పబ్‌జీ మాయలో ప్రాణాలు తీసుకున్న యువకుడు


గేమ్‌ ఆడుతూ నీటికి బదులు యాసిడ్‌ తాగడంతో ఘటన


భోపాల్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): పబ్‌జీలో ఆటలో పడి ఓ యువకుడు నీళ్లకు బదలుగా యాసిడ్‌ తాగి చనిపోయిన సంఘటన స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లో సౌరభ్‌ యాదవ్‌(20), సంతోష్‌ శర్మ (25) అనే ఇద్దరు యువకుడు గ్వాలియర్‌ నుంచి అగ్రా వెళ్తున్నారు. సౌరభ్‌ యాదవ్‌ ఫోన్‌లో పాటలు వినుకుంటూ పబ్‌జీ గేమ్‌ ఆడుతున్నాడు. గేమ్‌లో మునిగిపోయిన యాదవ్‌ వాటర్‌ కోసం బ్యాగ్‌ను తెరిచి యాసిడ్‌ బాటిల్‌ తీసి తాగాడు. రైలు ధోలాపూర్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు నిలిపివేయాలని ఎంత బతిమాలిన ఎవరు పట్టించుకోలేదని సంతోష్‌ శర్మ వాపోయాడు. రైలు అగ్రా చేరుకునేసరికి సౌరభ్‌ యాదవ్‌ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారు అభరణాలు శుభ్రం చేయడానికి తన బ్యాగ్‌లో యాసిడ్‌ బాటిల్‌ పెట్టుకున్నానని, అది నీళ్ల బాటిల్‌ అనుకొని తన స్నేహితుడు యాసిడ్‌ తాగాడని శర్మ పోలీసులకు తెలిపాడు. ఉద్దేశపూర్వకంగానే యాసిడ్‌ బాటిల్‌ తన కుమారుడికి శర్మ ఇచ్చాడని యాదవ్‌ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.