్చినా 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. రోజుకు 1000 రూపాయల లోపు ధరలు ఉన్న హోటల్‌ గదులకు 12 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఇది పన్ను మినహాయింపు కేటగిరీలో ఉంది. కాబట్టి కస్టమర్లు 12 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆస్పత్రుల్లో తీసుకునే రూమ్స్‌కి జీఎస్‌టీ చెల్లించాలి. ఐసీయూ తప్ప 5,000 రూపాయల కన్నా ఎక్కువ డైలీ రెంట్‌ ఉన్న గదులకు 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వర్తించదు. ఎల్‌ఈడీ లైట్స్‌, బల్బుల ధరలు పెరిగే అవకాశం ఉంది. వీటిపై జీఎస్‌టీ కౌన్సిల్‌ 12 శాతం జీఎస్‌టీ బదులు 18 శాతం జీఎస్‌టీ వసూలు చేయాలని సూచించింది.ఇక కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీని తగ్గించారు. వీటిలో రక్షణ రంగంలో వాడే వస్తువులు సేవలపై జీఎస్టీ విధించకూడదని నిర్ణయించారు. రోప్‌వే రైడ్లపై ఉూు 18శాతం నుంచి ఐదు శాతానికి తీసుకొచ్చారు. ఇక వస్తువుల క్యారీయింగ్‌ రెంట్లపైనా జీఎస్టీ తగ్గింపు వర్తించనుంది.

 

 

9.హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు
హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి): వచ్చే నెల 2న ప్రధాని మోదీ హైదరాబాద్‌ రానున్నారు. జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిసాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో భారీగా హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.బైబై మోదీ అనే హాష్‌ ట్యాగ్‌తో టివోలీ థియేటర్‌ ఎదురుగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్‌, నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్‌, హఠాత్తుగా లాక్‌డౌన్‌ అని గరీబోల్లను చంపినవ్‌, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు విూద పడేసినవ్‌, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావ్‌ అని, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవని ప్రశ్నించారు. అయితే ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఎవరు ఏర్పాటుచేశారనే విషయం తెలియాల్సి ఉన్నది.ప్రధాని మోదీ గత నెల హైదరాబాద్‌లోని ఐఎస్‌బీకి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఏంచేశాని ప్రశ్నిస్తూ.. 17 ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లను కొందరు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాటిని గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ పరిసరాలతోపాటు ప్రధాని ప్రయాణించిన వివిధ మార్గాల్లో ఏర్పాటు చేశారు.

 

10.ఆసియా`పసిఫిక్‌ స్థిరమైన నగరాల్లో టాప్‌ 20లో హైదరాబాద్‌
` ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ నివేదికలో వెల్లడి
హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి):తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో ఖ్యాతి పొందింది. ఆసియా`పసిఫిక్‌ ప్రాంతంలోని టాప్‌ 20 స్థిరమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలోని భారత దేశ నగరాల్లో మూడో స్థానంలో ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ‘యాక్టివ్‌ క్యాపిటల్‌ ఏసియా పసిఫిక్‌` రైజింగ్‌ క్యాపిటల్‌ ఇన్‌ అన్‌సర్టెన్‌ టైమ్స్‌’ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. పట్టణీకరణ ఒత్తిడి, వాతావరణ ప్రమాదం, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా 36 నగరాలకు రేటింగ్‌ ఇచ్చింది. ఆసియా`పసిఫిక్‌ ప్రాంతంలో సింగపూర్‌, సిడ్నీ, వెల్లింగ్టన్‌, పెర్త్‌, మెల్బోర్న్‌ వంటి నగరాలు వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌లో మొదటి ఐదు గ్రీన్‌`రేటెడ్‌ నగరాల జాబితాలో ఉన్నాయి.కాగా, ఏపీఏసీ సస్టైనబిలిటీ ఇండెక్స్‌ 2021లోని మొదటి ఇరవై స్థిరమైన నగరాల్లో నాలుగు భారతీయ నగరాలున్నాయి. ఇందులో బెంగళూరు, ఢల్లీి తర్వాత, స్థిరమైన వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్‌ మూడవ స్థానంలో ఉంది. స్థిరమైన అభివృద్ధిని సృష్టించేందుకు రియల్‌ ఎస్టేట్‌ రంగం నిబద్ధతకు ఇది మంచి సూచన అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి వృద్ధిని కొత్త మార్కెట్‌ డైనమిక్స్‌ ప్రోత్సహించాయని చెప్పారు. ప్రపంచ నిబద్ధత పర్యావరణ అనుకూల ప్రమాణాలైన కార్బన్‌ న్యూట్రాలిటీ, నెట్‌ జీరోపైలపై ప్రధానంగా దృష్టి సారించాయని అన్నారు. భారతీయ డెవలపర్‌లు తమ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను పెంచుకోవడానికి ఇది తోడ్పడిరదని వెల్లడిరచారు.