రద్దీ తక్కువగా ఉండే రైళ్లలలో రాయితీ టిక్కెట్లు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): రద్దీ తక్కువగా ఉండే రైళ్లలో చార్జీలపై 25 శాతం రాయితీ ఇవ్వాలని రైల్వేలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శతాబ్ది, తేజాస్‌, ఇంటర్‌సిటీ, కొన్ని డబుల్‌ డెక్కర్‌ రైళ్లలో చెయిర్‌ కార్లు, ఎగ్టిక్యూటివ్‌ సీట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని రైల్వే భావిస్తున్నాయి. ఖాళీ సీట్లతో ఈ రైళ్లు నడవకుండా మరింత మంతి ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ చర్యలు చేపట్టాలని రైల్వేలు 
ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రద్దీ తక్కువగా ఉండే రైళ్లకే ఈ రాయితీ వర్తించే అవకాశం ఉంది.
ఆయా రైల్వే జోన్‌కు చెందిన ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్లకే ఏ రైళ్లకు ఈ రాయితీని వర్తింపచేయాలో నిర్ణయించే అధికారాన్ని వదిలేస్తారని తెలుస్తోంది. బేసిక్‌ ఛార్జీపైనే ఈ రాయితీ అందచేస్తారు. జిఎస్‌టి, రిజర్వేషన్‌ ఛార్జీ, సూపర్‌ఫాస్ట్‌ టారిఫ్‌, తదితర ఛార్జీలను మాత్రం విడిగా వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ రద్దీతో నడిచే రైళ్లను సెప్టెంబర్‌ 30లోగా గుర్తించాలని అన్ని రైల్వే జోన్లను రైల్వే బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది.