హైదరాబాద్,జనవరి 2 (జనం సాక్షి) : రాజస్థాన్‌లో దారుణం జరిగింది. గత నెల రోజుల్లో కోట ఆస్పత్రిలో సుమారు వంద మంది శిశువులు మరణించారు. హాస్పటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. కోటాలోని జేకే లాన్ ప్రభుత్వ హాస్పటల్లో డిసెంబర్ చివర్లో సుమారు పది మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల మృతి పట్ల ఎన్‌సీపీసీఆర్ సీరియస్ అయ్యింది. హాస్పటల్ క్యాంపస్ పరిసరాలు అద్వాన్నంగా ఉన్నట్లు ఎన్‌సీపీసీఆర్ అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబర్ 23, 24వ తేదీ మధ్య సుమారు పది మంది చిన్నారులు మృతిచెందినట్లు అధికారులు ద్రువీకరించారు. డిసెంబర్ 30వ తేదీన నలుగురు, 31వ తేదీన అయిదుగురు చనిపోయినట్లు హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్ దులారా తెలిపారు. హాస్పటల్ పరిసరాలు శుభ్రంగా లేవని, హాస్పటల్లోని కిటికీ అద్దాలు పగిలిపోయాయని, గేట్లు సరిగా లేవని, క్యాంపస్‌లో పందులు తిరుగుతున్నాయని ఎన్‌సీపీసీఆర్ తన రిపోర్ట్‌లో చెప్పింది.
ఒకే హాస్పటల్లో.. నెల రోజుల్లో వంద మంది శిశువులు మృతి