ALL NEWS

 

1జూబ్లీహిల్స్‌ అత్యాచారఘటనలో ముమ్మర దర్యాప్తు
` బెంజికారులో కీలక ఆధారాలు లభ్యం?
` మరో నిందితుడు ఉమర్‌ ఖాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌,జూన్‌ 5(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పెద్దల ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారంటూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు దూకుడు పెంచారు.ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు మరో నిందితుడు ఉమర్‌ ఖాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈకేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు.ఈకేసులో ఇప్పటికే నిందితులు దుశ్చర్యకు ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు బెంజికారుతో పాటు ఇన్నోవా కారును ఆదివారం సాయంత్రం క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, బెంజికారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పును క్లూస్‌ టీమ్‌ సీజ్‌ చేసింది. ఇన్నోవా కారులో ఎలాంటి ఆధారాలు లభించాయనేది మాత్రం పోలీసులు ఇంకా స్పష్టం చేయలేదు. ఈ ఘటన గత నెల 28న జరిగితే పోలీసులకు బాధితురాలి తండ్రి 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బెంజి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు. ఇన్నోవా కారును ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత నిన్న సాయంత్రం మొయినా బాద్‌లో స్వాధీనం చేసుకున్నారు.ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు.. వాహనం చిక్కకుండా మొయినా బాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్‌ వెనుక దాచేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్‌ కనిపిచంచకుండా, టీఆర్‌ నంబర్‌కూడా గుర్తుపట్టకుండా చేశారు. ఇన్నోవా కారు వ్యవహారంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి. మరో వైపు ఘటన తర్వాత షాక్‌కు గురైన బాలిక పూర్తిగా కోలుకోవడంతో పోలీసులు మరో సారి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు.జూబ్లీహిల్స్‌లోని అవ్నిూషియా పబ్‌కు వచ్చిన బాలికను ఇంటివద్ద దిగబెడతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజి కారులో ఎక్కించుకున్నారు. అందులో పబ్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్నప్పుడే బాలికపై అత్యాచారయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సు బేకరీ వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడికి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకురాగా.. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు ఇప్పుడే వస్తామంటూ వేచి ఉండాలని డ్రైవర్‌కు చెప్పి అతడిని వదిలి వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కన్పించింది. సాదుద్దీన్‌ మాలిక్‌ (18), అమేర్‌ ఖాన్‌ (18)లతో పాటు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు (16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కుమారుడు (16), బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు (16) కలిసి బాలికను బెదిరించి ఆమెను బెంజి కారు నుంచి ఇన్నోవా వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు (17) సైతం ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్లాడని తొలుత పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తాజాగా హల్‌చల్‌ అయిన వీడియో నేపథ్యంలో మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అతడిని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

 

2.సేవ్‌ సాయిల్‌ కోసం ప్రత్యేక ఉద్యమం
` అభివృద్ధి చెందిన దేశాలే భారీస్థాయిలో కర్బన ఉద్గారాలకు కారణం
` పర్యావరణ పరిక్షణకు భారత్‌ తీవ్ర కృషి చేస్తోంది:మోదీ
` భూసారంపై రైతులకు అవగాహన కోసం సాయిల్‌ హెల్త్‌ కార్డులను అందజేశాం
` ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్న ప్రధాని
దిల్లీ,జూన్‌ 5(జనంసాక్షి):వాతావరణ మార్పుల్లో మన పాత్ర అంతగా లేనప్పటికీ పర్యావరణ పరిక్షణకు మాత్రం భారత్‌ తీవ్ర కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.అభివృద్ధి చెందిన దేశాలు వనరులను భారీ స్థాయిలో దోపిడి చేస్తూ అత్యధికంగా కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సద్గురు జగ్గీవాసుదేవ్‌ నేతృత్వంలో కొనసాగుతోన్న ‘సేవ్‌ సాయిల్‌ ఉద్యమం’ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ క్రమంలో పెట్రోల్‌లో పదిశాతం ఇథనాల్‌ కలపాలనే లక్ష్యాన్ని భారత్‌ ఐదు నెలల ముందుగానే సాధించిందని ప్రధాని మోదీ ప్రకటించారు.’పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం 2014లో 2శాతం ఉండగా.. ప్రస్తుతం దాన్ని 10 శాతానికి తీసుకువచ్చాం. దీంతో 27లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించాం. తద్వారా రూ.40వేల కోట్ల విదేశీ మారక నిల్వలను ఆదా చేయగలిగాం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా శిలాజేతర ఇంధనాలతో 40శాతం విద్యుదుత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా తొమ్మిదేళ్ల ముందుగానే సాధించామన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో 20వేల చదరపు కి.విూ అటవీ విస్తీర్ణం పెరిగిందని గుర్తుచేసిన ఆయన.. వీటివల్ల అటవీ జంతువుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇక భూసారంపై రైతులకు అవగాహన లేకపోయేదని.. కానీ, ఈ సమస్యను అధిగమించడంతోపాటు భూసారంపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులను అందజేసిందన్నారు.ఇదిలాఉంటే, భూమి తన సారాన్ని కోల్పోతున్న నేపథ్యంలో దానిని మెరుగుపరచడంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు సద్గురు జగ్గీవాసుదేవ్‌ ‘సేవ్‌ సాయిల్‌ ఉద్యమాన్ని’ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 27 దేశాల్లో 100 రోజులపాటు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 75వ రోజు (జూన్‌ 5న )న దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రధాని మోదీ వివరించారు.

