తొలి ముఖాముఖి నేనే గెలిచాను: ట్రంప్‌

వాషింగ్టన్‌,అక్టోబరు 1(జనంసాక్షి):అధ్యక్ష సమరంలోని తొలి ముఖాముఖి చర్చలో ప్రత్యర్థి జో బైడెన్‌పై తాను గెలిచానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మిన్నెసొటాలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌.. బైడెన్‌తో జరిగిన ముఖాముఖి గురించి ప్రస్తావించారు.  '47 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బైడెన్‌ చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు, ఆయన వైఫల్యాలను నేను గత రాత్రి ఎండగట్టాను. ఆ పార్టీ ప్రమాదకర ఎజెండాను బయటపెట్టాను. విూ ఉద్యోగాలు పోవడానికి కూడా వారే కారణం' అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. బైడెన్‌ 'బలహీనుడ'ని, ఈ దేశాన్ని నడిపించేందుకు సరిపోరని విమర్శించారు. గత చర్చలో డెమొక్రాట్‌ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అంతేగాక, 'ఈ వైఫల్యంతో మిగిలిన చర్చలను రద్దు చేసుకోవాలని బైడెన్‌ మద్దతుదారులే ఆయనకు సూచిస్తున్నారు' అంటూ ఎద్దేవాచేశారు. మరోవైపు ఈ చర్చలో తాము గెలిచామని డెమొక్రాట్‌ పార్టీ కూడా ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటలకు క్లీవ్‌లాండ్‌లో ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి ముఖాముఖి చర్చ జరిగింది. డెమొక్రాటిక్‌ అభిమాని, ఫాక్స్‌ న్యూస్‌ పాత్రికేయుడు క్రిస్‌ వాలెన్‌ మధ్యవర్తిగా వ్యవహరించిన ఈ చర్చ ఆది నుంచి గందరగోళంగానే జరిగింది. బైడెన్‌ మాట్లాడుతున్న ప్రతిసారి ట్రంప్‌ అడ్డుపడుతూ వచ్చారు. చాలా వరకు నేతలిద్దరూ వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల సమరంలో భాగంగా అధ్యక్ష అభ్యర్థులు మూడు సార్లు ఇలా ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంటుంది.