పార్టీ నిర్ణయం మేరకు..  అభ్యర్థులను నిర్ణయిస్తాం


- బీజేపీ గెలిస్తే అభివృద్ధికి ఆటంకమే
- తెరాస గెలుపుతోనే కరీంనగర్‌లో అభివృద్ధి సాధ్యం
- ప్రతీ కార్యకర్త పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
- మంత్రి గంగుల కమలాకర్‌ 
కరీంనగర్‌, డిసెంబర్‌27(జ‌నంసాక్షి) : వచ్చే నెలలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకే అభ్యర్థులను నిర్ణయిస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి గంగుల పాల్గొని ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే కరీంనగర్‌ జిల్లాలోని కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో సీనియార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తలకు స్థానం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీ జాబితాలో చేర్చడానికి అప్పటి ఎంపీ వినోద్‌ కుమార్‌ ఎంతో కృషి చేశారని అన్నారు. ఇప్పుడున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మాత్రం కరీంనగర్‌ అభివృద్ధి అడ్డు తగులుతూ.. నిధులు తేలేకపోతున్నాడని మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీ అభ్యర్థులు గెలిపిస్తే కరీనగర్‌లో అభివృద్ధి కుంటుపడిపోతుందని, కరీంనగర్‌ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. రిజర్వేషన్‌లు ప్రకటించగానే.. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నిర్ణయం మేరకు మున్సిపల్‌ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం 
గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని, ఆమేరకు అన్ని విధాల కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అలా అని పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు.