- యూపీలో ఆటవిక రాజ్యం
- దేశంలో నడిచే అవకాశం కూడా లేదా?: రాహుల్
- ప్రభుత్వం మొద్దునిద్ర వీడే దాకా పోరాటం: ప్రియాంక
లఖ్‌నవూ,అక్టోబరు 1(జనంసాక్షి): కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ హాథ్రస్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. యూపీలోని హాథ్రస్ ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద పోలీసులు అడ్డుకున్న పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకముందు గ్రేటర్ నోయిడా వద్ద వారి వాహనాలను అడ్డుకోవడంతో.. నేతలిద్దరూ దిగి కాలినడకన బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు, రాహుల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్‌ను అంగి పట్టి ఈడ్చి కింద పారేశారు. దీంతో పోలీసుల తీరుపై రాహుల్, ప్రియాంక తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తనను పక్కకు తోసి లాఠీఛార్జి చేశారంటూ రాహుల్ ఆరోపించారు. ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ దేశంలో నడిచేందుకు కూడా అవకాశం లేదా? అని ప్రశ్నించారు. కేవలం ఆరెస్సెస్, భాజపా నేతలు మాత్రమే రోడ్డుపై నడవాలా? అని నిలదీశారు. తొలుత రాహుల్ హాథ్రస్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు సెక్షన్ 188 కింద అరెస్టు చేస్తున్నట్టు ఆయనకు చెప్పారు. ఎపిడమిక్ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకే అడ్డుకున్నట్టు నోయిడా ఏసీపీ తెలిపారు. ఆయన్ను ముందుకు వెళ్లనీయబోమన్నారు. దీనిపై స్పందించిన రాహుల్.. తానొక్కడినే నడిచి వెళ్తానని, అడ్డుకోవద్దని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. అయితే, పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం మొద్దునిద్ర వీడే దాకా పోరాటం: ప్రియాంక
ఉన్నావ్ ఘటనలాగే హాథ్రస్ బాధితురాలి తరఫున పోరాటం చేస్తామని ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలో మహిళలపై అకృత్యాలు ఆగడంలేదన్నారు. వీటికి అడ్డుకట్ట వేసే బాధ్యతను యూపీ సీఎం తీసుకోవాలన్నారు. యువతి అంత్యక్రియల విషయంలో పోలీసులు అనుసరించిన తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. మహిళల రక్షణలో యోగి సర్కార్ మొద్దు నిద్రవీడే దాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. హథ్రాస్ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హాథ్రస్ ఘటనపై వివరణ ఇవ్వండి...
హాథ్రస్ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన ఈ ఘోర సంఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని.. నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, తీవ్రంగా హింసించారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సంఘటనను సుమోటో కేసుగా స్వీకరించినట్టు ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రకటించింది. ఈ విషయమై వివరణ కోరుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర డీజీపీకు నోటీసులు జారీచేసింది.సెప్టెంబర్ 14న తన తల్లితో కలసి పొలానికి వెళ్లిన యువతి.. అనంతరం కనిపించకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆమెను సెప్టెంబర్ 22న కనుగొన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత అలీఘడ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్య కోసం సోమవారం దిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం కన్నుమూసింది. బుధవారం అర్ధరాత్రి యువతి మృతదేహాన్ని ఉత్తర్ ప్రదేశ్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
అంగి పట్టి రాహుల్‌ను ఈడ్చిపడేశారు..