కోడి పందాలపై అయోమయం


సంక్రాంతి ఉత్సవాలపై ఉత్కంఠ
పాతపద్దతుల్లోనే సాగేలా పోలీసుల నిర్ణయం
అమరావతి,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): సంక్రాంతి సందర్బంగా కోడి పందేలను  నిషేధించే విషయంలో 
ఎలాంటి సమాచారం లేకపోవడంతో గతంలో ఉన్న ఆదేశాలకు అనగుణంగా పోలీస్‌ శాఖ కసరత్తు చేస్తోంది. కోడిపందాలపై నిషేధం లేదని,జూదానికి అవకాశంలేని విధంగా నిర్వహించుకోవాలని ఎంపి రఘురామకృష్ణం రాజు ఇటీవలే ప్రకటించారు. సంప్రదాయబద్దంగా నిర్వహించుకుంటే అభ్యంతరం లేదన్నారు.  ఈ మేరకు సిఎంతో డిజిపి సవిూక్షించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వివిధ జిల్లాల్లో కోడిపందాల నిర్వహణ జరక్కుండా ఇప్పటి నుంచే చర్యలకు దిగుతున్నారు. కోడిపందేలపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు  పోలీస్‌ అధికారుల ద్వారా స్పష్టం అవుతోంది.  పందెపు రాయుళ్లు కోడిపందేలు, పేకాట మానుకోకుంటే సంక్రాంతికి జైల్లోనే ఉండాల్సి ఉంటుందని హెచ్చరించారు.  సంక్రాంతి ముగిసే వరకు పుంజులను స్వాధీనం చేసుకుంటారు. కోడి పుంజులకు కత్తులు కట్టే వారిని, పందేల నిర్వాహకులను అదుపులోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నదీ, సముద్ర తీర ప్రాంతాలు, లంకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.  ఎక్కడెక్కడ పందేలకు కోళ్లుపెంచుతున్నారు, ఏయే ప్రాంతాల్లో పందేలు నిర్వహించే అవకాశం ఉందో సమాచారం తెప్పించుకుని చర్యలు తీసుకుంటారు. మరోవైపు గతంలో ఎవరెవరు కోడిపందేలలో పాల్గొన్నారో వారి వివరాలను సేకరిస్తున్నారు.  పండుగకు కుటుంబ సభ్యులు, బంధువులకు దూరం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కోడి పందేలకు కత్తులు తయారు చేసేవారు, కత్తులు కట్టే వారి వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వారందరిపై నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. తిరిగి పందేలకు సిద్ధమైతే చర్యలు తప్పవన్నారు. గతేడాది ఇటువంటి వారిపై మారణాయుధాల చట్టం ప్రకారం నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపించామని, పద్ధతి మార్చుకోకుంటే ఈ ఏడాది కూడా మారణాయుధాల చట్టం ప్రయోగించక తప్పదని హెచ్చరించారు. గతంలో ఏ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహించారు, అందులో ఎవరెవరు పాల్గొన్నారు అనే వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. పాత కేసుల్లో నిందితులకు కౌన్సిలింగ్‌ ఇస్తామంటున్నారు. పోలీసు హెచ్చరికలు భేఖాతరు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు.