చురుకుగా కాళోజీ వర్సీటీ నిర్మాణ పనులు

త్వరగా పూర్తయ్యేలా చర్యలు


వరంగల్‌,డిసెంబర్‌31(జనం సాక్షి) :స్వరాష్ట్రంలో వరంగల్‌కు నూతనంగా మంజూరైన కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీకి సొంత భవనం లేకపోవడంతో కేఎంసీ ఆవరణలో తాత్కాలికంగా భవనం ఏర్పాటు చేశారు. 2016 జూన్‌ నుంచి ఈ భవనంలోనే యూనివర్సిటీ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాళోజీ యూనివర్సిటీకి సొంత భవనం కోసం 2017 ఆగస్టులో గజ్వేల్‌లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అక్కడే శంకుస్థాపన చేశారు. దీంతో కాళోజీ యూనివర్సిటీ అడ్మినిస్టేష్రన్‌ భవనం కోసం రూ.24 కోట్ల వరకు యూనివర్సిటీ నిధులను కేటాయించారు. వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ పరిపాలన భవనం పనులు చురుకుగా సాగుతున్నాయి. త్వరగా పనులు పూర్తి చేయించేలా చూస్తున్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు చకచకా పనులు సాగిస్తున్నారు. సెంట్రల్‌ జైలు ఆవరణలో ఐదెకరాల స్థలం కేటాయించగా గతేడాది విజయదశమి రోజు భూమిపూజతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఇందులో వైస్‌ చాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌ రెక్టార్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, ఇతర విభాగాల కోసం వేర్వేరుగా బ్లాకులను ఏర్పాటు చేశారు. రానున్న మూడు నెలల కాలంలో నూతన భవనం ప్రారంభోత్సవం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ బీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రానున్న మూడు నెలల కాలంలో కాళోజీ అడ్మినిస్టేట్రివ్‌ భవనం అధికారులు, ఉద్యోగులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కాళోజీ యూనివర్సిటీ పనులు కాకతీయ మెడికల్‌ కళాశాల ఆవరణలోని తాత్కాలిక భవనంలో నిర్వహిస్తున్నారు.