ఈశాన్యంలో హింసను ప్రేరేపిస్తున్న కాంగ్రెస్‌

మండిపడ్డ కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి


న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఈశాన్య రాష్టాల్ల్రో మింసను ప్రేరేపిస్తోందని లోక్‌సభలో


కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆరోపించారు. సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ (కాబ్‌) ఆమోదం పొందిన అనంతరం ఈశాన్య రాష్టాల్ల్రో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కేంద్రం సైన్యాన్ని మోహరించింది. అయితే ఇదంతా కాంగ్రెస్‌ వల్లనే అని ప్రహ్లాద్‌ అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు 2019కి నిరసనగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం రాత్రి ఆందోళనకారులు డులియాజన్‌లోని కేంద్రమంత్రి రామేశ్వర్‌ తేలి నివాసంపై దాడి చేశారు. నిరసనకారుల దాడి కారణంగా మంత్రి నివాసంలోని పలు ఆస్తులు ధ్వంసమైనట్టు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న రామేశ్వర్‌ తేలి... ప్రస్తుతం దిబ్రుగఢ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా అంతకుముందు నిరసన కారులు దిబ్రుగఢ్‌లోని సీఎం శర్వానంద సోనోవాల్‌ నివాసంపై రాళ్లు రువ్వారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్‌, ఆ పార్టీ నేత సుభాష్‌ దత్తా నివాసాలపైనా నిరసనకారులు దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న గువాహటి, టిన్సుకియా, దిబ్రగడ్‌, జోహ్రాత్‌ జిల్లాల్లో సైనిక బలగాలను మోహరించారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాలకు చెందిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ప్రసాదించే ఈ బిల్లు నిన్న రాజ్యసభలో ఆమోదం పొందింది. సోమవారం ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.