ప్రధాని మోదీని కలిసిన మోహన్‌బాబు 


- 45నిమిషాల పాటు భేటీ


- మోహన్‌బాబు వెంట కొడుకు, కూతురు, కోడలు


- బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం


న్యూఢిల్లీ, జనవరి6(జనం సాక్షి) : సినీ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్‌బాబు ప్రధాని మోదీని కలిశారు. సోమవారం ఢిల్లీలో మోహన్‌బాబు.. కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, కుమార్తె మంచు లక్ష్మిలు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటూ ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్‌ షాతోనూ సమావేశంకానున్నారు. మోదీతో భేటీపై మంచు లక్ష్మి ట్వీట్‌ చేశారు. ప్రధానిని కలిశామని.. ఆయన విజన్‌ను దేశం మొత్తం క్లియర్‌గా నిందన్నారు. మోహన్‌బాబు కుటుంబ సమేతంగా వెళ్లి ప్రాధాని నరేంద్ర మోదీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ కూడా బీజేపీలోకి రావాలని మోహన్‌బాబును ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారనే చర్చ నడుస్తోంది. కానీ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మోహన్‌ బాబు వైసీపీలో ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే తనకు కీలక పదవి ఖాయమని ఆయన భావించారు. జగన్‌ సీఎం అయ్యారు గానీ మోహన్‌ బాబు ఆశించింది జరగలేదని, అందుకే ఆయన కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బంధుప్రీతితో వైసీపీలో ఉంటే ఒరిగేదేవిూ లేదన్న ఆలోచనలో ఉన్న మోహన్‌బాబు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపోమాపో ఆయన కమలం కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదేగానీ జరిగితే.. వైసీపీకి మోహన్‌బాబు రూపంలో షాక్‌ తగలడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.