2430జీవో ఏపీ అసెంబ్లీలో రగడ


- అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం
- జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీడీపీ డిమాండ్‌
- నిబంధనల ప్రకారమే జీవో తెచ్చామన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి
- తప్పులు రాస్తే నిలదీయటం తప్పా అంటూ ఎదురుదాడి
- చంద్రబాబుకు ఇంగ్లీష్‌ చదవటం రాదంటూ ఎద్దేవా
- ఘాటు స్పందించిన ప్రతిపక్షనేత చంద్రబాబు 
- 2430 జీవోను జాతీయ విూడియా వ్యతిరేకిస్తుంది
- వారికి ఇంగ్లీష్‌ చదవడం రాదని అంటారా?
- వాళ్లకు జగన్‌నే ఇంగ్లీష్‌ నేర్పించమనండంటూ సెటైర్లు వేసిన బాబు
- మార్షల్స్‌ పరిధిదాటి వ్యవహరిస్తున్నారన్న చంద్రబాబు
- వారిపై చర్యలు తీసుకోవాలని సభలో డిమాండ్‌
అమరావతి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : 2430 జీవో, పలు ఛానల్స్‌ నిషేధంపై ఏపీ అసెంబ్లీలో గురువారం వాడీ-వేడి చర్చ జరిగింది. జీవోను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గళమెత్తారు. జీవో వల్ల విూడియా స్వేచ్ఛను హరించివేసినట్లవుతుందని, వెంటనే జీవోను వెనక్కి తీసుకొని విూడియాకు స్వేచ్ఛను కల్పించాలని టీడీపీ సభ్యులు కోరారు. దీంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. నిబంధనల ప్రకారమే జీవోను తెచ్చామని, తప్పుడు వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఎదురుదాడి చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు విూడియాపై ఆంక్షలు, 2430 జీవోను రద్దు చేయాలంటూ  తెలిపారు. తాము ఎలాంటి ప్లకార్డులు పట్టుకోకుండా నిరసన తెలిపినా అసెంబ్లీ గేటు దగ్గర మార్షల్స్‌ అడ్డుకున్నారని అచ్చెన్నాయుడు సభలో ప్రస్తావించారు. అసెంబ్లీ దగ్గర మార్షల్స్‌ దురుసుగా ప్రవర్తించారని..  సభను వాయిదా వేసి చీఫ్‌ మార్షల్‌ను పిలిపించి మాట్లాడాలని.. లేదంటే సభలో ఉండేది లేదన్నారు. చీఫ్‌ మార్షల్‌పై చర్యలు తీసుకోవాలని.. ఆయనపై చర్యలు తీసుకోకుంటే అసెంబ్లీలో ఉండలేం అన్నారు. దీనిపై స్పందించిన శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.. యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడే కొన్ని నిబంధనలు పెట్టారని గుర్తు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ ప్లకార్డులు పట్టుకోకూడదని అప్పుడే నిబంధనలు పెట్టారని, మార్షల్స్‌ ఎవరినీ తోయలేదని, టీడీపీ సభ్యులే మార్షల్స్‌ను తోసేశారని మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరుపైనే మార్షల్స్‌ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జీవో నెం. 2430ని తేవడాన్ని ప్రతీఒక్కరూ వ్యతిరకిస్తున్నారని, దీని వల్ల విూడియా స్వేఛ్చను హరించివేసినట్లవుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కేవలం కక్షపూరితంగానే విూడియాపై ఆంక్షలు విధిస్తున్నారని ఇది సబబు కాదని, వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ సభ్యుల వాదనలపై సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. గత ఐదేళ్లలో టీడీపీ అసెంబ్లీ జరిపిన తీరును ప్రజలంతా చూశారన్నారు. 2430 రద్దు చేయాలన్న చంద్రబాబు ధోరణి ఆశ్చర్యంగా ఉందని, జరగంది, జరిగినట్లుగా చూపించినా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసినా చెడ్డపేరు తీసుకోవాల్సిందేనా అంటూ ప్రశ్నించారు. అబద్దాలు రాస్తే.. ఉన్నది లేనట్లుగా రాస్తే ప్రశ్నించే హక్కు ఉందని.. అవసరమైన కేసులు పెడతామని.. 2430 జీవో చదివితే తప్పు అని ఎవరూ అనరన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబుకు సన్నిహితులు 
కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2430 జీవోను అర్థం చేసుకోవడంలో లోపం ఉందని జగన్‌ అన్నారు. 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తికి ఇంగిత జ్ఞానం లేదా అంటూ ప్రశ్నించారు. జీవో 2430ను చంద్రబాబు చదివారా లేదా.. ఇంగ్లీష్‌ రాదేమో.. జీవోలో భావాన్ని చంద్రబాబు అర్థం చేసుకోవడంలో లోపం ఉందేమో అంటూ విమర్శించారు. దీనికి స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం తనకు ఇంగ్లీష్‌ రాదన్నారని అని అవహేళన చేయడం తగదన్నారు. వెంకటేశ్వర యూనివర్సిటీలో తాను ఎంఏ చేశానని అన్నారు. జగన్‌ ఎక్కడ చదివారో చెబితే తానూ వెళ్లి ఇంగ్లీష్‌ నేర్చుకుంటాను అన్నారు. తనకు ఇంగ్లీష్‌ అర్థం కాదన్నారు. జాతీయ విూడియాకు అర్థం కాలేదా.. వారు ఈ జీవోను ఖండించ లేదా అంటూ ప్రశ్నించారు. వాళ్లకు జగన్‌ ఇంగ్లీష్‌ నేర్పించారా అంటూ సెటైర్లు పేల్చారు. గతంలో వైఎస్‌ సీఎంగా ఓ జీవోను తెచ్చారని. విూడియా నిరసన తెలిపిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడు అసెంబ్లీలో కూడా తాము ప్రశ్నించామని, తర్వాత జీవోను అమలు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని.. పులివెందుల పంచాయితీలు ఇక్కడ కుదరవు అన్నారు. పత్రికాస్వేచ్ఛను కాపాడటానికి అప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవోను రద్దు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదన్నారు. విూడియాకు కంట్రోల్‌ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. తెల్ల పేపర్లు పట్టుకుని సభలోకి వస్తుంటే తనను అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్లకార్డులు వద్దంటే సరే అన్నామని, కానీ నల్ల రిబ్బన్‌ లు కూడా పెట్టుకోకూడాదా అని ప్రశ్నించారు. కొత్త మార్షల్‌ అనుకుంటా..తన చేయి పట్టుకుని తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్షల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. చంద్రబాబు విూడియా స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కీలకమైన బిల్లులపై చర్చించాలని.. సభను అడ్డుకునే ప్రయత్నం చేయం సరికాదన్నారు. అసెంబ్లీ మార్షల్స్‌తో టీడీపీ ఎమ్మెల్యేల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. టీడీపీ సభ్యులే మార్షల్స్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్ష నేత ఉన్మాది అనడం సరికాదన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. అంతకు ముందు 
ఏపీ అసెంబ్లీ వద్ద గురువారం ఉదయం ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జీవో నెం. 2430ని తేవడాన్ని వ్యతిరేకిస్తూ, మూడు ఛానల్స్‌పై అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ ఆవరణం ఎదుట నిరసన తెలిపారు. దీంతో అసెంబ్లీ వద్దకు ప్లకార్డులతో రావద్దని మార్షల్‌ టీడీపీ సభ్యులకు సూచించారు. ప్లకార్డులు పట్టుకుంటే ఇక్కడ నుండి పంపించివేయాల్సి వస్తుందని సూచించారు. దీంతో టీడీపీ సభ్యులు మర్షల్స్‌ తీరుపై నిరసన తెలిపారు. దీంతో మార్షల్స్‌ అక్కడి నుండి వారిని పక్కకు తప్పించే ప్రయత్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మార్షల్స్‌ తీరును నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అనంతరం అసెంబ్లీలోనూ ఈ విషయంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.