తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చారు


- ఆరేళ్లలో కేసీఆర్‌, ఆయన కుటుంబ ఆస్తులు పెరిగాయి
- ప్రతీ ఇంటికి తాగునీరు పేరుతో దోపిడీకి పాల్పడ్డారు
- అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
- ఇచ్చిన హావిూలు ఒక్కటి నెరవేర్చలేదు 
- కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : బంగారు తెలంగాణగా మారుస్తామంటూ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం.. అప్పుల తెలంగాణగా మార్చారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రెండోసారి కేసీఆర్‌ సీఎం అయ్యి ఏడాది పూర్తయిందని.. ముఖ్యమంత్రిగా ఆయన విఫలం అయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో మిగులు బ్జడెట్‌తో ఉన్న తెలంగాణకు ఇప్పుడు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పారు. బంగారు తెలంగాణ కాదు.. బొందలగడ్డ తెలంగాణ, బాకీల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర విషాదంలో ఉన్నారని రేవంత్‌ తెలిపారు. డబుల్‌ బెడ్రూమ్‌, మూడెకరాల భూమి, రుణమాఫీ సహా అన్ని అంశాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్‌ ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరేళ్లలో కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత పెరిగాయో ప్రజలు చూడాలన్నారు. ప్రాజెక్టుల పేరుతో దండుకున్న డబ్బులు ఎవరి ఖాతాలో పడ్డాయో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ప్రతీ ఇంటికి తాగునీరు పేరుతో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఇంకా తాగునీరు అందని గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తిచేయలేదో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చిన్నచిన్న ప్రాజెక్టులను పక్కన పెట్టి పెద్ద ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు, ఇంటర్‌ విద్యార్థుల ఆత్యహత్యలు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు జరిగితే పట్టించుకోని పరిస్థితి నెలకొందన్నారు. మద్యపానం అమ్మకాల్లో మాత్రమే తెలంగాణ అత్యంత ప్రగతి సాధించిందని ఎద్దేవా చేశారు. మద్యం కంపెనీల కవిూషన్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైందన్నారు. మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తుందని చెప్పారు. గతంలో సాయపడ్డ అధికారి సోమేశ్‌ కుమార్‌కు కీలక శాఖలు ఇచ్చి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరేళ్ల పాలనలో కేసీఆర్‌ దోపియే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ప్రజలకు కేవలం అరకొర ఆశచూపి మిగిలిన సొమ్మును దోచుకుంటూ వారి కుటుంబ సభ్యుల జేబులు నింపుతున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 


Popular posts