 

3.చురుగ్గా చైనా స్పేస్‌ స్టేషన్‌ పనులు..!
` షెన్‌రaూ`14 స్పేస్‌ షిప్‌ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు
బీజింగ్‌,జూన్‌ 5(జనంసాక్షి):అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం షెన్‌రaూ`14 స్పేస్‌ షిప్‌ను చైనా ప్రయోగించింది.ఇది ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వచ్చే ఆరునెలల పాటు వీరు అక్కడే ఉండి అంతరిక్ష కేంద్ర నిర్మాణం చేపట్టనున్నారు. షెన్‌రaూ`14 అంతరిక్ష నౌకను లాంగ్‌మార్చ్‌ 2ఎఫ్‌వై14 రాకెట్‌పై ఉంచి ఈశాన్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌ నుంచి ప్రయోగించారు.షెన్‌రaూ 14లో ఉన్న వారిలో కమాండర్‌ చెన్‌డాంగ్‌, ల్యూ యాంగ్‌, చైషూరెa ఉన్నారు. వీరిలో చెన్‌ 2016లో నిర్వహించిన షెన్‌రaూ 11 మిషిన్‌లో పాల్గొన్నారు. చెంగ్డూలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వారిని ఈ మిషిన్‌కు ఎంపిక చేసినట్లు చైనా పేర్కొంది. షెన్‌రaూ 14లో చిన్న రోబోటిక్‌ చేతులను కూడా అమర్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీన షెన్‌రaూ13 మిషిన్‌ సురక్షితంగా భూమికి చేరుకొంది. ఈ మిషిన్‌లో చైనా స్పేస్‌ స్టేషన్‌ టెక్నాలజీ వెరిఫికేషన్‌ను పూర్తి చేశారు.

 

 

4.జుబ్లీహిల్స్‌ ఘటనపై నివేదిక ఇవ్వండి
` గవర్నర్‌ ఆదేశం
హైదరాబాద్‌,జూన్‌ 5(జనంసాక్షి): జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన అంశంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.దీనిపై అనేక విూడియా రిపోర్టులను పరిశీలించానని.. ఈ దుర్ఘటన అత్యంత బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిని గవర్నర్‌ తమిళిసై ఆదేశించారు.జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌ వెళ్లిన మైనర్‌ బాలికను పరిచయం చేసుకున్న కొంతమంది యువకులు ఆమెను కారులో బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను తీసుకొచ్చి పబ్‌ వద్ద విడిచిపెట్టి వెళ్లారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ స్పందించి నివేదిక అందజేయాలని కోరారు.

