ఉద్యోగాలపేరుతో హైటెక్‌ మోసం

పోలీసుల అదుపులో అనుమానిత వ్యక్తులు


వరంగల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ అనేక దందాలకు పాల్పడుతున్నాడు. ముఠాను ఏర్పాటు చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం సుబేదారిలోని తన ఇంటికి వచ్చాడు. వెంట ముఠా సభ్యులను తీసుకొచ్చాడు. రాత్రి సమయంలో రోడ్డుపై కారు పార్కింగ్‌ చేసి ఉండి.. అందులో తుపాకులు ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి వచ్చారు. పోలీసులను చూసిన ముఠా సభ్యులు పారిపోగా వారిని కొద్ది దూరం వెంబడించారు. ముఠా నాయకుడు అత్యంత ఖరీదైన కారులో వచ్చి వెళ్లిపోయాడు. పోలీసులు ముఠాలో ఉన్న సభ్యుల వివరాలను సేకరించారు. అందులో ఒకరి వద్ద హైదరాబాద్‌లో లైసెన్స్‌ తీసుకున్న ఆయుధం ఉంది. మరొకరిపై రాష్ట్ర వ్యాప్తంగా 11 కేసులు నమోదయ్యాయి. ఇందులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు ఉన్నాయి. ఈ పరిణామాలతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇది.. నగరంలో ముఠా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఎక్కడెక్కడ తిరిగింది..? ఎవరిని కలిసింది..? ఇక్కడ ఏం చేసేందుకు వచ్చింది..? అనే కోణంలో విచారణ చేస్తోంది. స్వయంగా ఏసీపీ క్షేత్రస్థాయిలో పలువురు సాక్షులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు ముఠాకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించినట్లు తెలిసింది. దీని ఆధారంగా పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఠాకు నెట్‌వర్క్‌ ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ముఠా సభ్యులు ఏమైనా ఘటనలకు పాల్పడ్డారా..? బాధితులు ఏవరైనా ఉన్నారా..? భయంతో చెప్పలేకపోతున్నారా...? ఇలా పలు కోణాల్లో విచారిస్తున్నారు.ముఠా సభ్యుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. బ్యాంక్‌ లావాదేవీలు, ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. ఒకరి ఖాతాలో రూ. లక్షల్లో డబ్బులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంత పెద్ద మొత్తంలో ఉన్నాయంటే మరేదైనా.. కారణం ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ముఠాలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉండంతో అక్కడి పోలీసులతోనూ మాట్లాడుతున్నారు. రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు అంటున్నారు.