ఏప్రిల్‌ నుంచి.. రాష్ట్రమంతా నాణ్యమైన బియ్యం


- తమ మేనిఫెస్టోలో ఎక్కడా సన్నబియ్యం అంశమే లేదు
- టీడీపీ సభ్యులు కళ్లద్దాలు సరిచేసుకొని తమ మేనిఫెస్టో చదవండి
- గతంకన్నా రూ.1400కోట్లను అధికంగా ఖర్చు చేయబోతున్నాం
- సాక్షిలో అర్థంచేసుకోకుండా తప్పుగా రాశారు
- అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి
అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : ఏప్రిల్‌ నుంచి రాష్ట్రమంతా నాణ్యమైన బియ్యం అందిస్తామని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో సన్న బియ్యంపై వాడీ-వేడి చర్చ జరిగింది. సన్న బియ్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పారని.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులతో సవిూక్ష చేశారని విూడియాలో వచ్చిన కథనాలను చూయించారు. సన్న బియ్యం హావిూ ఏమయ్యిందని ప్రశ్నించారు. దీంతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాని, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. అనంతరం సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టోలో ఎక్కడా సన్న బియ్యం అన్న అంశమే లేదని స్పష్టం చేశారు. బియ్యం విషయంలో చెప్పని అంశాన్ని కూడా మేం చేసిచూపిస్తున్నామన్నారు. టీడీపీ సభ్యులు కళ్లద్దాలు సరిచేసుకొని మేనిఫెస్టోను చదవాలని, వాళ్లకు మేనిఫెస్టో చదవడం రాదు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు ఎక్కడ కొడతారోనని టీడీపీ మేనిఫెస్టో వెబ్‌సైట్‌ నుంచి తీసేశారని, తాము మాత్రం ఈ మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగామని జగన్‌ అన్నారు.  ఫలానా తరహా బియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలేదని జగన్‌ అన్నారు. స్వర్ణ రకాన్నే సన్నబియ్యం అంటారని.. తాము ఇచ్చే బియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం తేడా తెలియకుండా సాక్షి పేపర్‌లో తప్పుగా రాశారని, గతంలో రేషన్‌ బియ్యం ఎవరూ తినలేని పరిస్థితి ఉండేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పైలట్‌ ప్రాజెక్ట్‌గా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పరిశీలించాలన్నారు. సన్నబియ్యం అన్న పేరే లేదని.. సన్న బియ్యం అంటే ఏంటో తెలుసుకుంటే నాలెడ్జ్‌ పెరుగుతుందని జగన్‌ అన్నారు. సన్న బియ్యం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని సీఎం అన్నారు. రేషన్‌ బియ్యంకోసం గతంకన్నా రూ.1400కోట్లను అధికంగా ఖర్చు చేయబోతున్నామని సీఎం తెలిపారు. మంచి బియ్యం కాబట్టే రాష్ట్రమంతా ఇవ్వాలని టీడీపీ సభ్యులు అడుగుతున్నారని.. స్వర్ణ రకమైన నాణ్యమైన బియ్యాన్నే అందించబోతున్నామని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి రాష్ట్రమంతా నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. టీడీపీ నేతలు పిచ్చాసుపత్రికి వెళితే కానీ నయం కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు జగన్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు.  అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం 2018-19లో రూ.3 వేల కోట్లు కేటాయించి కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజలు తినగలిగే విధంగా నాణ్యమైన బియ్యం సరఫరా కోసం రూ.4134 కోట్లు కేటాయించిందన్నారు. గత 5 ఏళ్లలో పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారన్నది చూస్తే.. ఇవాళ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు మొత్తం రూ.20 వేల కోట్ల 
అప్పులున్నాయి అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తరపున రూ.13,500 కోట్ల అప్పు చేసిందన్నారు మంత్రి. అప్పు తీసుకున్న నిధుల్ని వేరే అవసరాల కోసం ఉపయోగించారని.. అలాగే బియ్యం సరఫరా కోసం గత ఏడాది బ్జడెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. అసలు వారికి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, నాణ్యమైన బియ్యం గురించి మాట్లాడే హక్కు ఉందా అంటూ మండిపడ్డారు.