పల్లెల్లో పారిశుద్యానికి పెద్దపీట


రెండోదశ ప్రణాళికకు రంగం సిద్దం


గ్రామాలను చుట్టి రానున్న అధికారులు


నిర్మల్‌,డిసెంబర్‌31(జనం సాక్షి)  : పల్లెలు ప్రగతి బాటలో పయనించేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తొలిదశ విజయవంతంకావడంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మరోమారు సిద్దం చేస్తున్నారు. మొదటిదశలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారు.  అన్ని గ్రామాల్లోప్రత్యేక ప్రణాళిక ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించి, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్నిచాటారు. దీంతో జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కలెక్టర్‌ ఎం.ప్రశాంతి రెండో దశకు ఇప్పుడు సిద్దం అయ్యారు. 2నుంచి జరుగనున్న ఈ కార్యక్రమం కోసం షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఈమేరకు  జిల్లాలోని వివిధ మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను సన్నద్దం చేయనున్నారు.  ఆయా గ్రామాల్లోని వీధుల్లో పర్యటించి.. సమస్యలు అడిగి తెలుసుకుంటారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతంగా పెంపొందించడం, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబు దారీతనం పెంచడం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయడం వంటి లక్ష్యాలతో చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 19మండలాలు ఉండగా.. ఇందులో 18గ్రావిూణ మండలాలున్నాయి. వీటి పరిధిలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. అన్ని గ్రామ పంచాయతీల్లో 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక విస్తృతంగా కొనసాగింది. ఈ కార్యక్రమం అమలు కోసం ఇప్పటికే గ్రామ పంచాయతీలకు మండల స్థాయి అధికారులను, మండలాలకు జిల్లా స్థాయి అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. వీరితో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలు ఆయా గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తారు. కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా.. లేదా.. అని పర్యవేక్షిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుండగా.. పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగనున్నారు.  ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. పంచాయతీలు, అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం ప్రజల్లో చైతన్యం రగిలిస్తోంది. దీంతో గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. భాగస్వాములవుతున్నారు. దీంతో పాటు గ్రామాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని కొందరు ముందుకు వస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ వీధుల్లో నెలకొన్న సమస్యలను గుర్తిస్తుండగా.. ముఖ్యంగా నాలుగు ప్రధానాంశాలపై దృష్టి సారించారు. పారిశుధ్యంలో భాగంగా కూలిన ఇండ్లు, పాడు బడిన పశువుల కొట్టాలు, వీధుల్లో పిచ్చి 


మొక్కల తొలగింపు, పాడుబడిన బావుల పూడ్చివేత, నిరుపయోగంగా ఉన్న బోర్ల తొలగింపు, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశు ధ్యం నెలకొల్పేందుకు, సంతలు, మార్కెట్ల ప్రదేశాలను శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం, తడి, పొడి చెత్త బుట్టల ఏర్పాటు, చెత్తను డంపింగ్‌ యార్డుల్లోనే వేసేలా స్థానికులకు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ పంచాయతీల్లో మొక్కలను నాటే ప్రదేశాలను గు ర్తించడం, నర్సరీలను ఏర్పాటు చేయడం కోసం స్థలాల ఎంపిక, శ్మశాన వాటికల నిర్మాణం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో పనులను గుర్తించి.. పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గ్రామసభలు నిర్వహించి.. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించేందుకు నిర్ణయించారు.