ఒక  సైనికుడి లేఖ...అమ్మా...

నన్ను సైనికుడిగా మార్చి భరతమాత ఋణం తీర్చుకోమని పంపినందుకు ముందుగా నీకు వేల వేల వందనాలు.

నీవు నాలో నింపిన స్ఫూర్తి అందించిన విలువలు నన్ను ఒక వీరునిగా తయారు చేసాయి.

నువ్వు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటావు. నీతో చాలా విషయాలు పంచుకోవాలని ఉంటుంది. కానీ సెల్ ఫోన్ కు సిగ్నల్స్ ఉండవు.  డ్యూటీలో ఉన్నప్పుడు ఇంటిపైన ధ్యాసే ఉండదు. కానీ నేను ఇక్కడ మంచుకొండల్లో ఎముకలు కొరికే చలిని తట్టుకుని రాత్రంతా జాగారం చేసేటప్పుడు మీరందరూ గుర్తుకు వస్తూ ఉంటారు. చిన్నప్పుడు నిద్రపోయేటప్పుడు నువ్వు వెచ్చగా దుప్పటి కప్పేదానివి. కాస్త తొలిగిపోయినా మళ్ళీ మళ్ళీ కప్పేదానివి. ఏ దుప్పటీ, రగ్గూ ఇక్కడి చలిని ఆపుతాయి? 

అమ్మా.. సరియైన భోజన వసతులు లేకున్నా, కొన్ని సార్లు శుభ్రమైన నీళ్ళు కూడా దొరకకపోయినా మేము అస్సలు దిగులుపడం. మరింత ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుంటాము. ఇంకా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటాము. కొన్ని సార్లు చెట్ల కొమ్మలపైన నిద్రించిన రోజులున్నాయి. అదేలాగ గుంతలలో దాక్కొని శత్రువుల జాడ కొరకు నెలల తరబడి మోకాళ్ళ మీద వంగిన రోజులున్నాయి.

అవన్నీ ఇష్టంతో చేసే పనులే కాబట్టి కష్టం అనిపించదు.

శత్రువుల కుటిల యత్నాలు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎంతో కృషి చేస్తుంటాము. అనుక్షణం అప్రమత్తంగా ఉంటాము. ఎప్పుడైనా మాలోని ఒకరికి దెబ్బలు తగిలినప్పుడు అందరమూ విలవిలలాడిపోతాము. 

నేను మిమ్మల్ని వదిలి వచ్చేటప్పుడు నువ్వు, నా భార్యా పిల్లలు బెంగగా చూస్తుంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తానంటూ ఆరా తీస్తుంటారు.

అవన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఎందుకో ఇంటివైపుకు ధ్యాస మళ్ళుతుంది. అంతలోనే మనసు దిటవు చేసుకుని నేలతల్లి సంరక్షణకు ముందుకు పరిగెడతాము.

అమ్మా...

రేపు యుద్ధంలో నాకేమైనా ప్రమాదం జరిగితే నా భార్యకు నీవే ధైర్యం చెప్పలి. నా పిల్లల లేత బుగ్గలపై కన్నీరు తుడిచి వారికి తరగనంత దేశభక్తిని అందించాలి. వారిని కూడా నాలాగా సైనికులుగా మారుస్తానని నాకు మాటివ్వమ్మా...

మన జాతిగౌరవం కోసం నేను చేసిన పోరాటంలో వీరమరణం పొందితే జాతీయ పతాకాన్ని కప్పి గౌరవంగా నా శవ పేటికను ఇంటికి పంపుతారు. అప్పుడు మీరందరూ పోరాడి అర్పించిన నా ప్రాణాలను గురించి గర్వంగా చెప్పుకోవాలి. నా మరణం చరితార్ధమైనదని దేశంలోని కవులందరూ కొనియాడాలి. అప్పుడే ప్రతి ఇంటి నుంచి ఇంకొక సైనికుడు పుట్టుకొస్తాడు. సరికొత్త స్ఫూర్తితో మన దేశాన్ని కాపాడుకుంటాడు. ఒక సైనికుడిగా నా కోరిక ఒక్కటే..

ఏ దేశాలైతే మన దేశాన్ని దురాక్రమణ చేయాలని చూస్తున్నాయో.. మన సైనికుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయో అలాంటి శత్రు దేశాల వస్తువులను, సోషల్ మీడియా ఆప్ లను నిషేధించాలి. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి.. అదిగో..దూరంగా ఏదో అలికిడి వినిపిస్తోంది..యుద్ధం కనుచూపుమేరలో ఆహ్వానం పలుకుతోంది. వెళుతున్నాను. ఈ లేఖ గానో..శవ పేటికగానో.. ఏ రూపంలో  ముందుగా నీ దగ్గరకు చేరుకుంటానో తెలియదు...

 రాలుతున్న నీ రెండు కన్నీటి బొట్ల సాక్షిగా...

నేను ఎప్పుడు నీ కడుపులోనే.. ఈ భారతదేశంలోనే జన్మించాలని ఆశిస్తూ....

సెలవా మరి...

 

ఇట్లు

 నీ ముద్దుబిడ్డ

కల్నల్ భరత్

 

గంజాం భ్రమరాంబ

తిరుపతి

9949932918