అవంతిపోరా సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌

ఉగ్రవాదిని అంతమొందించిన ఆర్మీ
సైన్యంపై కుట్రలపై అప్రమత్తమైన బలగాలు
శ్రీనగర్‌,జనవరి7(జనంసాక్షి): పుల్వామా జిల్లా అవంతిపోరా సెక్టార్‌లో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవంతిపోరాలో ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబర్‌ 31 రాత్రి నౌషెరా సెక్టార్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇదిలావుంటే భారత సైన్యంపై ఉగ్రవాదులు మరో కుట్ర చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈసారి బాంబు దాడులు కాకుండా.. ఉగ్రవాదులు మరో రూట్‌ను ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నారు. భారత సైన్యాన్ని చంపేందుకు ఉగ్రవాదులు భారీ కుట్రనే పన్నినట్లు తెలుస్తోంది. సైన్యం తీసుకునే ఆహారం, నీటిలో విషం కలపాలని ఉగ్రవాదులు ఎ/-లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణెళి గత వారం విూడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు జరిగాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను అరికట్టడంలో భారత సైన్యం విజయవంతం అయిందన్నారు. సరిహద్దులో భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నారని ఆర్మీ చీఫ్‌ తెలిపారు. బోర్డర్‌లో రక్షణ విషయంలో కఠినంగా ఉంటామని ఆర్మీ చీఫ్‌ స్పష్టం చేశారు.