రాజధాని రైతులకు అండగా బిజెపి


పరిపాలనా వికేంద్రీకరణ సరికాదు


జగన్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: కన్నా


అమరావతి,డిసెంబర్‌19 (జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రకటన ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనం అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన సూతప్రాయమైన ప్రకటనపై స్పందించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలే తప్ప పరిపాలన వికేంద్రీకరణ సరికాదు అని కన్నా అభిప్రాయపడ్డారు. ఇపుడిప్పుడే అమరావతిలో సర్దుకుంటున్న ఉద్యోగులు మళ్లీ విశాఖపట్నానికి వెళ్లడం సాధ్యం కాదు అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే తన ప్రకటన వెనక్కి తీసుకోవాలని కన్నా డిమాండ్‌ చేశారు. రాజధాని ప్రాంత రైతులకు భాజపా అండగా ఉంటుందని ఆయన చెప్పారు. భాజపా ప్రతినిధి బృందాన్ని రాజధాని ప్రాంతానికి పంపిస్తున్నామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మోడీ, అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ నేత రావెల కిషోర్‌బాబు హావిూ ఇచ్చారు. వెలగపూడిలో రాజధాని రైతులు చేస్తున్న రిలే దీక్షలకు రావెల సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్‌ మొండి మనిషే కానీ.. అమిత్‌ షా పేరు చెబితే జగన్‌కు గుండెల్లో గుబులు పట్టుకుంటుందన్నారు. రాజధాని రైతులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ఏపీ రాజధాని పేరేంటో చెప్పలేని స్థితికి వచ్చామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నారన్నారు. పార్టీలపై కక్ష ఉంటే రాజకీయ పోరాటం చేయాలే కానీ ప్రజలపై కక్ష సాధించడం కరెక్ట్‌ కాదని పేర్కొన్నారు. రాజధానిని తరలించేందుకు అక్రమాలు జరిగాయని బూచిగా చూపుతున్నారని ఆరోపించారు. మైత్రి సంస్థ పేరుతో తాను భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. 'మైత్రి సంస్థ పేరుతో నేను భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారు. మైత్రి సంస్థకు నాకూ సంబంధం లేదు. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయగలరా..? అని రావెల ప్రశ్నించారు.