అక్రమార్కుల జేబులు నింపుతున్న ఇసుక

ఏలూరు,డిసెంబర్‌14(జనం సాక్షి ): ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించినా దీనికి పూర్తిస్థాయిలో విధివిధానాలు ప్రకటించకపోవడం వల్ల ర్యాంపులోకి వెళ్లి ఇసుక తెచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో ర్యాంపుల నిర్వహణ అక్రమార్కుల చేతుల్లోనే ఉండిపోయాయి. అందుకే అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇసుక విధానాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణ పథకాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇసుక అవసరాలను ఆసరాగా చేసుకుని లారీల్లోనూ, ట్రాక్టర్లలోనూ, రోడ్లు, పోరంబోకు, పంట కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో వేసిన ఇసుకను అక్రమంగా అధిక ధరలకు అమ్ముకుని తమ జేబులు నింపుకుంటున్నారు. దీంతో లబ్దిదారులకు ఇసుక అందక లబోదిబోమంటూ తమ జేబులను గుల్ల చేసుకుని అప్పులపాలౌతున్నారు. ఈ విధానం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. అక్రమంగా తరలించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి ప్రస్తుతం అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు చొరవ చూపి లబ్ధిదారులకు ఇసుక అందే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.