ఎపి రాజధానిగా కర్నూలే బెటర్‌


విజయవాడకన్నా అన్నీ అనుకూలతలు ఉన్నాయి
శ్రీబాగ్‌ ఒప్పంద మేరకు సాగితే మంచిది
ప్రజల్లో మళ్లీ రాజధాని డిమాండ్‌పై చర్చ
కర్నూలు,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): రాయలసీమ ప్రజలు కేవలం హైకోర్టును మాత్రమే కోరుకోవడం లేదు. కర్నూలులోనే రాజధాని ఎందుకు ఉండకూడదన్న భావనలో ఉన్నారు. తొలి ఆంధ్రాకు కర్నూలు రాజధానిగా ఉన్నదందున ఇప్పుడు వివాదాల నేపథ్యంలో ఇక్కడే రాజధాని కావాలని భావిస్తున్నారు.  
మైసూరా రెడ్డి లాంటి వారు తాజాగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ప్రజల మనోగతం అర్థం చేసుకోవచ్చు. 
విశాలాంధ్ర రాష్ట్రంగా అరవైయ్యేళ్ళకు పైగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్‌ విభజనతో తెలుగునేల రెండుగా విడిపోయాక ఇప్పుడ కర్నూలు వాసుల్లో మళ్లీ పాత డిమాండ్‌ తెరపైకి వస్తోంది. కేవలం హైకోర్టు ఏర్పాటుతో తమను మరోమారు మభ్యపెట్టే ప్రయత్నాల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిన రోజుల్లో రాయలసీమ ప్రజలు తమ సొంత లాభాల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. తెలుగు ప్రజలంతా సమైక్యంగా ఉంటూ వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉద్యమించారు. సీమ ప్రయోజనాల కోసం గొంతెత్తి ఉంటే  సీమవాసులకు ఈ దుస్థితి ఉండేది కాదు. పోలవరం లాగా రాయలసీమ డిమాండ్లన్నీ విభజన బిల్లులోనే అధికారికంగా వచ్చి ఉండేవి. రాజధాని, సాగు జలాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, మౌలిక వసతులు తదితర అనేక అంశాలపై వారు ఇంతకాలం మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.  రాయలసీమలోనే రాజధాని అంటూ తొలిసారిగా గళం విప్పుతున్నారు.  నవ్యాంధప్రదేశ్‌ రాష్ట్రంలో రాజధాని విషయమై కేంద్ర ¬ంశాఖ 'శివరామకృష్ణన్‌ కమిటీ'ని నియమించింది. కొత్త రాజధాని ఏర్పాటుకు వివిధ ప్రత్యామ్నాయాలను- నీరు, భూమి, అటవీ ప్రాంత వినియోగం, సహజ వనరులు, రాబోయే రోజుల్లో పట్టణ అభివృద్ధికి గల అవకాశాలు, రవాణా సౌకర్యాలు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం తదితర అంశాల ప్రాతిపదికన పరిశీలించమని కేంద్ర ¬ం శాఖ నిర్దేశించింది. అదే విధంగా రాజధాని నిర్మించే ప్రాంతంలో మనుగడలో ఉండే వ్యవసాయ క్షేత్రాలకు నష్టం వాటిల్లకుండా, ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలకు గురికాకుండా, పర్యావరణానికి హానికరం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. భూ సేకరణ, ముడిసరుకు, లభ్యత, నిర్మాణవ్యయం, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ¬ం శాఖ తెలియజేసింది. కేంద్ర ¬ం శాఖ నిర్దేశిరచిన కేవలం భౌతిక, సాంకేతికమైన అంశాల ఆధారంగానేకాక, చారిత్రక, ప్రాంతీయ తదితర సామాజిక అంశాల ఆధారంగా కూడా రాజధాని ఎంపిక జరిగితే ఆ నివేదికకు మరింత సమగ్రత చేకూరుతుంది. రాజధాని ఎంపికలో కేంద్ర ¬ం శాఖ సూచించిన అర్హ తలు, అనుకూలతలు అన్నీ రాయలసీమ ప్రాంతానికున్నాయి. కర్నూలుకు అవకావం ఉందని భావించారు. తుంగభద్ర, కృష్ణా జలాల నుంచి రాయలసీమలోని ఏ ప్రాంతానికైనా, తాగు, సాగునీటిని ఎంతైనా సరఫరా చేయవచ్చు. సీమ భూభాగంలో పాతికవంతు ఉన్న అటవీప్రాంతాల్ని వినియోగించుకోవచ్చు. సాగులోని వ్యవసాయ భూములకు ఏ మాత్రం నష్టం వాటిల్ల కుండా ఎవరికీ ఇబ్బంది లేకుండానే ప్రైవేటు, ప్రభుత్వ భూములను వేల ఎకరాలు సేకరించవచ్చు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల మధ్యన మరో మహానగరంగా రాజధానిని విస్తరింపజేయవచ్చని భావించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర భూకంపాలు రావటానికి అవకాశాలు ఉన్నాయని భూగర్భ శాస్త్ర నివేదికలు చెబుతున్నాయి. అలాంటి చోట రాజధాని నిర్మించి బిక్కుబిక్కు మంటూ బతుకీడ్చటం కంటే కర్నూలు అందుకు తగిన నేల అని స్థానిక నేతలు వాదిస్తున్నారు. శ్రీ బాగ్‌ ఒడంబడిక మేరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాయలసీమలో రాజధాని కృష్ణ, తుంగభద్ర జలాల్లో ప్రధానవాటా, విశ్వవిద్యాలయాలు, శాసనసభలో సమప్రాధాన్యం తదితర అనేక అంశాలపై ఆంధ్ర రాయలసీమ పెద్ద మనుషుల మధ్య పరస్పర నమ్మకం, విశ్వాసం ఆధారంగా ఒప్పందం జరిగింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధాని అయింది. త్వరలోనే నిజాం రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలుస్తుందని భావించి కనీస భవనాలు కట్టకుండానే గుడారాలలో కర్నూలులో పాలన 
సాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పడడంతో హైదరాబాద్‌ రాజధాని నగరమైంది. అప్పుడెలాగూ సాధ్యం కాలేదు కనక ఇప్పుడయినా మళ్లీ కర్నూలుకు రాజధాని భాగ్యం కలిగించడం ద్వారా విశాల ప్రయోజనం చేకూర్చాలని కోరుతున్నారు.