తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష


నిధుల విడుదలలో మొండిచేయి


ఎంపిలు ఆందోళన చేసినా గుర్తించరా?


కేంద్రం తీరుపై మండిపడ్డ ప్రత్యేక ప్రతినిధి చారి


న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై స్పష్టమైన హావిూని ఇవ్వడంలో విఫలమైన కేంద్రంపై తమపోరాటం కొనసాగుతుందని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలచారి అన్నారు. ఇంతకాలం తాము సంయమనంతో వ్యవహరించామని అన్నారు. తమ ఎంపిలు పార్లమెంటులో పోరాడినా లాభం లేకుండా పోయిందన్నారు. కేంద్రం నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసినప్పుడు చేసిన ప్రకటనలకు తాజాగా అనుసరిస్తున్న విధానాలకు పొంతన లేకుండా ఉందన్నారు. నిధుల విడుదలలో తెలుగు రాష్టాల్రకు అన్యాయం జరుగుతోందన్నారు. బిజెపి ఎంపిలు కూడా తప్పుదోవ పట్టించడం తగదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని వారు గుర్తించాలన్నారు. హస్తినలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరుబాట పట్టి విషయం తెలిపే వరకు ఇంతకాలం అంతా సవ్యంగా సాగుంతన్న భ్రమలో ఉన్నారని అన్నారు. జీఎస్టీ బకాయిలు 4,531 కోట్ల రూపాయలు సహా రాష్టాన్రికి రావాల్సిన 29వేల 891 కోట్ల రూపాయల నిధులు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్రం నాన్చుడు వైఖరిపై పార్లమెంటు లోపల, వెలుపల నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని చారి విమర్శించారు. పార్లమెంటు ఆవరణలోనూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రం తీరుపై ఆందోళనకు దిగిన ఎలాంటి హావిూ దక్కలేదన్నారు. ఈ సమస్య తెలంగాణకు సంబంధించిందే కాదని.. దాదాపు తొమ్మిది రాష్టాల్రకు సంబంధించిందన్నారు. కేంద్రం వెంటనే నిధులు విడుదల చేయాలని తెలిపారు. తమ ఎంపిలు పార్లమెంట్‌ వేదికగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఇదిలావుంటే తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. రాష్టాన్రికి రావాల్సిన నిధులను ఇప్పటైనా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నీతి ఆయోగ్‌ కింద మిషన్‌ భగీరథకు కేటాయించిన నిధుల విడుదలలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఆర్థిక సంఘం బకాయిలు, గ్రావిూణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని ఎంపీ నామా కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్టాల్రకు కేంద్రం సహకరిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని సూచించారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇతర నిధులన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.