 

5.దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా ఉధృతి
` 24వేలు దాటిన క్రియాశీల కేసులు..
` మహారాష్ట్రలో అధికంగా పెరుగుతున్న కేసులు..
` ఇది ఫోర్త్‌ వేవ్‌కు సంకేతమేనా?
దిల్లీ,జూన్‌ 5(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు 4 వేలకుపైగానే నమోదవుతున్నాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 4,13,699 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4270 కేసులు వెలుగులోకి వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.03%కి పెరిగింది. కొత్త కేసుల్లో మహారాష్ట్ర నుంచే 1300కుపైగా కేసులు ఉన్నాయి.నిన్న కొవిడ్‌తో చికిత్స పొందుతూ 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,692కు చేరింది.శనివారం 2,619 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.26 కోట్లు దాటింది. ఆ రేటు 98.73 శాతంగా కొనసాగుతోంది.గత కొన్ని రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటుండటంతో క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 24 వేలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24,052 (0.06%) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 11,92,427 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 194 కోట్లు దాటింది.
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు..
మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్‌ నెల ప్రారంభం నుంచి రోజుకు వెయ్యికిపైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం 1,357 కొత్త కేసులు రికార్డవగా.. ఒకరు వైరస్‌తో మృతి చెందారు. కేసులు భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కరోనా ఫోర్త్‌ వేరియంట్‌కు సంకేతమా? అనే భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమై, వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. అయితే, కరోనా కేసులు పెరుగుతున్నా.. మరణాల రేటు ఎక్కువగా లేనందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ఆదివారం పేర్కొన్నారు.ఇదిలా ఉండా.. రెండు రోజుల కిందట సర్కారు బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బస్సులు, రైళ్లు, సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కేసులు ముంబై, థానే, రాయ్‌గఢ్‌, పాల్ఘర్‌తో సహా పలు జిల్లాల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యమంత్రి రాజేశ్‌ తోపే ఇటీవల తెలిపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో శనివారం 889 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.మూడు నెలల తర్వాత ఇంత మొత్తంలో కొత్త కేసులు రికార్డవగా ఇదే తొలిసారి. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు లేఖ రాశారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైతే ముందు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఇవాళ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొవిడ్‌ బారినపడ్డారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కరోనా బారినపడ్డారు. అలాగే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, కార్తీక్‌ ఆర్యన్‌లతో సహా పలువురు తారలు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు.ప్రముఖ బాలీవుడ్‌ బడా ప్రొడ్యూస్‌ కరణ్‌ జోహార్‌ 50వ పుట్టిన వేడుకల్లో బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న దాదాపు 50 మంది వైరస్‌ బారినపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇవాళ దేశంలో కొత్తగా 4,270 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ద100 పరీక్షలలో 10 మరణానంతర ఇన్ఫెక్షన్‌కు పాజిటివ్‌గా తేలినందున కేరళ కూడా ఆందోళన చెందుతోంది.ంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,76,817కు చేరింది. అయితే, 34 రోజుల తర్వాత రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం కంటే ఎక్కువగా నమోదైంది.

 

6.బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం
` ఓ షిప్పింగ్‌ కంటైనర్‌ డిపోలో భారీ రసాయన పేలుడు
` 40 మంది మృతి.. 300 మందికిపైగా గాయాలు
` క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమం..
` పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇళ్లు..రంగంలోకి సైన్యం..
చిట్టగాంగ్‌,జూన్‌ 5(జనంసాక్షి):బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టగాంగ్‌ ప్రాంతంలోని ఓ షిప్పింగ్‌ కంటైనర్‌ డిపోలో భారీ రసాయన పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు సమాచారం. 300 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు.శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీతాకుందలోని కంటైనర్‌ డిపోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతం చిట్టగాంగ్‌కు 40 కి.విూ దూరంలో ఉంది. రసాయనాలు కలిగి ఉన్న చాలా కంటైనర్లు పేలినట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. మంటలను అదుపు చేస్తూ 40 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది పోలీసులు గాయపడినట్లు చిట్టగాంగ్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది.పేలుడు శబ్దాలు కొన్ని కిలోవిూటర్ల వరకూ వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సవిూపంలోని భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. శిథిలాలు అరకిలోవిూటరు దూరంలోని ఇళ్లపై కూడా పడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమం..క్షతగాత్రులతో సవిూపంలోని ఆస్పత్రులు నిండిపోయాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చాలా మందికి 60 నుంచి 90 శాతం వరకూ కాలిన గాయాలయ్యాయని వైద్యులు చెబుతున్నారు.పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రమాదకర రసాయనాలు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

