భారీగా ఖర్చు చేసినా దక్కని విజయం

ఆందోళనలో ఓడిన అభ్యర్థులు


అప్పులు తీర్చే మార్గం ఎలా అన్న భయం


నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతురు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బరిలో నిలిచిన వీరంతా గెలుపుపట్ల అనేక ఆశలు పెట్టుకున్నారు. తీరా ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావడంతో ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ప్రచారంలో తమకు అనుకూలంగా ఉన్న వారు ఎందుకు ఓట్లు వేయలేదని, ఎక్కడ లోపం జరిగిందని చర్చిస్తున్నారు. కొందరు అభ్యర్థుల మాదిరిగా మద్యం పంపిణి చేశామని, నోట్లు వెదజల్లామని, హావిూలను కూడా ఇచ్చామని అయినా లోపం ఎక్కడ జరిగిందంటూ వాపోతున్నారు. తిరిగి ఎన్నికలు 5సంవత్సరాల వరకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మరో 5 సంవత్సరాలు వేచి చూడాలన్న ఆందోళనలో ఉన్నారు. ఖర్చులను ఎలా తేర్పాలన్న ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌లుగా గెలిచినవారికి తీపిని అందిస్తే, ఓటమిపాలైన అభ్యర్థులకు మాత్రం చేదును మిగిల్చాయి. గెలిచినవారు ఇంకా సంబురాల నుంచి తేరుకోలేకపోతుంటే, ఓటమిపా లైన వారికి మాత్రం నిద్ర పట్టడం లేదు. మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బరిలో దిగిన కౌన్సిలర్‌ అభ్యర్థులు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ముందుకు సాగారు. ఎన్నో ఆశలతో ఎన్నికల బరిలో దిగితే ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా రావడంతో ఓటమిని తట్టుకోలేక పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కౌన్సిలర్‌ అభ్యర్థులు ఆ పదవి కోసం అనేకం అప్పులు చేసినట్లు తెలుస్తోంది. గొప్పలకు పోయిన అభ్యర్థులు బరిలో దిగిన నాటినుంచి పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా సాగడంతో చేసేదేవిూ లేక ఖర్చుకు వెనకాడలేదని ఎన్నికల సరళిని చూస్తే తెలుస్తోంది. ఎల్లారెడ్డి మున్సిపాల్టీ బరిలో దిగిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పంట పొలాన్ని తాకట్టు పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే మున్సిపాల్టీ పరిధిలోని ఓ అభ్యర్థి వార్డు ప్రజల కోరిక మేరకు కాలనీలో ఎల్లమ్మ ఆలయం నిర్మాణం కట్టి ఇస్తానని హావిూనిచ్చారు. గెలుపు కోసం పంటపొలాలు ఉన్న వారు ఏకంగా తమ పొలాలను తాకట్టు పెట్టుకోగా, ఇంకొంతమంది ఎకరం, అరెకరం విక్రయించుకోవడం గమనార్హం. పట్టణాలలో గెలుపు ప్రతిష్ఠాత్మకం కావడంతో అప్పులు చేశారు. ఓటుకు ఏకంగా వెయ్యి మొదలుకొని రూ. 3వేల వరకు ఖర్చు చేశారంటే పరిస్థితి ఇట్టే అర్థమౌతుంది. ముఖ్యంగా మున్సిపాల్టీల పరిధిలోని అనేక వార్డుల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు కొంతమేర పలుకుబడి ఉన్నప్పటికీ డబ్బు కూడా కీలకమైంది. వీటికి తోడు విచ్చలవిడిగా పంపిణీ చేసిన మద్యం కూడా అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడు చేసింది. అభ్యర్థులు నామినేషన్ల నుంచి ప్రతీరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మద్యాన్ని ఏరులై పారించారు. మద్యం పంపిణీ చేయడం కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. విందులు భారీగా ఏర్పాట్లు చేశారు. గ్రామాల నుంచి వలసలు వెళ్లిన వారిని రప్పించడం కోసం వాహ నాలు సమకూర్చి, వారికి విందు ఇచ్చి ఓటుకు సుమారుగా రూ. 1500 వరకు చెల్లించిన అభ్యర్థులు ఓట్టు పెట్టించుకొని తిరిగివచ్చారు. ఇలా మున్సిపల్‌ ఎన్నికల బరిలో దిగిన వారు తమ గెలుపు కోసం అయ్యే ఖర్చును అప్పు తీసుకువచ్చి ఖర్చు చేయడంతో పోటీ తీవ్ర రసవత్తరంగా సాగింది. గెలిచిన వాళ్లు ఎలాగైన అప్పులు తీర్చు కుందామని ఆలోచనలో ఉన్నప్పటికీ, ఓడిన వారు మాత్రం ఓటమితో పాటు మిగిలిన అప్పును ఎలా తీర్చాలోనని ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది.