మూడు రాజధానుల అనే అంశమే హాస్యాస్పదం


- హైకోర్టును మార్చడం అంత ఈజీకాదు
- ఇప్పటికీ పరిపాలనపై వైసీపీ శ్రద్దచూపటంలేదు
- బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 
- రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన సుజనాచౌదరి
హైదరాబాద్‌, డిసెంబర్‌27(జ‌నంసాక్షి) : రాష్టాన్రికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనేదే బీజేపీ ఆకాంక్ష అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం హైదరాబాదులో రాష్ట్రపతి కోవింద్‌ ను కలిసిన అనంతరం విూడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అనే అంశమే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దీనికి నిరసనగానే బీజేపీ తరపున తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష కూడా చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. వారికి కావాలనుకుంటే జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌ ను వారి ఇష్టానుసారం మార్చుకోవచ్చని, కార్పొరేట్‌ ఆఫీసును రాష్ట్రంలో ఎక్కడికైనా మార్చుకోవచ్చని, కానీ రాజధానిని కూడా వారు కార్పొరేట్‌ సంస్థగా భావిస్తున్నట్టున్నారని దుయ్యబట్టారు. మూడు రాజధానులు అనే అంశమే హాస్యాస్పదమని సుజనా చౌదరి ఎద్దేవా చేశారు. హైకోర్టు వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఎవరూ రాజధాని అనరని, 30రోజులు మాత్రమే అసెంబ్లీ జరిగే ప్రాంతాన్ని కూడా రాజధాని అనరని చెప్పారు. ఆ గొప్ప జీఎన్‌ రావు ఒక సెషన్‌ (బ్జడెట్‌ సెషన్‌) వైజాగులో అంటూ నివేదికలో చెప్పారని విమర్శించారు. రెండేళ్ల వయసున్న పిల్లవాడు కూడా ఇది వింటే నవ్వుతాడని అన్నారు. వైసీపీ వాళ్లు ఆరోపించే విధంగా తాను ఆరోపణలు చేయలేనని, వైజాగ్‌ లో వాళ్లు భూములు కొనుక్కుంటే కొనుక్కుని ఉండవచ్చని సుజనా చౌదరి అన్నారు. రాజధానిపై వారి నిర్ణయాన్ని మాత్రం తప్పుబడుతున్నానని, ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. హైకోర్టును మార్చడం కూడా అనుకున్నంత సులువు కాదని, దీనికి కొలీజియం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఆమోదం కావాలని అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని చెప్పారు. ఈ ఏడు నెలల్లో పరిపాలనపై వైసీపీ శ్రద్ధ చూపించిన పాపాన పోలేదని 
సుజనాచౌదరి విమర్శించారు. రాజకీయ దుర్భాషలకే ప్రాధాన్యతనిచ్చారని మండిపడ్డారు.