నేడు భేటి కానున్న  జీఎస్టీ కౌన్సిల్‌?

న్యూఢిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి):నేడు జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం వాడీవేవీగా జరగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే పరిహారం విషయంలో కేంద్రప్రభుత్వంతో విభేదిస్తున్నాయి. 21 రాష్ట్రాల్లో భాజపా, మిత్రపక్షాలు అధికారంలో ఉండటంతో రూ.97వేల కోట్ల మేరకు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన అప్షన్‌ను అంగీకరించాయి. కానీ, పశ్చిమ్‌ బెంగాల్‌, కేరళ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు మాత్రం దీనిని అంగీకరించలేదు.ఈ నేపథ్యంలో 42వ జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ 5వ తేదీన జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రతిపక్ష రాష్ట్రాలు రుణ అవకాశాలను తోసిపుచ్చి జీఎస్టీ పరిహారానికి ప్రత్యామ్నాయ మార్గాలను కోరవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రాలకు రూ.2.35 లక్షల జీఎస్టీ ఆదాయ లోటు ఏర్పడింది. వీటిలో రూ.97 వేల కోట్లు జీఎస్టీ అమలుతో ఏర్పడ్డ లోటు ఉంది. అదికాకుండా మరో రూ.1.38 లక్షల కోట్లు కొవిడ్‌ కారణంగా తగ్గింది. ప్రభుత్వం రూ.97 వేల కోట్లను ఆర్‌బీఐ వద్ద రుణంగా తీసుకోమని రాష్ట్రాలకు చెప్పింది. లేకపోతే మొత్తం రూ.2.35 లక్షల కోట్లను మార్కెట్‌ నుంచి సేకరించమని పేర్కొంది. వీటిని చెల్లించేందుకు ఖరీదైన, సిన్‌ గూడ్స్‌పై 2022 వరకు అదనపు పన్ను విధించే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది.