భర్తతో గొడవులు..ఉరేసుకున్న కానిస్టేబుల్‌

ప్రాణాపాయ స్థతిలో ఆస్పత్రికి తరలింపు


తిరుపతి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): కుటుంబ కలహాల కారణంగా మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గుడిపల్లి పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ ఉష కుప్పం హెచ్‌పి రోడ్డులోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కుప్పం మండలం జరుగు గ్రామానికి చెందిన చిన్నసిద్ధప్ప కుమార్తె ఉష ప్రస్తుతం గుడిపల్లి పోలీస్‌ స్టేషన్లో కానిస్టేబుల్‌ గా పనిచేస్తుంది. కార్వేటినగరం మండలం డీఎం పల్లి గ్రామానికి చెందిన మురళీ కృష్ణ, కుప్పం మండలంలోని చందం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం ఇద్దరూ కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరు కుప్పం - గుడిపల్లి మార్గంలోని పై బాటలో నివాసముంటున్నారు. సోమవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చిన భార్యాభర్తలు ఇంట్లో గొడవపడినట్టు సమాచారం. దీంతో నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో అమ్మతో నాన్నతో మాట్లాడాలంటూ... ఉష తన తమ్ముడికి ఫోన్‌ చేసింది. అయితే అతను బయట ఉండటంతో కాసేపు తరువాత ఇంటికెళ్లి ఫోన్‌ చేస్తానని చెప్పి పెట్టేశాడు. కాసేపటి తర్వాత ఉషా భర్త మురళీ కృష్ణ, ఉష తమ్ముడికి ఫోన్‌ చేసి తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెప్పాడు. ఈ క్రమంలో ఉష తన బెడ్‌ రూంలోకి వెళ్లి తలుపేసుకుని తన యూనిఫామ్‌ చున్నీతో కిటికీకి ఉరి వేసుకుంది. భర్త మురళీ కృష్ణ గట్టిగా కేకలు వేయడంతో పక్కింటి వాళ్ళు


వచ్చి కిటికీ అద్దాలు పగలుకొట్టి చున్నీని కోసి, ఇంటి తలుపులు పగలగొట్టి అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఉష ను వెంటనే చికిత్స నిమిత్తం కుప్పం పిఎస్‌ ఆసుపత్రికి తరలించారు. ఉష పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.