ప్రజలను రెచ్చగొడుతున్నారు


- రాజకీయపార్టీల నిరసనలపై మాట్లాడిన బిపిన్‌ రావత్‌
- ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వ్యాఖ్యలపై దుమారం
- ఖండించిన పలువురు నేతలు
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 26(జనంసాక్షి): పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ)లపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంపై భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వారిపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసకు పాల్పడేలా జనాలను రెచ్చగొట్టడం, ఆస్తుల దహనాలకు పాల్పడడం నాయకత్వం అనిపించుకోదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను సక్రమమైన మార్గంలో నడిపించలేని వారు నాయకులు కాదని అన్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రస్తుతం వారు ప్రజలను నడిపిస్తున్న తీరే దీనికి నిదర్శనమన్నారు. మన పట్టణాలు, నగరాల్లో హింసకు పాల్పడేలా, ఆస్తుల దహనాలకు పాల్పడేలా ప్రజలను వారు రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నాయకత్వ లక్షణం కానే కాదని ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్‌ ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొన్ని రోజుల్లో రిటైర్‌కానున్న బిపిన్‌ రావత్‌.. తొలిసారి సీఏఏ ఆందోళనలపై మాట్లాడారు.
ఆర్మీచీఫ్‌ వ్యాఖ్యలపై దుమారం
'నాయకత్వం'పై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ)లపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంపై ఆర్మీ చీఫ్‌ తీవ్ర స్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. ప్రజలను సరైన మార్గంలో నడిపించలేని వాళ్లు నాయకులు కాదంటూ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యానించారు. యన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందిస్తూ ఎవరి పరిమితులు ఎంత వరకో కూడా నాయకత్వానికి తెలుసు. పౌర అధికార భావనను అర్థం చేసుకోవడానికి, విూరు నడిపిస్తున్న సంస్థ సమగ్రతను కాపాడేందుకు ఇది చాలా అవసరం.. అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సైతం అంతే స్థాయిలో స్పందించారు. జనరల్‌ సాహెబ్‌తో నేను ఏకీభవిస్తున్నాను. అయితే మత కల్లోలాలు, మారణ¬మాలకు తమ అనుచరులను రెచ్చగొట్టే వాళ్లు కూడా నాయకులు కాదు. మరి విూరు కూడా నాతో ఏకీభవిస్తారా జనరల్‌ సాహెబ్‌? అని డిగ్గీ ప్రశ్నించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పందించారు. హింసాత్మక ఆందోళనలను ఆయన ఖండించారు. అటాంటి ఆందోళనలకు నాయకత్వం వహించే వాళ్లు అసలైన నాయకులు కాదని రావత్‌ విమర్శించారు. నాయకులంటే ముందు ఉండి నడిపించడమని, నాయకులు ముందుకు వెళ్తుంటే.. వారి వెనుక జనం ఉంటారని, సరైన మార్గంలో ప్రజలను తీసుకువెళ్లేవాళ్లే నేతలని, కానీ అసమగ్రమైన పద్ధతుల్లో ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లేవాళ్లు నాయకులు కారని రావత్‌ చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. వివిధ నగరాల్లో జరుగుతున్న హింసాత్మక ఆందోళనలకు కొందరు నాయకత్వం వహిస్తున్నారని, అలాంటి వారు సరైన నాయకులు కారన్నారు. మరికొన్ని రోజుల్లో రిటైర్‌కానున్న బిపిన్‌ రావత్‌.. తొలిసారి సీఏఏ ఆందోళనలపై మాట్లాడారు.