రాజీలేని పోరాటం రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్లమెంటులో గళమెత్తాలి
మనకు రావాల్సిన బకాయిలపై కేంద్రాన్ని నిలదీయాలి
హైదరాబాద్, జనవరి 27(జనంసాక్షి): 2 రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్లమెంటులో గళమెత్తాలని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ, ఇతర బకాయిలపై పార్లమెంటులో నిలదీయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్లమెంటరీ పార్టీకి దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటులో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. విభజన హామీలపై ఉభయ సభల్లో గట్టిగా పోరాడాలని.. చర్చకు డిమాండ్ చేయాలని వ్యూహం ఖరారు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. 15వ ఆర్థిక సం ఘం రాష్ట్రాలకు నిధులు తగ్గించనున్నట్లు ప్రచారం జరగుతున్నందున దానిని వ్యతిరేకిస్తూ తమ వైఖరిని స్పష్టం చేయాలని సమావేశంలో తీర్మానించారు. పార్లమెంటు దృష్టికి నీతి ఆయోగ్ ప్రతిపాదనలు...కేశవరావు ఇప్పటికీ నెరవేరని విభజన హామీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. కేంద్రం ఇపులు, వివిధ పథకా ప్రస్తావించాలని 'ఉభయ సభల్లో చర్చ కోసం డిమాండ్ చేయాలని కేటీఆర్ సూచించారు. ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ, ఇతర బకాయిలపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని సమావేశంలో తీర్మానించాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేటాయించాల్సిన నిధులు వంటి దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయించారు. వివిధ పథకాలకు అర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించినప్పటికీ కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని.. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని కేటీఆర్ సూచించారు' అని కేశవరావు తెలిపారు. కేంద్రం దృష్టికి రాష్ట్ర వినతులు: నామా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రైతు బీమా, హరితహారం, మిషన్ కాకతీయ వంటి పథకాల స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేసిందని.. ఆ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తున్నప్పటికీ ప్రత్యేక నిధులు కేటాయించకపోవడాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయించినట్లు నామా చెప్పారు. ఐఐఎం, నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేటాయింపుల వంటి రాష్ట్ర వినతులను సమావేశాల్లో లేవనెత్తాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.