అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌ యువతి మృతి

హైదరాబాద్‌: అమెరికాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ రేణుకానగర్‌కు చెందిన యువతి చరితారెడ్డి (25) మృతిచెందారు. అమెరికాలోని మిషిగన్‌లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. చరితారెడ్డి రెండేండ్ల క్రితమే తన అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆమె అవయవాలను దవాఖానకు ఇచ్చారు. ఈ ఘటనను కుటుంబసభ్యులు సోమవారం రాత్రి ధ్రువీకరించారు. విషయం తెలియడంతో మృతురాలి బాబాయ్‌ ప్రవీణ్‌రెడ్డి హుటాహుటిన అమెరికా వెళ్లారు.ప్రమాద ఘటనపై చరితారెడ్డి బాబాయ్‌ ప్రవీణ్‌ 'నమస్తే తెలంగాణ'కు ఇచ్చిన సమాచారం ప్రకారం.. చరితారెడ్డి నాలుగేండ్ల క్రితమే అమెరికాలోని మిషిగన్‌కు వెళ్లారు. అక్కడే ఎంఎస్‌ పూర్తిచేశారు. ఎంఎస్‌ తర్వాత డెలాయిట్‌లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడ్డారు. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వారాంతం వెకేషన్‌ కోసం చరితారెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో మిచిగాన్‌ నుంచి సిటీ బయటి ప్రాంతానికి వెళ్తున్నారు. మిషిగాన్‌లోని క్రాకెర్రి టౌన్‌షిప్‌ వద్ద డ్రైవర్‌ మారేందుకు కారు ఆపారు. పార్కింగ్‌ లైట్లు కూడా వేశారు. కారు వెనుక సీటులో చరితారెడ్డితోపాటు మరో స్నేహితురాలు, ముందు సీటులో ఇద్దరు కూర్చున్నారు.అదే సమయంలో వెనుక నుంచి కారులో మద్యం మత్తులో 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి వీరి కారును ఢీకొట్టాడు. కారు వెనుక సీటులో కూర్చున్న చరితారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమె స్నేహితులు దవాఖానకు తీసుకెళ్లారు. బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు వైద్యులు చెప్పారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసేందుకు మరో రెండురోజుల సమయం పడుతుందని, మరో నాలుగురోజుల్లో మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. చరితారెడ్డి మృతితో తండ్రి ఇంద్రారెడ్డి, తల్లి శోభ, సోదరుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.