ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల,డిసెంబర్‌31 (జనంసాక్షి) :  శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.  6వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆలయ శుద్ది కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్ర¬్మత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేకువ జామున సుప్రభాత సేవ అనంతరం మూలవిరాట్టును పట్టు పరదలతో పూర్తిగా కప్పేసి..ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజ పాత్రలను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రపరిచారు. శుద్ధి తర్వాత నమపు కొమ్ము, శ్రీ చూర్ణం, పచ్చ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డలతో శాస్తోక్తంగా తయారు చేసిన సుగంథం వెధచల్లే పరిమళం అనే ద్రవ్యాన్ని గోడలకు పై పుతగా పూసి అనంతరం శ్రీవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. టీటీడీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా అష్టదల పాదపద్మారాధన సేవ రద్దు చేసింది. ఆలయ అర్చకులు సుప్రభాతం, తోమాల,అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను స్వామి వారి సర్వదర్శనానికి అనుమతించారు. ఇవో అశోక్‌ సింఘాల్‌,ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.