 

7.పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్‌
కీవ్‌,జూన్‌ 5(జనంసాక్షి):ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ ఆదివారం పేలుళ్లతో దద్దరిల్లింది. దాదాపు కొన్ని వారాల వ్యవధి తర్వాత ఈ స్థాయి దాడిని కీవ్‌ చవిచూసింది.దీంతో నగరంలోని పలు భవనాల నుంచి నల్లటి పొగ వెలువడుతోంది. ఈ దాడుల్లో కనీసం ఒకరు గాయపడినట్లు ప్రాథమిక వార్తలతో తెలుస్తోంది. మరోపక్క డాన్‌బాస్‌ ప్రాంతంలోని సెవీరోడొనెట్స్క్‌ నగరంలో హోరాహోరీ పోరాటం జరుగుతోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ ఆ నగరంలో పరిస్థితి అత్యంత సంక్లిష్ఠంగా ఉందని పేర్కొన్నారు.లుహాన్స్క్‌ ప్రాంతం చాలా వరకు రష్యా దళాలు, స్థానిక వేర్పాటువాద దళాల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో సెవీరోడొనెట్స్క్‌, ఇతర నగరాల్లో రష్యా బలగాలు నిరంతరాయం దాడులు యుద్ధవిమానాలు, శతఘ్నులతో దాడులు చేస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఉక్రెయిన్‌ దళాలు కొన్ని చోట్ల మొండిగా పోరాడుతున్నాయని జెలెన్‌స్కీ వెల్లడిరచారు. పశ్చిమ దేశాలు అందించే అత్యాధునిక ఆయుధాల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. మరోపక్క ఉక్రెయిన్‌ ఇతర ప్రాంతాల నుంచి సరఫరాలు డాన్‌బాస్‌ ప్రాంతానికి చేరకుండా రష్యా బలగాలు కీలక వంతెలను పేల్చేశాయి.తాజాగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ప్రజల జీవనం సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత ఈ దాడులు మళ్లీ జరగడం విశేషం. కానీ, నేడు ఉదయం అక్కడి ప్రజలు నిద్రలేచే సమయానికి నగరం మొత్తం నల్లటి పొగకమ్ముకొని ఉంది. ఆ నగరం ఇప్పటికీ యుద్ధం అంచున్న ఉందన్న విషయాన్ని వారికి గుర్తు చేసింది. తూర్పు ఐరోపా దేశాలు సరఫరా చేస్తున్న ట్యాంకులను లక్ష్యంగా చేసుకొని రష్యా అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణుల దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడిరచింది.

 

