స్విమ్స్‌ అవరణలో అన్యమత చిహ్నాలు

ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదుచేసిన రోగులు


తిరుపతి,జనవరి2 (జనం సాక్షి) : తిరుపతి స్విమ్‌ ఆవరణలో అన్యమత చిహ్నాలు కనిపించాయి. కొద్ది కాలంగా టిటిడిలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటన కలకలం రేపింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్‌ ఆస్పత్రిలోని ఆవరణలో ఉన్న 4, 5 చెట్లపై శిలువ గుర్తులు కలకలం రేపాయి. గురువారం తెల్లారేసరికి ఆస్పత్రి ప్రాంగణంలోని చెట్లపై శిలువ గుర్తులు ప్రత్యక్షమయ్యాయి. ఆ శిలువ గుర్తులను చూసిన రోగులు ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్విమ్‌ సిబ్బంది ఆ గుర్తులను తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. గుర్తులున్న చెట్ల బెరడును చెక్కేశారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పోలీసులు ఎలర్ట్‌ అయ్యారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు కూడా ఎలర్ట్‌ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. ఎవరైనా కావాలనే ఇలా చేశారా.. అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.