విషయం లేదు.. విషం కక్కారు

 



` తుస్సుమన్న మోదీ సభ
` తెలంగాణ ప్రజల ప్రశ్నలకు జవాబేది?
` హామీల అమలులో తెలంగాణాకు మొండి చెయ్యి
` మంత్రులు హరీశ్‌,కొప్పుల,తలసాని ధ్వజం
హైదరాబాద్‌,జూలై 4(జనంసాక్షి):సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ లో ప్రధాని మోడీ ప్రసంగంపై టీఆర్‌ఎస్‌ మంత్రులు విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ఒక ప్రశ్నకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పలేదని, అసలు తమకు జవాబుదారీతనమే లేదని మోడీ మరోమారు నిరూపించుకున్నారని మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా దేశానికి, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విధానం ఏదైనా ప్రకటిస్తారని ఆశించామని, కానీ పార్టీకి ఆ విధానమే లేదని మోడీ తేల్చేశారని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప ఆ పార్టీకి మరేమీ తెలియదని మండిపడ్డారు. ప్రధాని ప్రసంగం పై స్పందించిన మంత్రి హరీష్‌ రావు ప్రధాని రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే ఒక్క ప్రకటన చేయలేదని ధ్వజమెత్తారు. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని చెబుతున్న కేంద్ర మంత్రులు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన యూనివర్సిటీకి అనుమతులు నిధులు ఇవ్వలేదని పేర్కొన్న హరీష్‌ రావు సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదని ప్రధాని మోడీని నిలదీశారు. తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడం లేదా అంటూ హరీష్‌ రావు మండిపడ్డారు. గుజరాత్‌ కు క్రూడాయిల్‌ రాయల్టీ 763 కోట్ల రూపాయలు విడుదల చేశారని, ఇక రాజ్‌ కోట్‌ కు ఎయిమ్స్‌, బుల్లెట్‌ ట్రైన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయుర్వేదిక్‌ యూనివర్సిటీ కి జాతీయహోదా ఇవ్వడంతోపాటు, ట్రెడిషనల్‌ మెడిసిన్‌ కు గ్లోబల్‌ సెంటర్‌ మంజూరు చేశారని పేర్కొన్నారు. మిషన్‌ యూపీ కింద రూ. 55,563 కోట్లు, 9 మెడికల్‌ కాలేజీలు, కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రకటించారని హరీష్‌ రావు తెలిపారు. కర్ణాటకకు తుముకూర్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ, ముంబై బెంగళూరు మధ్య ఎకనామిక్‌ కారిడార్‌, మైసూరు టెక్స్‌ టైల్‌ మెగా క్లస్టర్‌ వంటివి ఇచ్చారని, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మొండిచేయి చూపించారని మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొన్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. తాము అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మోడీ ప్రసంగం సాగిందని మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు.
తెలంగాణ ద్రోహి ప్రధాని మోదీ: మంత్రి కొప్పుల ఈశ్వర్‌
తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీ కాదు ఖేడీ అంటూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మోదీ తెలంగాణకు నష్టం కలిగిస్తూనే ఉన్నారన్నారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ రాష్ట్రానికి మోదీ తొలి ద్రోహం చేశారన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని విభజన చట్టంలో ఉన్నా.. ఇంతవరకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లుగా దేశాన్ని పాలిస్తూ ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని దక్కించుకొని మత రాజకీయాలు చేస్తున్న మోదీ తెలంగాణకు పనికి వచ్చే ఒక్క మంచి పనైనా చేశారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది నెలల కాలంలో ఒక్క నవోదయ పాఠశాలను, సైనిక్‌ స్కూల్‌ ను సైతం మంజూరు చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా 154 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసిన మోదీ.. రాష్ట్రంలో ఒక్క మెడికల్‌ కాలేజీని మంజూరు చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో గతంలో ఎప్పుడు లేనంతగా పంట పండిస్తే వడ్లు కొనమని రైతులను రాష్ట్రాన్ని దొంగ దెబ్బ తీసిన దుర్మార్గమైన చరిత్ర ప్రధాని మోదీదేని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే నచ్చని మోదీ జాతీయ సమావేశాల పేరిట హైదరాబాద్‌కు తెలంగాణపై అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
రాష్టాన్రికి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి:కేంద్రం రాష్టాన్రికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని టెంపుల్స్‌ గురించి మోడీ మాట్లాడారని... అసలు దేవాలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిగ్ధం కొనసాగుతోందన్నారు. సింగిల్‌ ఇంజన్‌ సర్కార్‌ తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నా మని.. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉన్న రాష్టాల్ల్రో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్టాల్ల్రో జరుగుతుందా అని నిలదీశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడారు. బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం చప్పగా సాగింద న్నారు. మోదీ హైదరాబాద్‌ అందాలు చూసి వెళ్లారని చెప్పారు. బీజేపీ సభకు బల్కంపేట టెంపుల్‌కి వచ్చినంత మంది రాలేదని తలసాని అన్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకి మోడీ ఒక్క సమాధానం ఇవ్వలేదన్నారు. టెక్ట్స్‌ టైల్‌ పార్క్‌, కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చారా అని అడిగారు. అమిత్‌ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని.. సికింద్రాబాద్‌ అభివృద్ధికి కిషన్‌ రెడ్డి చేసిందేమిటో చెప్పాలన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పోతేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా అమలుకాకపోతే బీజేపీ వాళ్లు రాష్ట్రంలో తిరిగేవాళ్లా అన్న తలసాని..బీజేపీ లాగ చిల్లర రాజకీయాలు చేయమని చెప్పారు. దేశం నుంచి బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్టాన్రికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేక పోయారని మంత్రి తలసాని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదని చెప్పారు. బీజేపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆదివారం నాటి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నీళ్లు, నిధుల గురించి మాట్లాడారని, రెండ్రోజులపాటు జరిగిన కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా అని ప్రశ్నించారు.