పంటలకు గిట్టుబాటు ధరకల్పించాలి

- వరి కంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో టీడీపీ నిరసన ప్రదర్శన
అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సమస్యలపై సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నిరసన చేపట్టింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పంటకు గిట్టుబాటు ధరతోపాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వరి కంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి మాదిరిగా మారిందని అన్నారు. రైతులు పండించిన పంటలు కొనే నాథులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దిగిబడి తగ్గినా ఎవరూ కొనట్లేదని అన్నారు. వేరు సెనగ, పామాయిల్‌, శనగ, పసుపు, పత్తి రైతులు కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. రైతులకు గిట్టబాటు ధర చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 6 నెలలుగా ప్రభుత్వం రైతులను మోసం చేస్తునే ఉందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే వరకు పోరాటం కొనసాగుతుందని మరో నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.