కాంగ్రెస్‌ను అవమానించిన సిపి అంజన్‌కుమార్‌

ఆవిర్భావం రోజు కార్యకర్తల అరెస్టు


గవర్నర్‌ తమిళ సైకి కాంగ్రెస్‌ బృందం ఫిర్యాదు


హైదరాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి) : హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిస్తాయిలో అదుపులో ఉన్నా, కాంగ్రెస్‌ అవిర్భావం రోజు తమ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి అవమానపరిచారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన శాంతి యాత్రకు అనుమతించకపోవడంపై కాంగ్రెస్‌ బృందం గవర్నర్‌ తమిళ సై దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా గాంధీభవన్‌లో 135వ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలను గాంధీభవన్‌కు రాకుండా అడ్డుకోవడం, అరెస్టులు చేయడం వంటి అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసారు. ఆ సమయంలో హైదరాబాద్‌ సిపి అంజనీ కుమార్‌ తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫోన్‌ చేస్తే సరిగా స్పందిచకపోగా అనుచితంగా ప్రవర్తించడంపై గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం శాంతి భద్రతల అంశంలో గవర్నర్‌కు ఉన్న అధికారాలను వినియోగించాలని తమిళిసైను కాంగ్రెస్‌ నాయకులు కోరారు. ఉత్తమ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌పై పోలీసులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, ఎంఐఎం సభలకు అనుమతి ఇచ్చి.. కాంగ్రెస్‌ చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. సీపీ అంజనీకుమార్‌ ఫోన్‌లో తనతో దురుసుగా మాట్లాడారని గవర్నర్‌కు ఉత్తమ్‌ ఫిర్యాదు చేశారు. కాగా, కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టదలచిన ర్యాలీకి సీపీ అంజనీకుమార్‌ అనుమతివ్వలేదు. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన పోలీసులు.. తాము శాంతియుతంగా ర్యాలీ చేపడతామంటే అనుమతి ఎందుకివ్వలేదని పోలీసు ఉన్నతాధికారులను ఉత్తమ్‌ ప్రశ్నించారు. గవర్నర్‌ను కలసిన వారిలో శ్రీధర్‌ బాబు, రేవంత్‌ రెడ్డి, విహెచ్‌ తదితరులు ఉన్నారు.