8.అమెరికా అధ్యక్షభవనవైపు దూసుకొచ్చిన విమానం
` బెంబేలెత్తిన శ్వేతసౌధం అధికారులు
రిహోబత్‌ బీచ్‌,జూన్‌ 5(జనంసాక్షి):అమెరికాలో ఓ చిన్న ప్రైవేటు విమానం శనివారం పొరపాటున అధ్యక్షుడి అధికారిక నివాసం చుట్టూ ఉండే నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది.దీంతో అప్రమత్తమైన భద్రతా బృందం వెంటనే బైడెన్‌తో పాటు ప్రథమ మహిళను కొద్దిసేపు మరో సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం వారికి ఎలాంటి ముప్పు లేదని శ్వేతసౌధం అధికారి ఒకరు ప్రకటించారు.బైడెన్‌ ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌తో కలిసి ఇటీవల డెలావేర్‌లోని రిహోబత్‌ బీచ్‌లోని అధ్యక్ష విడిదికి చేరుకున్నారు. రాజధాని వాషింగ్టన్‌కు ఇది 200 కి.విూ దూరంలో ఉంటుంది. అయితే, శనివారం ఓ చిన్న విమానం పొరపాటున నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఓవైపు విమానాన్ని బయటకు తరుముతూనే.. మరోవైపు అధ్యక్షుడిని భారీ బందోబస్తు మధ్య మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానం పొరపాటున ప్రవేశించిందని తెలియగానే.. తిరిగి అధ్యక్షుడు నివాసానికి చేరుకున్నారు.విమానంలో ఉన్న పైలట్‌ సరైన రేడియో ఛానల్‌ ద్వారా అందుబాటులోకి రాలేదని అధికారులు తెలిపారు. అలాగే ఫ్లైట్‌ గైడెన్స్‌ను కూడా ఆయన పాటించలేదని పేర్కొన్నారు. పైలట్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తామని వెల్లడిరచారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విమానం దాడి లక్ష్యంతో అటుగా రాలేదని స్పష్టమైందన్నారు. నిషేధిత ప్రాంతంపై పైలట్‌కు అవగాహన లేకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని తేలిందన్నారు.వాషింగ్టన్‌ వెలుపలి ప్రాంతాలకు అధ్యక్షుడు బయలుదేరినప్పుడు ఆయన విడిది చేసే ప్రదేశాల్లో దాదాపు 10 మైళ్ల వ్యాసార్ధం వరకు నో`ఫ్లై జోన్‌గా ప్రకటిస్తారు. మరో 30 మైళ్ల వ్యాసార్ధంలో ఉన్న ప్రాంతాన్ని నిషేధిత గగనతలంగా పేర్కొంటారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ నిబంధనల ప్రకారం.. పైలట్లు విమానంలో బయలుదేరడానికి ముందు నిషేధిత గగనతలాల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. తరచూ ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలా అనుకోకుండా ప్రవేశించే విమానాలను మిలిటరీ జెట్లు, కోస్ట్‌ గార్డ్‌ హెలికాప్టర్లు వెంటాడి దగ్గర్లోని వైమానిక స్థావరాలకు తీసుకెళ్లి పైలట్లను విచారిస్తారు.

 

9.కురిసింది వాన.. హైదరాబాద్‌లోన..
` పలు ప్రాంతాల్లో వర్షం
` నగర వాసులకు ఉపశమనం...
హైదరాబాద్‌,జూన్‌ 5(జనంసాక్షి):నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్‌మెట్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురువగా.. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా జనం ఉక్కపోత నుంచి ఊరట పొందారు. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

10.నదిలోకి స్నానానికి వెళ్లి ఏడుగురు యువతుల మృతి..
` అంతా 18 ఏళ్లలోపు వారే..
చెన్నై,జూన్‌ 5(జనంసాక్షి):తమిళనాడు కడలూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నెల్లికుప్పం అరుంగుణం సవిూపంలోని కెడిలం నదిలో ఏడుగురు యువతులు మునిగిపోయి మృత్యువాతపడ్డారు.వారంతా 18 ఏళ్లలోపువారే కావడం కలచివేస్తోంది. స్థానిక గ్రామాలకు చెందిన కొంతమంది యువతులు, బాలికలు ఆదివారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు కెడిలం నదిలోకి దిగారు. అయితే నీటి ప్రవాహం అధికం కావడంతో.. నవిత(18), ప్రియ(18), సుముత(18), మోనిష(16), సంఘవి(16), ఆర్‌.ప్రియదర్శిని (15), ఆమె సోదరి దివ్యదర్శిని (10) నీటిలో కొట్టుకుపోయారు.అక్కడ ఉన్నవారి కేకలు విని, కొంతమంది నదిలోకి దిగి వారిని బయటకు తీశారు. వెంటనే కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు. సోదరీమణులైన ప్రియదర్శిని, దివ్యదర్శినిది అయంకురిన్జిపడి గ్రామం కాగా.. మిగతావారు కుచ్చిపాలాయం గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..సమాచారం అందుకున్న మృతుల బంధువులు, కుటుంబం సభ్యులు కడలూరు ప్రభుత్వ దవాఖానకు వద్దకు చేరుకున్నారు. సరదాగా స్నాసానికి వెళ్లి వస్తామని చెప్పి విగతజీవులు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే, నదిలో స్నానానికి వెళ్లి సమయంలో ఇద్దరు ఈత కొట్టే ప్రయత్నంలో డ్యామ్‌ సవిూపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోగా.. వారిని కాపాడే ప్రయత్నంలో వారిని రక్షించేందుకు వెళ్లి ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

