ధన్యజీవి 'మంటా మొగిలయ్య ధన్యజీవి


 నర్మాల పరంధాములు(కరీంనగర్ బ్యూరో) సాంప్రదాయ గ్రామీణ జీవితానికి మొగిలయ్య ఒక నిదర్శనము. సంప్రదాయము, ఆధునికత కలగలిసి ఒక కొత్త రూపాన్ని , సంతరించుకోవాలి అనుకునే వాళ్ళకు మొగిలయ్య ఒక సాధించాల్సిన ఆదర్శము”1933 సంవత్సరంలో పూర్వపు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకా ధూళికట్ట గ్రామంలో దేవ సత్తయ్య, శాంతమ్మలకు పెద్దకొడుకుగా పుట్టిన దేవ రాజమౌళియే తెలంగాణ చరిత్రలో ఉద్యమకలం, గళమై తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఘంటా చక్రపాణి తండ్రి ఘంటా మొగిలయ్య. దేవ సత్తయ్య, శాంతమ్మలకు మొత్తం ఆరుగురు పిల్లలు. అందులో ముగ్గురు కొడుకులు రాజమౌళి, రాఘవులు, రాంచంద్రం కాగా ముగ్గురు బిడ్డలు రాధమ్మ, తులసమ్మ, సుశీల. రాజమౌళి తొమ్మిదేళ్ల వయసులో ఉండగా మానేరు తీరంలోని యాస్వాడకు చెందిన ఘంటా మల్లవ్వ, చంద్రయ్యలు రాజమౌళిని పెంపకం కోసం తెచ్చుకున్నారు. అప్పట్లో ఇల్లరికం ఒక సాంప్రదాయం . కొడుకులు లేని దంపతులు అల్లుడిని ఇంటికి తెచ్చుకునేవారు. ఇక ఇల్లరికం వచ్చిన అల్లుళ్లే అత్తమామలతో పాటు ఆ కుటుంబ యోగక్షేమాలు భాద్యతగా చూసుకునేవారు. అప్పటికే ఘంటా మల్లవ్వ భర్త చంద్రయ్య మరణించడంతో వాళ్ళ ఏకైక సంతానమైన జనని కి ఏడేళ్ళ వయసులో రాజమౌళితో పెళ్లి చేసి ఇల్లరికం చేసుకున్నారు. రాజమౌళి పేరు పలకడం కటువుగా ఉందని అత్త మల్లవ్వ మొగిలయ్య గా పేరు మార్చింది. అలా దేవ రాజమౌళి ఘంటా మొగిలయ్యగా మారిండు. వీరి కులం పంబాల. దళితుల్లో ఒక ఉప కులం పంబాల. . క్రీ.శ. రెండో శతాబ్దం నుండే పంబాల ఉనికిలో ఉందని చెప్తుంటారు. వీరినే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో బైండ్ల, ద్యావతల, ఎల్లమ్మల వాళ్ళు 'మంటా మొగిలయ్య కూడా పిలుస్తారు. వీరు ఎల్లవ్వ, పోచమ్మ, మైసమ్మ, మహంకాళి, బాలవ్వ లాంటి గ్రామదేవతలను పూజించడంతో పాటు మనుషులు, పశుపక్షాదులకు స్వస్థత చేకూర్చేందుకు ప్రకృతి వైద్యం చేసేవారు. వీరికి నిజాం నవాబుల కాలంలో రాజవైద్యులుగా గుర్తింపు, గౌరవం లభించినట్టు అప్పటి ఫర్మానాలు చెప్తున్నాయి. ఈ కాలంలో ఒక్కొక్క పంబాల కుటుంబానికి కొన్ని గ్రామాలు కేటాయించి ఆయా గ్రామాలలో గ్రామ దేవతల పూజలతో పాటు మనుషుల, పశువుల ఆరోగ్య సంరక్షణ భాద్యతలు అప్పజెప్పేవారు. అలా గ్రామాల పరిరక్షణకు వతన్ దార్లుగా మారారు. ఏడవ ఫామ్ చదివితే ఉపాధ్యాయులయ్యే అవకాశం ఉన్న ఆ రోజుల్లో ఉద్యోగంలో చేరితే వతన్ పోతుందనేది కారణంగా మల్లవ్వ కుటుంబం మొగిలయ్య దంపతులను ఆరవ ఫామ్ లోనే చదువు మాన్పించారు. అప్పటినుండి మానకొండూరు సమీపంలోని జగ్గయపల్లెకు గ్రామ పూజారిగా వతన్గారుగా మారి డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా సేవలందించారు. ఈ విధంగా ఒక వైపు గ్రామ ఉత్సవ సంస్కృతిని నిలబెడుతూ, అట్టడుగు దళిత బహుజన గ్రామ దేవతల సంస్కృతిని ఆరిపోకుండా కాపాడుతూ వచ్చారు. ఆయుర్వేద వైద్యునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆలా బతుకుబండిని లాగుతూ యాస్వాడలో ఉంటూనే జగ్గయ్యపల్లెను కంటికి రెప్పలా మార్చుకున్నారు. సాంప్రదాయ విలువలు కాపాడుకుంటూనే శాస్త్రీయ వైద్యం మీద అవగాహన కల్పిస్తూ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. మరోవైపు కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను అవగాహన చేసుకొని శాస్త్రీయ ఆలోచనలను ఆవాహన చేసుకున్న వ్యక్తి మొగిలయ్య. ఈ క్రమంలోనే తన పిల్లలు ఆరుగురిని . ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో నేడు వాళ్ళ కుటుంబం నిత్యచైతన్యంతో వర్ధిల్లుతుంది. మొగిలయ్య దంపతులకు ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు. చంద్రమణి అందరికంటే పెద్ద బిడ్డ, 1950 కాలంలోనే నాలుగో తరగతి చదివిన ఆడపిల్ల, అప్పుడు వాళ్ళ ఊర్లో ఐదో తరగతి లేదు. రెండో బిడ్డ కనకతార 1970లో ఆరో తరగతి చదివింది. మూడో బిడ్డ వసంత ఎం.ఎ., బిఈడి చేసింది. ఇక మగపిల్లల్లో పెద్ద కొడుకు అశోక్ సత్యనారాయణ 1975-76 లో కరీంనగర్ నుండి వరంగల్ వెళ్ళి పాలిటెక్నిక్ చదివిండ్రు, ఆకాలంలో పాలిటెక్నిక్ అంటే ఒక విప్లవం. రెండో కొడుకు చక్రపాణి. వచ్చిన మెడిసిన్ వదిలేసి ఎం.ఎ. సోషియాలజీ చేసి జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిండ్రు. అంతే కాకుండా తన పంబాల కుల సంస్కృతిపై పరిశోధన చేసి పీహెచీ సాదించిండ్రు. మూడో కొడుకు చంద్రశేఖర్, ఎం.ఎ. ఎంసిజె డాక్టరేట్ పట్టా పొందిండ్రు. ఘంటా మొగిలయ్య జీవితం గురించి క్లుప్తంగా చెప్పాలంటే... “గ్రామ ఉత్సవ సంస్కృతిని నిలబెడుతూ, అట్టడుగు దళిత బహుజన గ్రామ దేవతల సంస్కృతిని ఆరిపోకుండా కాపాడుతూనే ప్రజలను శాస్త్రీయ విజ్ఞానం వైపు మళ్ళించే ప్రయత్నం చేసిండు. అది తన కుటుంబం నుంచే ప్రారంభించి సమాజానికి ఒక ఆదర్శవంతమైన వారసత్వాన్ని అందజేయడంలో విజయం సాధించిన ధన్యజీవి”