వివరాలు సంపూర్ణంగా సమర్పించాలన్న సుప్రీం
మరటోరియం కేసును 13కు వాయిదావేసిన న్యాయస్థానం
న్యూఢిల్లీ,అక్టోబర్5(జనంసాక్షి): మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయడంపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణ మరో వాయిదా పడింది. ఈ కేసులో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడానికి ధర్మాసనం ప్రభుత్వానికి అదనంగా వారం సమయం ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఇదే సమయంలో.. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని కేంద్రం, ఆర్బీఐని సుప్రీంకోర్టు కోరింది. గత నెల 10వ తేదీన దాఖలు చేసిన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆరు నెలల మారటోరియం సమయంలో చిన్న రుణగ్రహీతలకు వడ్డీని వదులుకునే పథకాన్ని రూపొందించడానికి కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో.. ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ వడ్డీలు రూ.5,000-7,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం ఆమోదం పొందిన కేబినెట్ నోట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించారు.
రుణాల చెల్లింపు విషయంలో చక్రవడ్డీ ఎత్తివేతపై కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక సరైన రీతిలో లేదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లాక్‌డౌన్ వేళ రుణాలపై మారిటోరియం విధించిన నేపథ్యంలో ఆ అంశాన్ని సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారించింది. విద్యా, గృహ రుణాలు, క్రెడిట్ కార్డు బాకీలు చెల్లింపు విషయంలో చిన్న వ్యాపారులపై చక్రవడ్డీ వసూల్ చేయదలుచుకోలేదని గత శుక్రవారం సుప్రీంకోర్టుతో కేంద్రం వెల్లడించింది. అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు .. కేంద్రం కానీ, ఆర్బీఐ కానీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని సుప్రీం తెలిపింది. కామత్ ప్యానెల్‌ను కేంద్ర అంగీకరించింది. ఒకవేళ అంగీకరిస్తే ఆ విషయాన్ని తమ అఫిడవిట్‌లో పొందుపరచాలని కేంద్రానికి సుప్రీం సూచన చేసింది.
వడ్డీ మాఫీ నిర్ణయంపై మరో వారం గడువు