భారత రాజకీయాల్లో అరుదైన నేత వాజ్‌పేయ్‌ !


అద్భుత వాక్చాతుర్యం ఆయనకే సొంతం

అజాత శతృవు ..నిస్వార్థరాజకీయ నేత
ఆయన జయంతి సందర్భంగా నేడు సుపరిపాలనా దినోత్సవం
న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): రాజకీయాల్లో ఆజాత శతృవుగా, నిరాడబంరునిగా జీవించిన అరుదైన వ్యక్తి స్వర్గీయ ప్రధాని అట్‌బిహారీ వాజ్‌పేయ్‌. వాజ్‌పేయ్‌ పేరు లేకుండా భారత రాజకీయాల పరిణామ క్రమాన్ని చూడలేం. భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన ఆయన దేశంలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. దేశహితమే వాజ్‌పేయ్‌ అభిమతమన్నట్లుగా ఆయన జీవితాంతం పనిచేశారు. భారత రాజకీయాల్లో అజాత శతృవుగా పేరుగాంచిన అనన్య సామాన్యుడు దివంగత వాజ్‌పేయి. ఆయననిస్వార్థ రాజకీయ దురంధురుడు. 1924 డిసెంబర్‌ 25న మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తొలి నాయకుడు. కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన చేసిన కాలంలో అనేక విప్తవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అటల్‌ బిహారీ వాజపేయి బ్రహ్మచారి. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్‌ 25ను సుపరి పాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏటా ఇప్పుడు డిసెంబర్‌ 25ను సుపరిపాలనా దినంగా పాటిస్తున్నారు. 2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వాజపేయి నివాసానికి తరలి వెళ్ళారు. హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైన వాజ్‌పేయ్‌ అనర్గళ ఉపన్యాసకుడు. చతురోక్తులతో సమ్మోహితులను చేసే రాజకీయ స్రష్ట. 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఫ్‌ు పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్‌ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించి ప్రపంచనేతల ప్రశంసలు పొందారు. వాజపేయి గ్వాలియర్‌లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్‌ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించి, 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1939 లో రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఫ్‌ులో కూడా చేరాడు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940`44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హాజరైనాడు. ఆయన 1947 లో ’పూర్తి స్థాయి సేవకుడు’ అనగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రచారక్‌ అయ్యాడు. ఆయన దేశ విభజన తర్వాత
జరిగిన అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు. 1942 ఆగస్టులో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో, ఆయన తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టయిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయమేర్పడిరది.1954 లో కాశ్మీరులో కాశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఆమరణ
నిరాహారదీక్ష ప్రారంభించినప్పుడు, వాజపేయి ఆయన వెంటే ఉన్నాడు. ముఖర్జీ ఈ నిరాహారదీక్షా సమయంలోనే కాశ్మీరు జైలులో మరణించాడు. 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్‌ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన వాగ్దాటి మూలంగా, అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఊహించాడు. ఆయనకు గల వాగ్దాటి, సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఫ్‌ులో ముఖ్యనేతగా ఎదిగాడు. నానాజీ దేశ్‌ముఖ్‌, బాల్‌రాజ్‌ మధోక్‌, లాల్‌
కృష్ణ అద్వానీలతో కలిసి జనసంఫ్‌ును జాతీయస్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించాడు. ఎన్‌డిఎ పార్టీల కూటమితో 1998 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బిజెపి అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్ని కలిసి నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌గా యేర్పడ్డాయి. వాజపేయి రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. అయితే ఆనాడే వాజ్‌పేయ్‌ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికైనా బిజెపి సంపూర్ణ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుందని ప్రకటించాడు. ఇప్పుడు మోడీ నాయకత్వంలో ఆయన కల నెరవేరింది.