పీఎస్‌ఎల్వీ సీ-48 ప్రయోగం చారిత్రాత్మకమైంది


- శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్‌ శివన్‌
చిత్తూరు, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : ఇస్రో చరిత్రలో పీఎస్‌ఎల్వీ సీ -48 ప్రయోగం చారిత్రాత్మకమైందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ అన్నారు. మంగళవారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనసమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్వీసీ-48 వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ.. బుధవారం పీఎస్‌ఎల్వీ సీ 48 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. ఆర్‌ఏశాట్‌2, బీఆర్‌ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నామని, ఇస్రోకు ఇదో చారిత్రక ప్రయోగం కాబోతోందని తెలిపారు. పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు ఇది 50వ ప్రయోగమని, శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగమని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కౌంట్‌డౌన్‌ ప్రారంభించి బుధవారం మధ్యాహ్నం 3.25కి ప్రయోగం చేపడతామని శివన్‌ అన్నారు.