నేడు గజ్వెల్‌లో సిఎం కెసిఆర్‌ పర్యటన


అత్యాధునిక హార్టి కల్చర్‌ యూనివర్సిటీకి ప్రారంభోత్సవం


మహతి ఆడిటోరియం, అధునాతన మార్కెట్‌కు శ్రీకారం


భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు


మంత్రి హరీష్‌ రావు పర్యవేక్షణలో పనులు


పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు


గజ్వెల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన సొంత నియోజవకర్గం గజ్వెల్‌లో బుధవారం పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అత్యాధునికమైన హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీలను సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు సిఎం రాకును దృష్టిలో పెట్టుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కెసిఆర్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ములుగులోని హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనుండడంతో ఇప్పటికే మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌, పీసీసీఎఫ్‌ అధికారి శోభ, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ తదితరులతో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గజ్వేల్‌ పట్టణంతో పాటు ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వద్ద పరిశుభ్రత, నీటి సదుపాయం, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పాసులు ఉన్నవారినే అధికారులు అనుమతించనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం విక్రయదారులకు ప్రత్యేక పాసులు ఇచ్చి వారికి కేటాయించిన కౌంటర్లలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. మహతి ఆడిటోరియంలో ప్రదర్శనలు చేసే కళాకారులకు ప్రత్యేక పాసులు జారీ చేయాలని సూచించారు. ముఖ్య మంత్రి కార్యక్రమం కవరేజీ చేసే జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారుల ను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా విద్యుత్తు శాఖ డీఈలు చూడాలన్నారు. భోజన కేంద్రాల వద్ద ఏర్పాట్లను కూడా పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌డేవిస్‌ తెలిపారు. పటిష్ఠమైన బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం పర్యటనలో ట్రాఫిక్‌కు, ప్రజలకు, వీవీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు బందోబస్తు అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి గజ్వేల్‌లో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గజ్వేల్‌ పట్టణంలో సీఎం ప్రారంభించనున్న సవిూకృత మార్కెట్‌, మహతీ ఆడిటోరియం, సవిూకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాలను మంగళవారం ఆయన కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్‌ డేవీస్‌, జేసీ పద్మాకర్‌, డీఆర్వో చంద్రశేఖర్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాపరెడ్డి, పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, సీనియర్‌ నాయకులు ఎలక్షన్‌రెడ్డి, యాదవరెడ్డితో కలసి పరిశీలించారు. ఏర్పాట్లు, బందోబస్తు పై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదట ములుగులో ఫారెస్ట్‌ కళాశాల, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభిస్తా రన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పట్టణంలో సకల సదుపాయాలతో నిర్మించిన సవిూకృత మార్కెట్‌, సవిూకృత కార్యాలయ భవన సముదాయం, మహాతీ ఆడిటోరియంలను ప్రారంభిస్తారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రారంభమవు తాయన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం అధికారులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలన్నారు. సీఏం కేసీఆర్‌ ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటారని, ప్రతి కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షించాలన్నారు. పర్యటన ముగిసే వరకు కార్యక్రమం సాఫీగా జరిగేలా చూడాలన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సవిూకృత మార్కెట్‌ వద్ద స్టాళ్ల కేటాయింపును అధికారులు ముమ్మరం చేశారు. ఆడిటోరియం వద్ద ఏర్పాట్లను వేగవంతం చేశారు. సవిూకృత భవన సముదాయంలోకి గజ్వేల్‌ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను తరళిస్తున్నారు. ఎక్కడికక్కడ శిలఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు. మహాతీ ఆడిటోరియం వద్ద ప్రముఖంగా ఏర్పాట్లుచేయాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీచేశారు. పట్టణమంతా స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. మార్కెట్‌, ఐవోసీ, ఆడిటోరియంను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.