హైదరాబాద్ : బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గయా జిల్లా అమాస్ పట్టణంలోని విష్ణుపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గయా జిల్లా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గయా జిల్లా ఆస్పత్రికి పంపించారు. లారీ మితిమీరిన వేగంతో రావడమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు చెప్పారు. అధికవేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టిందన్నారు. మృతులంతా గయా జిల్లాకు చెందిన వారని, ఔరంగాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు హాజరై తిరిగి గయాలోని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారని పోలీసులు వివరించారు.
ఘోర రోడ్డు ప్రమాదం...7గురు మృతి