*మనిషి జీవన దీప సౌందర్యమిది* 

 

నీటి దీపం ఇది తండ హరీష్ మనో క్షేత్రంలో ఆలోచనల బిందువులుగా ఉద్భవించి, జనజీవన ఉపనదులను భావ ప్రవాహాలుగా తనలోకి కలుపుకుంటూ ఆరడుగుల సముద్రంలో కలిసిపోయేలోపు మనిషి మనుగడలో జరిగే మార్పు సవ్వడితో హృదయాన్ని చలింపజేసే అక్షర దృశ్య స్వరూపమే నీటిదీపం కవితా సంపుటి..

 

సగటు మనిషి పొందే వెగటు అనుభవాలను కూడా 

ఆవేదన బండపై ఉతికి,నూతన జ్ఞాపక వస్త్రంగా అందంగా చూపించడంలో హరీష్ గారి సూక్మదృష్టి హృదయానంద జీవన వైవిధ్యం, చదివే పాఠకుల కన్నుల్లో  వెన్నెల ధారగా నవరసాల రుచిని నీటిదీపంగా అందించడంలో హరీష్ గారిలోని సమకాలీన సమాజ చిత్రాలను కలంతో చెక్కే శిల్పి దర్శనమిస్తాడు.

 

మదాన్ని స్రవించే మర్మాంగాల మృగత్వచేతిలో 

చిదిమేయబడి కన్నవారి కలల్లో చితై మిగిలిన స్త్రీల ఆవేదనను,

ప్రపంచానికి బువ్వపెడుతూ అప్పుల వల్లో గువ్వై రాలిపోతున్న రైతు వేదనను‌,

వెక్కిరిస్తున్న అంగవైకల్యంతో సగం చచ్చి చేయిచాపి 

చిల్లర వర్షం పడగా ఆకలనే కరువును కసురుకునే అభాగ్యుల రోదనను,

పిల్లలను పెంచే పవిత్ర కార్యంలో పస్తుల పుటలకింద మగ్గి వృద్ధాప్యకొలిమిలో నిఖార్సయిన వాక్యంగా మిగిలిపోయిన నాన్న మనో ఫలక చిత్రవధ బాధను,

గాలి బుడగోలే క్షణాల్లో పగిలిపోయే ప్రాణసంకట అవస్థలను,

సమాజానికి శ్మశానానికి మధ్య వేలాడే వ్యత్యాస కొలమానమును,

పూర్వ కవులు సమాజానికి అందించిన అమృతబాంఢాగారమును,

ఇలా ఒకటేమిటి, బడి జ్ఞాపకాల నుంచి జీవన పోరాట సుడిగుండాల వరకు అన్నింటికి తనదైన శైలితో 

నీటిదీపంగా అందించి,

పాఠకుల మనసులో ఆలోచన దీపాలను వెలిగించే  తండ హరీష్ గారికి అభినంధనలు తెలుపకమానరు ఎవరైనా...

 

కవిత్వం ఓ ప్రవాహ నది.ఈ ప్రవాహనదిలో 

ఓ కవిని మరో కవితో పోల్చడం నా దృష్టిలో అజ్ఞానమే అవుతోంది. అందులోను ప్రతి సంఘటనకు అందమైన వర్ణనను అందించిన హరీష్ గారు చరిత్రలో ఓ ప్రత్యేక భావ పరిమళ పుష్పమై నిలిచిపోతాడన్నది అక్షరసత్యం.

మరెన్నో మధుర సుధ మనోరంజక భావరాశులను మాకు అందించాలని కోరుకుంటూ...

నీటిదీపం సంపుటి ప్రతి మనిషి చదవాల్సిన సగటుమనిషి జీవన చిత్రమని తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను.

 

                                           *అభిరామ్* 7981463065