11.సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో అన్ని రంగాలలో తెలంగాణ అగ్రస్థానం
` అరవై ఏండ్ల తండ్లాటకు ఎనిమిదేండ్ల పాలనతో పరిష్కారం
` 24 గంటల కరంటు తెలంగాణ తొలి విజయం :మంత్రి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి,జూన్‌ 5(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో అన్ని రంగాలలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.అరవైఏండ్ల తండ్లాటకు ఎనిమిదేండ్ల పాలనతో సీఎం కేసీఆర్‌ పరిష్కారం చూపారని అన్నారు. జిల్లాలోని రేవల్లి మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన రేవల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికివనపర్తి క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వనపర్తి ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..24 గంటల కరంటు తెలంగాణ తొలి విజయం అన్నారు. దేశంలోనే వ్యవసాయానికి ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుబంధు, రైతుబీమా అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, ఆసరా పథకాలతో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ తరహా పథకాలు అమలు కావడం లేదన్నారు. తెలంగాణ మిషన్‌ భగీరథను ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కింద తామే నీళ్లు ఇస్తున్నట్లు కేంద్రం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలతో తెలంగాణకు ఒరిగేది సున్నా. టీఆర్‌ఎస్‌ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

12.ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు
` బీజేపీ అధికార ప్రతినిధుల బహిష్కరణ
` పార్టీ నుంచి సస్పెండైన నుపుర్‌ శర్మ,నవీన్‌ కుమార్‌ జిందాల్‌
దిల్లీ,జూన్‌ 5(జనంసాక్షి):మత భావాలను కించపరిచే విధంగా వ్యవహరించిన ఇద్దరు నేతలపై భారతీయ జనతా పార్టీ వేటు వేసింది. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌పై వేటు వేసింది.పార్టీ పదవులతో పాటు, పార్టీ నుంచి వారిని సస్పెండ్‌ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ పార్టీ ఈ చర్యలకు పూనుకుంది.భాజపాకు నేత నుపుర్‌ శర్మ ఇటీవల ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడుతూ.. ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ మత వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వర్గం వారు స్థానిక మార్కెట్‌ను మూసివేందుకు ప్రయత్నించారు. దీన్ని మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 40 మంది పౌరులు, 20 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.ఇదిలా ఉండగా.. వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్‌.. ఇస్లామిక్‌ మతపరమైన పుస్తకాలలోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్‌లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్‌గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడిరది. అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు నూపుర్‌ శర్మపై హైదరాబాద్‌, పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి..నుపుర్‌ శర్మ తరహాలోనే నవీన్‌ కుమార్‌ జిందాల్‌ సైతం ట్విటర్‌ వేదికగా కించపరిచే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భాజపా వారిని సస్పెండ్‌ చేసింది.కాన్పూర్‌ ఘర్షణల నేపథ్యంలో భాజపా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఏ మతాన్ని కించపరిచినా సహించేది లేదని పేర్కొంది. మతం పేరును ప్రస్తావించకుండా అంతకుముందు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘’సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత దేశంలో ప్రతి మతమూ వర్ధిల్లుతోంది. అన్ని మతాలను భాజపా ఎప్పటికీ గౌరవిస్తుంది. మతపరమైన వ్యక్తులను ఎవరిని కించపరిచినా భాజపా సహించదు. అలాంటి వ్యక్తులను పార్టీ ఎప్పటికీ ప్రోత్సహించదు’’ అని భాజపా ఓ ప్రకటనలో పేర్కొంది. భారతీయ పౌరులు ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని తెలిపింది. దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా..: నుపుర్‌ శర్మ
తాను చేసిన వివాదాస్పదం కావడం, పార్టీ క్రమశిక్షణ చర్యలకు పూనుకోవడంపై నుపుర్‌ శర్మ స్పందించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ఎవరి మత భావాలను కించపరచడం తన ఉద్దేశం కాదని ఈ సందర్భంగా తెలిపారు. తాను ఎప్పటి నుంచో టీవీ డిబేట్లకు హాజరవుతూ వస్తున్నానని, ఇటీవల జరిగిన టీవీ డిబేట్‌లో మాత్రం శివుడిని పదే పదే కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

 

13.ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
` లోయలో పడ్డ బస్సు.. 22 మంది మృతి?
డెహ్రాడూన్‌,జూన్‌ 5(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. గంగోత్రి`యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు దమ్టా వద్ద లోయలో పడిరది. ఈ దుర్ఘటనలో 22 యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్టుగా తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చార్‌ధామ్‌ యాత్రికులు యమునోత్రి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది.

14.బ్రాండిక్స్‌లో మళ్లీ విషవాయువు లీక్‌.. పరుగులు తీసిన సెక్యూరిటీ
అమరావతి,జూన్‌ 5(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌లో మరోసారి విషవాయువు లీక్‌ అయ్యింది. ఘాటు వాసన రావడంతో సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పీసీబీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి చక్కదిద్దేంతవరకు సెజ్‌ను మూసివేసి రెండు రోజులు సెలవులు ప్రకటించడంతో కార్మికులు ఎవరూ రాకపోవడంతో ఆదివారం మరోసారి పెను ప్రమాదం తప్పింది.మూడు రోజుల క్రితం బ్రాండిక్స్‌ సీడ్స్‌ సెజ్‌ నుంచి విషవాయువు లీక్‌ కావడంతో మూడు వందల మందికి పైగా మహిళలు అస్వస్తతకు గురయ్యారు. వీరిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై స్పందించి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కాలుష్య నియంత్రణ అధికారులు నిన్నటి నుంచి సెజ్‌ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో విషవాయువు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని సమయంలో మరోసారి విషవాయువు లీక్‌ కావడం కలకలం రేపుతుంది.

 

15.మరోసారి ఉత్తర కొరియా దూకుడు..
ఏకంగా ఎనిమిది క్షిపణుల ప్రయోగం!
ప్యాగ్యాంగ్‌,జూన్‌ 5(జనంసాక్షి):క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. ఆదివారం ఏకంగా ఎనిమిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడిరచింది.నాలుగేళ్ల తర్వాత అమెరికా, దక్షిణ కొరియాలు నిర్వహించిన మొదటి సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన మరుసటిరోజే ఈ ప్రయోగాలు చేపట్టడం గమనార్హం. ఇదిలా ఉండగా.. 2022 మొదటినుంచే కిమ్‌ ప్రభుత్వం క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. 2017 తర్వాత మొదటిసారి పరీక్షించిన ఫుల్‌ రేంజ్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం సహా ఇప్పటివరకు 17 పరీక్షలు నిర్వహించింది.ప్యాంగ్యాంగ్‌లోని సునాన్‌ ప్రాంతం నుంచి ఎనిమిది స్వల్ప`శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించినట్లు తమ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు. వాటిని జపాన్‌ సముద్రం వైపు ప్రయోగించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తమ సైన్యాన్ని అప్రమత్తం చేశామన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తున్నాయని పేర్కొన్నారు. జపాన్‌ సైతం తాజా ప్రయోగాలను ధ్రువీకరించింది. అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో పరీక్షలు జరపడం అసాధారణ విషయమని జపాన్‌ రక్షణ మంత్రి నోబువో కిషి ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా ఆరు క్షిపణులను ప్రయోగించిందని చెబుతూ.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.ఇదిలా ఉండగా.. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. వాటిని తమపై దాడుల కోసం చేపడుతోన్న రిహార్సల్స్‌గా అభివర్ణించింది. ఆదివారం నాటి ప్రయోగాలు కూడా.. ఈ విన్యాసాలకు ప్రతిస్పందనగానే నిర్వహించి ఉండొచ్చని అసన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌ పరిశోధకుడు గో మ్యోంగ్‌ హ్యూన్‌ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి విన్యాసాలు భారీ స్థాయిలో జరిగాయని భావిస్తూ.. అందుకు దీటుగానే ఏకంగా ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోందని ఓ వార్తాసంస్థకు తెలిపారు.