.యూపీలో ఆటవికపాలన

- దేశవ్యాప్తంగా నిరసనలు
- దద్ధరిల్లిన జంతర్‌మంతర్‌
దిల్లీ,అక్టోబరు 2(జనంసాక్షి): హాథ్రస్‌ అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. భీమ్‌ ఆర్మీ, యూత్‌ కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు వేలాది సంఖ్యలో నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం దృష్ట్యా రెండు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. తొలుత ఇండియా గేట్‌ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా.. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో వేదికను జంతర్‌మంతర్‌కు మార్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. దోషులను కఠినంగా శిక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా అన్నారు. దోషులను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానంగా ఉందన్నారు. హాథ్రస్‌ ఘటనపై ప్రధాని మోదీ పెదవి విప్పాలని భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ అన్నారు. ఘటనకు బాధ్యత వహించి యూపీ సీఎం రాజీనామా చేయాలన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఎంతమాత్రం అధికారంలో కొనసాగడానికి అర్హత లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బాధితురాలి గ్రామాన్ని చుట్టిముట్టి విపక్ష నేతలను హాథ్రస్‌కు రాకుండా చేస్తున్నారని, యూపీలో గూండారాజ్‌ నడుస్తోందని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ విమర్శించారు.