కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి..?


పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి


వరంగల్‌,డిసెంబర్‌ 2 జనం సాక్షి  : కేసీఆర్‌ తర్వాత మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అని  పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కేటీఆర్‌ అన్నివిధాల సమర్థమైన నాయకుడని  అన్నారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో రెండో విడత పల్లె ప్రగతిని ప్రారంభించిన అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడారు. కోతలు లేకుండా చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్లు రావని, కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఉంటుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి జరగకుండా అడ్డుకోవడానికి విపక్షాలు చూడటం సాధారణమేనన్నారు. అన్ని మున్సిపాలిటీలు టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.అంతకుముందు మాట్లడుతూ,  గ్రామాల ప్రగతి కోసమే ప్లలె ప్రగతి కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పారు. ఇళ్లతో పాటు గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. గ్రామానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజా ప్రతినిధులపై తప్పకుండా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టంచేశారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశ్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. రెండో విడత పల్లె ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోందని, దీంతో పల్లెలు వికసిస్తాయని ఆయన ఆకాంక్షించారు.