ఎస్సీ, ఎస్టీలపై వివక్షచూపొద్దు


- వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
- ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంగా కమిషన్‌ పనిచేస్తుంది 
- ప్రభుత్వ పథకాలు వారికందేలా అధికారులు కృషిచేయాలి
- గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
వరంగల్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపొద్దని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని, వారికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా అధికారులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని ఎస్సి, ఎస్టీ కేసుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష ఉండకూడదని, ఉంటే వారికి శిక్ష ఉంటుందని ఈ కమిషన్‌ హావిూ ఇస్తోందన్నారు. కమిషన్‌ ఆదేశాలపై తక్షణమే పోలీసులు, అధికారులు స్పందించాలని, కేసులో ఉన్న నిజానిజాలను చూసి దళితులు, గిరిజనులకు న్యాయం జరిగేలా కమిషన్‌ పని చేస్తుందన్నారు. సత్వర న్యాయం చేయడంలో ఇంకా ఏమైనా లోపాలుంటే సవరించుకొని ముందుకు వెళ్లే ఉద్దేశ్యంతో సవిూక్ష చేసుకుంటున్నామని అన్నారు. ఈ సవిూక్షలో పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కరం కోసం, ఈ వర్గాలకు ఒక రక్షణ కవచం వలే కమిషన్‌ పని చేస్తుందని భరోసా ఇస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ... 2018 జనవరి 2వ తేదీన కమిషన్‌ ఏర్పాటు అయిందని, గతంలో కమిషన్‌ ఆంధ్రాకి పరిమితంగా ఉండేదని, సమైక్య రాష్ట్రంలో ముఖ్యమైన పదవులు ఆంధ్రావారికి ఇచ్చేవారని, కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 10800 కేసులు పెండింగ్‌ ఉంటే 
6000 కేసుల్లో దాదాపు 40 కోట్ల రూపాయలు నష్ట పరిహారం ఇప్పించామన్నారు. ఈ కమిషన్‌ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తుంది. మేము జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, నాయకులు అధికారుల లేకుండా సవిూక్ష చేయడం లేదని, ఈ విధంగా అందరిని భాగస్వామ్యం చేయడం వల్ల కొత్త ఒరవడి ప్రారంభించామన్నారు. దీనివల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని, బాధితుల సమస్యలు సత్వర పరిష్కారానికి ఉపయోగపడుతుందన్నారు. ఇతర ఏ రాష్ట్రంలో ఈ విధానం లేదని, అందుకే మన రాష్ట్ర కమిషన్‌ ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉంటోందని అన్నారు. ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్న మహబూబాబాద్‌ జిల్లాలో ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను, పథకాలను వారికి పూర్తి స్థాయిలో అందేలా పని చేయాలన్నారని తెలిపారు.  ఈకార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు విద్యాసాగర్‌, రామ్‌ బాల్‌ నాయక్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ కుమారి అంగోతు బిందు, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, ఎస్పీ కోటిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ డేవిడ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.