గీత దాటిన చైనా

- లద్దాఖ్‌లో భూగర్భ నిర్మాణాలు
- ఆందోళన వ్యక్తంచేసిన భారత భద్రతా దళాలు
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 26(జనంసాక్షి): భారత సరిహద్దుల వద్ద చైనా సైనికుల కదలికలు ఆందోళనకర స్థాయికి చేరాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) లద్దాఖ్‌ ప్రాంతంలోని పాన్‌గాంగ్‌ సరస్సు వద్ద సైనిక అవసరాలకు తగిన మౌలిక వసతుల నిర్మాణాలను చేపడుతోందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక్కడ పీఎల్‌ఏ దళాలు గుడారాలను ఏర్పాటు చేసుకుని మరీ భూగర్భ సొరంగాలను నిర్మించింది. అక్కడితో ఆపకుండా వివాదాస్పద ఫింగర్‌ 8 శిఖరం సవిూపంలోని పాన్‌గోంగ్‌ సో ప్రాంతంలో మరిన్ని సొరంగాలను నిర్మించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు మిలిటరీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో పీఎల్‌ఏ దళాలు గస్తీ కార్యకలాపాలను పెంచడంతోపాటు సిబ్బంది సంఖ్యను కూడా పెంచాయి. మరోపక్క భారత దళాలను ఇక్కడకు రానివ్వడంలేదు. దాదాపు 134 కిలోవిూటర్ల మేరకు విస్తరించిన ఈ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారత్‌-చైనా దళాల మధ్య చిన్నచిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకొంటున్నాయి. కొన్ని నెలల క్రితం కూడా ఇరుదేశాల దళాలు పరస్పరం స్వల్పంగా ఘర్షణ పడ్డారు. ముఖ్యంగా ఫింగర్‌-5, ఫింగర్‌-8 శిఖరాల వద్ద ఇవి చోటు చేసుకొంటున్నాయి. 2017లో కూడా ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డాయి.