నగరీకరణతో పర్యావరణ విధ్వంసం

శివారు ప్రాంతాల విస్తరణతో నాశనమవుతున్న వాతావరణం


కాలుష్యాన్ని పట్టించుకోని పాలకులు


న్యూఢిల్లీ,డిసెంబర్‌19 (జ‌నంసాక్షి):  పర్యావరణ విధ్వంసం నిత్యకృత్యంగా మారిందనడానికి ప్రస్తు విపత్కర వాతావరణ పరిస్థితులే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్లాస్టిక్‌ నిషేదంపై సీరియస్‌గా నిర్ణయాలు తీసుకోవడం లేదు. కేవలం ప్లాస్టిక్‌ వాడాకాన్ని నిషేధిస్తున్నారే పత్ప ఉత్పత్తులపై మాత్రం ఆంక్షలు విధించడం లేదు. ఇది జరగనంత వరకు ప్లాస్టిక్‌ నిషేధం అడుగు కూడా ముందుకు పడదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరినో అడగాల్సిన పనిలేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల గురించి బడి చదువుల దగ్గరనుంచి గురువులు నూరిపోయడమే ఇందుకు కారణం. దురదృష్టమేమంటే దేశంలో అభివృద్ధి పేరు చెప్పి వృక్ష సంహారం జరగని రోజంటూ దేశంలో ఉండటం లేదు. నగర పరిసరాల్లోని ప్రధాన ప్రాంతాలకూ కూడా రవాణా సౌకర్యం విస్తరిస్తున్నది. ఈక్రమంలో నగరాలపై జనాభా భారంగా మారింది. దీంతో పచ్చగా ఉన్న శివారు ప్రాంతాలు ఇప్పుడు పట్టణాలుగా మారుతున్నాయి. పొలాలు మాయమవు తున్నాయి. విస్తరణ పేరుతో నగరానికి ప్రాణవాయువును అందిస్తున్న వృక్షజాలాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఉరుకుల, పరుగుల జీవితాలకు కాస్తంత విరామం ఇచ్చి, ప్రశాంతంగా స్వచ్ఛమైన వాయువు పీల్చి పునీతులు కావడానికి నగర వాసుల్లో అత్యధికులు ఎన్నుకునే పచ్చని ప్రాంతాలు నగరీకరణ కారణంగా మాయమవుతున్నాయి. వీటికి తోడు చెరువులు అక్రమణలకు గురవుతున్నాయి. రాత్రికిరాత్రి వాటిని పూడ్చేసి బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నారు. మెట్రో రైలు అయినా, మరొకటైనా నగర ప్రజలకు ఉపయో గపడేదే కావొచ్చు. మహానగరాలు వేల కోట్లు ఆర్జించే పెట్టే బంగారు గనులే కావొచ్చు. అక్కడ అనేకులకు ఉపాధి దొరుకుతుండవచ్చు. అందులో అనేకం కాలుష్యకారకాలు. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలు 20 ఉంటే అందులో 15 మన నగరాలే ఉన్నాయంటే ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నగరాల వాతావరణంలో, ఇక్కడి తాగునీటిలో మృత్యువు దాగుందని నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. నగర పౌరుల ఊపిరితిత్తుల్లోకి కొంచెం కొంచెంగా చొరబడుతున్న కాలుష్యం


వారిని రోగగ్రస్తులుగా మారుస్తోంది. కేన్సర్‌, గుండె జబ్బులు వగైరాలకు కారణ మవుతోంది. అనేకుల్లో అకాల వృద్దాప్యాన్ని కలిగిస్తోంది. వారిని పనిపాటలకు దూరం చేస్తోంది. ఇదంతా మన పాలకులకు ఆందోళన కలిగించాలి. దీన్ని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి పురిగొల్పాలి. ప్రపంచ అధ్యయన సంస్థలు చెబుతున్న వాస్తవాలేవీ వారిలో కదలిక తీసుకురావడం లేదు. ఇల్లు కట్టుకుందామనో, ఉన్న ఇంటిని విస్తరించుకుందామనో ఎవరైనా తమ ఆవరణలో చెట్లు కొట్టాలంటే అందుకు అనుమతులు తీసుకోవడం అవసరం. కానీ తమకు అలాంటి నిబంధనలు వర్తించవన్నట్టు అధికార యంత్రాంగాలు ప్రవర్తిస్తున్నాయి. పాలకులే చట్టాల్ని ధిక్కరించే స్థితికి దిగజారడం, ప్రశ్నించినవారిని నిర్బంధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పర్యావరణ విఘాతం కలిగించే చర్యలను ప్రోత్సహించకుండా ఉన్నంత కాలం మనకు మరోదారిలేదు.